AP Politics Family Disputes Personal Attacks:  ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ,  ఆయన సతీమణి అన్నా లెజినోవా  తమ 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ ఉమ్మడి ప్రకటన విడుదల చేయడం తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా  సంచలనంగా మారింది. తమ మధ్య పరస్పర అవగాహన, గౌరవంతోనే విడిపోతున్నామని, పిల్లల శ్రేయస్సు కోసం స్నేహితులుగా కొనసాగుతామని వారు వెల్లడించినప్పటికీ, ప్రజాజీవితంలో ఉన్న అత్యున్నత నాయకుడి వ్యక్తిగత జీవితం కావడం వల్ల ఈ అంశం క్షణాల్లో రాజకీయాంశంగా రూపాంతరం చెందింది. ప్రజాప్రతినిధులు, సినీ దిగ్గజాలకు వ్యక్తిగతం  అంటూ ప్రత్యేక సరిహద్దులు ఉండవనే నిజాన్ని ఈ పరిణామం మరోసారి రుజువు చేసింది.

గతంలో పవన్ పెళ్లిళ్లపై జగన్ వ్యాఖ్యలు                   

పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై, ఆయన మూడు వివాహాల వ్యవహారంపై గత కొన్నేళ్లుగా ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ నిరంతరం విమర్శలు గుప్పిస్తూనే వచ్చాయి. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే వేదికలపై నుంచి పవన్ కళ్యాణ్‌ను  నిత్య పెళ్లి కొడుకు అని ఎద్దేవా చేస్తూ తీవ్రస్థాయిలో  విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. అయితే, తాజాగా పవన్-అన్నా విడిపోతున్నారనే వార్త వెలువడిన తక్షణమే వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ నేతలకు కీలకమైన అంతర్గత సూచనలు జారీ చేశారు.  పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని, విడాకుల అంశాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ రాజకీయ విమర్శలకు అస్త్రంగా మార్చుకోవద్దని ఆయన శ్రేణులకు ఆదేశించారు. 

వైసీపీ నిర్ణయానికి కారణమేంటి?               

వైఎస్ జగన్ ఈ విధంగా ముందస్తు జాగ్రత్త పడటం వెనుక బలమైన రాజకీయ కారణాలు దాగి ఉన్నాయి. గత కొంతకాలంగా జగన్ మోహన్ రెడ్డి సొంత కుటుంబంలోనే తీవ్రమైన విభేదాలు బయటపడి, రచ్చకెక్కాయి. . వైఎస్ షర్మిల, విజయమ్మ ,  జగన్‌ల మధ్య ఆస్తుల పంపిణీ, రాజకీయం చుట్టూ జరుగుతున్న అంతర్గత పోరును ఎన్‌డీయే కూటమి నేతలు తీవ్రంగా టార్గెట్ చేస్తూ వస్తున్నారు.  సొంత చెల్లెలికి, తల్లికి న్యాయం చేయలేని నాయకుడు  అంటూ జగన్‌పై విమర్శల దాడి జరుగుతున్న తరుణంలో.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితంపై వైఎస్సార్‌సీపీ దాడికి దిగితే, తిరిగి ఎన్‌డీయే నేతలు జగన్ కుటుంబ వివాదాలను మరింత గట్టిగా ప్రజాక్షేత్రంలో ఎండగట్టే అవకాశం ఉందనేది తాడేపల్లి వ్యూహకర్తల అంచనా.

అది  వారి సమస్య -ప్రజా సమస్య కాదు!

పైగా, సాధారణ ప్రజల్లో పవన్ కళ్యాణ్-అన్నా లెజినోవా విడాకుల ప్రకటన పట్ల ఒక రకమైన సానుభూతి వ్యక్తమవుతోంది. అన్నా లెజినోవా రష్యన్ పౌరురాలు అయినప్పటికీ తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించడం, భారతీయ ఆచారాలను పాటించడం ద్వారా అభిమానుల మనస్సులో చెరగని ముద్ర వేశారు. అంతర్గత విభేదాల కారణంగా 55 ఏళ్ల వయసులో బంధం ముగియడంపై పవన్ అభిమానులు, సాధారణ నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు. ఇలాంటి సున్నితమైన సమయంలో పవన్‌పై రాజకీయ విమర్శలు చేస్తే, అది ప్రజా ప్రతికూలతకు దారితీసి, పవన్‌కే మైలేజ్ ఇస్తుందనే విశ్లేషణలు ఉన్నందున జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.

తర్వాత అయినా అస్త్రంగా మార్చుకోరా? 

 నాయకులు విమర్శలు వద్దని సూచించినంత మాత్రాన పొలిటికల్ స్క్రీన్‌పై ఈ అంశాలు శాశ్వతంగా కనుమరుగైపోవు. సామాజిక మాధ్యమాలు, ద్వితీయ శ్రేణి నాయకుల ద్వారా ఇరువర్గాలు పరోక్ష విమర్శలు చేసుకోవడం సర్వసాధారణం. ఏపీ రాజకీయాల్లో ఇప్పటికే ఫ్యామిలీ ఇష్యూస్  అనేవి ప్రధాన అజెండాగా మారిపోయాయి. అసెంబ్లీ వేదికల నుంచి రోడ్డు ప్రచారాల వరకు నాయకుల సొంత కుటుంబాలు, బంధాలు, వ్యక్తిగత ఎంపికలు విమర్శలకు ముడిసరుకుగా మారుతున్న ట్రెండ్ రాబోయే రోజుల్లో మరింత ఎక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ విడాకుల వ్యవహారంలో జగన్ మోహన్ రెడ్డి వ్యూహాత్మక మౌనం , టార్గెట్ చేయవద్దు  అన్న హెచ్చరిక తన సొంత డిఫెన్స్ కోసం వేసుకున్న రాజకీయ రక్షణ కవచం లాంటిదే. వ్యక్తిగత అంశాలపై ఆధారపడే రాజకీయాలు సుదీర్ఘకాలంలో ఏ పార్టీకి లబ్ధి చేకూర్చవని, ప్రజలు ప్రజా సమస్యలు, పాలనా విధానాల ఆధారంగానే తీర్పు ఇస్తారని ఈ తాజా పరిణామాలు మరొకసారి ఎత్తిచూపుతున్నాయి.