Vijayawada Cyber Fraud: సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. విజయవాడలోని పెజ్జోనిపేటకు చెందిన ఓ వృద్ధుడి బ్యాంకు ఖాతా నుంచి ఏకంగా రూ.24 లక్షలు కొల్లగొట్టారు. బాధితుడికి తెలియకుండానే బ్యాంకు ఖాతాలోని నగదుతో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సేవింగ్స్ ఖాతాలో ఉన్న సొమ్మును సైబర్ నేరగాళ్లు మాయం చేశారు. ఇంటి నిర్మాణం కోసం ఎంతోకాలంగా దాచుకున్న డబ్బు క్షణాల్లో మాయమవడంతో వృద్ధుడు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.

బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి అక్టోబర్ 20వ తేదీ నుంచే అనధికారిక లావాదేవీలు జరిగినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. అయితే ఈ విషయాన్ని బాధితుడు వెంటనే గుర్తించలేకపోయాడు. నవంబర్ 4వ తేదీన బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ అలర్ట్ ఈ-మెయిల్స్ రావడంతో తన ఖాతాలో నగదు మాయమైన విషయాన్ని గుర్తించాడు. వెంటనే బ్యాంకు లావాదేవీల వివరాలను పరిశీలించగా, తనకు తెలియకుండానే ఖాతాలోని నగదుతో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సేవింగ్స్ ఖాతాలోని సొమ్ము కూడా మాయమైనట్లు గుర్తించాడు. మొత్తం రూ.24 లక్షలు సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లినట్లు తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అక్టోబర్ 20 నుంచి జరిగిన అనుమానాస్పద లావాదేవీల వివరాలను సేకరిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. నగదు ఏయే ఖాతాలకు బదిలీ అయింది? ఈ మోసం వెనుక ఎవరున్నారు? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు.