AP Govt : ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు నిత్యావసర వస్తువులను రాయితీపై పంపిణీ చేయాలని నిర్ణయించింది. క్రిస్మస్, సంక్రాంతి పండుగలను దృష్టిలో ఉంచుకొని కూటమి సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read : AP Cabinet: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. 30కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్.. చంద్రబాబు నేతృత్వంలో భేటీ!
ప్రైవేట్ మార్కెట్లో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో మధ్య తరగతి, పేద వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నిత్యావసరాల ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, రాయితీపై ప్రజలకు అందించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కేబినెట్ సబ్ కమిటీలోనూ ఈ మేరకు నిర్ణయించారు. దీంతో డిసెంబర్ నెల నుంచి మూడు నెలల పాటు రేషన్ కార్డు లబ్ధిదారులకు రాయితీపై నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
క్రిస్మస్, సంక్రాంతి పండుగలను దృష్టిలో ఉంచుకొని రేషన్ దుకాణాల ద్వారా రాయితీపై నిత్యావసర వస్తువులను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ షాపుల ద్వారా కార్డులు ఉన్నవారికి కిలో కందిపప్పు రూ.100, గోధుమపిండి రూ. 25, లీటరు పామాయిల్ రూ.125 చొప్పున అందించనుంది. ఈ సబ్సిడీ పథకం అమలుకు నెలకు రూ.100.20 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. మూడు నెలలకు కలిపి సుమారు రూ.300.60 కోట్ల భారం పడనుంది. ఈ గరిష్ట సబ్సిడీ పరిమితికి లోబడి పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ధరల స్థిరీకరణ నిధి కింద రూ.1.20 లక్షల టన్నుల కందులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. కేంద్రం ఈ మేరకు 40,338 టన్నులు కేటాయించింది. ముడికందుల లభ్యతకు అనుగుణంగా సేకరణతోపాటుగా పప్పు తయారీ ఒప్పందాలు చేసుకోవాలని పౌరసరఫరాల సంస్థ ఎండీ, వీసీని పౌరసరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా పామాయిల్ సేకరించాలని, మూడు నెలల తరువాత రాయితీపై నిత్యావసర వస్తువులు అందించే కార్యక్రమాన్ని పొడిగించాల్సి వస్తే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

