MIT Snake Robot: మనిషి శరీరంలోని అత్యంత సంక్లిష్టమైన భాగాల్లో చిన్న పేగులు కూడా ఒకటి. వీటిలో సమస్యలను గుర్తించడం, అవసరమైన పరీక్షలు నిర్వహించడం వైద్యులకు కొన్నిసార్లు సవాలుగా మారుతుంది. అయితే ఈ సమస్యకు పరిష్కారం చూపే దిశగా అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) పరిశోధకులు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. పాము ఆకారంలో ఉండే ఓ చిన్న సాఫ్ట్ రోబోట్‌ను రూపొందించారు. ఇది చిన్న పేగుల్లోకి వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించడంతో పాటు అవసరమైతే కణజాల నమూనాలను సేకరించడం, మందులను నేరుగా అందించడం వంటి పనులు చేయగలదు.

పాము కదలికల స్ఫూర్తితో తయారీ

ఈ రోబోట్‌ను రూపొందించడానికి పరిశోధకులు పాముల కదలికలను స్ఫూర్తిగా తీసుకున్నారు. ముఖ్యంగా జారుడు ఉపరితలాలపై కూడా పాములు సులభంగా కదలగలిగే విధానాన్ని పరిశీలించారు. మనిషి పేగుల్లో ఉండే తేమతో కూడిన జారుడు వాతావరణంలో కూడా రోబోట్ ముందుకు వెళ్లేలా ప్రత్యేకమైన ఆకృతిని రూపొందించారు. ఇందుకోసం దాని ఉపరితలంపై ప్రత్యేకమైన ఆకృతి కలిగిన పూతను ఏర్పాటు చేశారు. ఇది పేగుల లోపలి శ్లేష్మ పొరపై పట్టును సాధించడానికి సహాయపడుతుంది.

MIT పరిశోధకులు ఈ పరికరానికి BIOSENTER అని పేరు పెట్టారు. ఇందులో గాలితో ఉబ్బే ప్రత్యేక విభాగాలు, చిన్న యాంకరింగ్ బెలూన్లు ఉంటాయి. ఇవి ఒక క్రమ పద్ధతిలో ఉబ్బడం, తిరిగి కుంచించుకోవడం ద్వారా పేగుల గోడలను పట్టుకుని రోబోట్‌ను కొద్దికొద్దిగా ముందుకు కదిలిస్తాయి.

బయాప్సీ నుంచి మందుల పంపిణీ వరకు..

ఈ రోబోట్‌లో కేవలం కదలడానికి అవసరమైన వ్యవస్థ మాత్రమే కాకుండా వైద్య పరీక్షలకు ఉపయోగపడే పలు పరికరాలను కూడా అమర్చారు. ఇందులో చిన్న కెమెరా ఉంటుంది. దీని ద్వారా పేగుల లోపలి భాగాలను పరిశీలించవచ్చు. అలాగే అవసరమైన ప్రాంతంలో మందులను స్ప్రే చేసే పరికరం, కణజాల నమూనాలను సేకరించేందుకు బయాప్సీ క్లిప్స్ కూడా ఉంటాయి. పేగుల్లో కనిపించే చిన్న పాలిప్స్‌ను తొలగించేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

దీనికి అదనంగా జపాన్‌కు చెందిన కిరిగామి (Kirigami) కళ స్ఫూర్తితో ప్రత్యేకమైన గ్రిప్పింగ్ స్లీవ్స్‌ను రూపొందించారు. కాగితాన్ని కత్తిరించి, మడతలు పెట్టడం ద్వారా ఆకృతులు తయారు చేసే ఈ కళ ఆధారంగా రూపొందించిన స్లీవ్స్.. రోబోట్ పేగుల గోడలపై పట్టును నిలుపుకోవడానికి సహాయపడతాయి.

చిన్న పేగుల పరీక్షల్లో కొత్త మార్పులు?

మనిషి చిన్న పేగులు 20 అడుగులకు పైగా పొడవు ఉంటాయి. వీటిని పూర్తిగా పరిశీలించడం ప్రస్తుతం అంత సులభం కాదు. ఇందుకోసం వైద్యులు సాధారణంగా బెలూన్ సహాయంతో పనిచేసే ప్రత్యేక ఎండోస్కోపులను ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియ కొంత సమయం తీసుకోవడంతో పాటు క్లిష్టంగా కూడా ఉంటుంది.

ఈ నేపథ్యంలో BIOSENTER వంటి రోబోట్లు భవిష్యత్తులో చిన్న పేగుల పరీక్షలను మరింత సులభతరం చేసే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. పేగుల్లో ఏదైనా పాలిప్ కనిపిస్తే దాని నుంచి నమూనా సేకరించడం లేదా తొలగించడం వంటి చికిత్సా విధానాలకు కూడా ఇది ఉపయోగపడవచ్చు.

పందుల పేగుల్లో విజయవంతమైన పరీక్షలు

ఈ రోబోట్ పనితీరును పరిశీలించేందుకు పరిశోధకులు పందుల పేగుల్లో ప్రయోగాలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో రోబోట్ సుమారు ఆరున్నర అడుగుల దూరం ప్రయాణించింది. ఈ క్రమంలో చిత్రాలను సేకరించడం, బయాప్సీ చేయడం, మందులను అందించడం వంటి సామర్థ్యాలను ప్రదర్శించింది.

MITలో మెకానికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌గా, బ్రిగమ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్‌లో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌గా పనిచేస్తున్న జియోవన్నీ ట్రావెర్సో ఈ పరిశోధనలో కీలక పాత్ర పోషించారు. భవిష్యత్తులో చిన్న పేగులను మరింత ఆటోమేటిక్‌గా పరిశీలించే వ్యవస్థలను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.

అయితే ప్రస్తుతం ఈ రోబోట్ ప్రయోగాత్మక దశలోనే ఉంది. మనుషులపై సాధారణ వైద్య వినియోగానికి అందుబాటులోకి రావడానికి మరిన్ని పరిశోధనలు, పరీక్షలు అవసరం. మొత్తంగా ఈ సాంకేతికత భవిష్యత్తులో జీర్ణవ్యవస్థ సంబంధిత వ్యాధుల గుర్తింపు, చికిత్సలో కొత్త అవకాశాలను అందించే అవకాశం ఉంది.