BJP Strategy To Win Back Uttar Pradesh Voters: దేశ రాజకీయాలకు గుండెకాయ వంటి ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి ఊహించని సవాళ్లు ఎదురవుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ సాధించిన చారిత్రాత్మక విజయాల నుంచి మొదలుకొని, ఇటీవలి శాసనమండలి, ఉపఎన్నికల వరకు అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ వ్యూహాత్మకంగా పుంజుకుంటోంది. వరుసగా రెండుసార్లు విజయం సాధించి అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని కాషాయ సర్కార్‌పై క్షేత్రస్థాయిలో కొంత ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. జాతీయ అంశాల ప్రాతిపదికన జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనే ఎస్పీకి ఓటర్లు పట్టంగట్టినప్పుడు, రాష్ట్ర స్థాయి స్థానిక అంశాల ఆధారంగా జరిగే శాసనసభ ఎన్నికల్లో బిజెపి పట్టు కోల్పోయే ప్రమాదం ఉందన్న చర్చ జాతీయ స్థాయిలో తీవ్రంగా సాగుతోంది.
యూపీలో పట్టు సడలితే బీజేపీకి గండమే
ఉత్తరప్రదేశ్ వంటి 80 లోక్‌సభ స్థానాలు కలిగిన అతిపెద్ద రాష్ట్రంలో బిజెపి గ్రాఫ్ పడిపోవడం అనేది కేవలం ఒక రాష్ట్రానికి పరిమితమైన సమస్య కాదు. అది నేరుగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వ స్థిరత్వం , ఢిల్లీ పీఠంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎస్పీ ప్రయోగించిన పిడిఏ వెనుకబడిన, దళిత, మైనారిటీ సోషల్ ఇంజనీరింగ్ సూత్రం బిజెపికి ఉన్న సాంప్రదాయ ఓటు బ్యాంకులో భారీగా గండికొట్టింది. నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, ద్రవ్యోల్బణం, యాదవేతర ఓబిసిలలో వ్యక్తమవుతున్న అసంతృప్తిని అఖిలేష్ యాదవ్ సమర్థవంతంగా తమకు అనుకూలంగా మలచుకోవడంలో సక్సెస్ అయ్యారు.
అనేక ప్రయోగాలు చేస్తున్న యోగి
ఈ క్లిష్ట పరిస్థితిని అధిగమించేందుకు బిజెపి అధిష్ఠానం , ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బహుముఖ వ్యూహాలను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మొదటిది, సామాజిక సమీకరణాల పునర్నిర్మాణం . దళితులు, ఓబిసి వర్గాలను మళ్లీ తమ వైపు తిప్పుకునేందుకు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన అప్నా దళ్, సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ , నిషాద్ పార్టీలతో సమన్వయాన్ని పెంచుకోవడం. రెండవది, పరిపాలనా వేగం . పెండింగ్‌లో ఉన్న సంక్షేమ పథకాలను వేగవంతం చేయడం, పేపర్ లీకేజీలపై కఠిన చట్టాలు తేవడం , యువతకు ఉద్యోగ నియామకాల ద్వారా అసంతృప్తిని చల్లార్చడంపై దృష్టి సారించారు. యోగీ ఆదిత్యనాథ్‌కు ఇది కేవలం పార్టీ ఉనికికి సంబంధించిన అంశం మాత్రమే కాదు, ఆయన సొంత నాయకత్వ పట్టును నిరూపించుకునే అగ్నిపరీక్ష. బుల్డోజర్ రాజ్ నినాదంతో శాంతిభద్రతల పరిరక్షణలో తనదైన ముద్ర వేసిన యోగి, ఇప్పుడు దానికి ' సమగ్ర సంక్షేమం - సామాజిక న్యాయం అనే కోణాన్ని జోడించక తప్పని పరిస్థితి ఏర్పడింది. యోగి తన కఠినమైన హిందూత్వ ఇమేజ్‌తో పాటు ఆర్థిక అభివృద్ధిని, ఉపాధి అవకాశాలను కలగలిపి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
యూపీని చేజారకుండా చూసుకోవడమే ముఖ్యం
రాబోయే రోజుల్లో యుపి రాజకీయం మరింత ఆసక్తికరంగా మారనుంది. బిజెపి జాతీయ నాయకత్వం ఉత్తరప్రదేశ్‌ను చేజారకుండా చూసుకోవడానికి స్వయంగా మైదానంలోకి దిగి అమిత్ షా, నడ్డా స్థాయి వ్యూహకర్తలతో దిద్దుబాటు చర్యలు ముమ్మరం చేయనుంది. యోగి ఆదిత్యనాథ్ తన పరిపాలనా పట్టుతో ఎస్పీ సృష్టిస్తున్న సునామీని అడ్డుకుని కమలాన్ని మళ్లీ పూర్వ వైభవానికి తీసుకెళ్తారా లేక అఖిలేష్ యాదవ్ జోరు ముందు డిఫెన్స్‌లో పడతారా అనేది భారత రాజకీయాల్లో రాబోయే అతిపెద్ద ట్విస్ట్ కానుంది.

