AP Municipal Elections Polling Trends 2026: ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ స్థానిక సంస్థలు, కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ పర్వం ముగిసింది. మున్సిపల్ పరిధిలోని పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో ప్రధాన అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో భద్రమైంది. క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారం , పోలింగ్ సరళిని విశ్లేషిస్తే.. ఎన్నికల సమరం దాదాపు ఏకపక్షంగానే సాగిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అధికార ఎన్డీయే కూటమి సమన్వయంతో, అత్యంత ఉత్సాహంగా ఓటర్లను పోలింగ్ బూతులకు తరలించగలిగితే, వైఎస్సార్‌సీపీ శ్రేణులు మాత్రం మొదటి నుంచి ఆ స్థాయి వ్యూహాత్మక ఉత్సాహాన్ని ప్రదర్శించలేకపోయాయని భావిస్తున్నారు.
సందేహంగానే పోటీ చేసిన వైసీపీ క్యాడర్
వాస్తవానికి ఈ పురపాలక సమరంలో పోటీకి దిగడంపై వైఎస్సార్‌సీపీ కేడర్‌లో ప్రాథమికంగా కొంత సందేహాలు నిలిచాయి. ఓటమి చవిచూసిన తర్వాత ఏర్పడిన నిరాశ, ఆర్థిక , లీగల్ ఒత్తిళ్ల కారణంగా పోటీకి దిగేందుకు స్థానిక నేతలు వెనుకాడారు. అయితే, పార్టీ ఉనికిని చాటుకోవడానికీ, కేడర్ చేజారకుండా చూడటానికి ఎన్నికల బరిలో నిలవాల్సిందేనని అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోటీలో నిలిచారు. పోటీపడినప్పటికీ గెలుపును నిర్దేశించే ఎలక్షన్ మేనేజ్‌మెంట్ , నిధుల సమీకరణ , ముమ్మర ప్రచారంలో అధికార కూటమిని ఢీకొట్టే స్థాయిలో వైసీపీ సీరియస్‌గా దృష్టి సారించలేకపోయిందనే అభిప్రాయం వినిపిస్తోంది.
లోకల్ లీడర్లపై అనేక ఒత్తిళ్లు
స్థానిక నాయకత్వంపై రకరకాల ఒత్తిళ్లు ఉండటం, అనేక ప్రాంతాల్లో నామినేషన్ల ఘట్టం నుంచి ప్రచారం దాకా అనుకున్న స్థాయిలో సహకారం లభించకపోవడం వల్ల ఈ పుర ఎన్నికల్లో వైసీపీకి ప్రతికూల ఫలితాలు వస్తాయనే అంచనాలు వెలువడుతున్నాయి. అయితే, రాయలసీమలోని కొన్ని కంచుకోటలు, కడప, పులివెందుల, ఉమ్మడి ఉమ్మడి జిల్లాలలోని సొంత సీట్లతో పాటు పట్టణాల్లోని పేద వర్గాల ఓటు బ్యాంక్ తమను గట్టెక్కిస్తుందని వైఎస్సార్‌సీపీ ఆశాభావంతో ఉంది. కనీస స్థాయిలో స్థానాలు సాధించినా సరే, పార్టీ ఇమేజ్ నిలబడుతుందని అధిష్ఠానం ధీమాగా ఉంటే.. పరాజయం ఎదురైతే కేడర్ మానసిక స్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది.
కంచుకోటల్లో మంచి ఫలితాలపై వైసీపీ ఆశలు
ఈ పురపాలక ఫలితాలు కేవలం మున్సిపాలిటీలు లేదా కార్పొరేషన్ల అధికార పీఠాలకే పరిమితం కాకుండా, ఇరు పార్టీల శ్రేణుల మానసిక దృక్పథం పై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల పరాజయం తర్వాత కోలుకోవడానికి ప్రయత్నిస్తున్న వైసీపీకి ఈ ఫలితాలు ఒక పరీక్ష లాంటివి. ఒకవేళ ఊహించని విధంగా వైసీపీ ఓ మాదిరి ఫలితాలను సాధించగలిగితే.. "పార్టీకి ఇంకా క్షేత్రస్థాయిలో పట్టు ఉంది, ప్రజాదరణ తగ్గలేదు అనే సందేశం ప్రజల్లోకి వెళ్లి, నాయకుల్లో సరికొత్త ఉత్సాహం నిండుతుంది. క్లిష్ట సమయం నుంచి కోలుకోవడానికి ఆ పార్టీకి ఇవి సంజీవనిలా ఉపయోగపడతాయి.
ఏకపక్ష విజయాలు ఆశిస్తున్నకూటమి
మరోవైపు, అధికారంలోకి వచ్చాక సాధిస్తున్న ఈ విజయాల ఊపును కొనసాగించాలని ఎన్డీయే కూటమి ఉవ్విళ్లూరుతోంది. పట్టణ ప్రాంత ఓటర్లు ఎప్పుడూ అభివృద్ధి, మౌలిక సదుపాయాల వైపే మొగ్గు చూపుతారని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాలు తమకే విజయాన్ని అందిస్తాయని కూటమి నేతలు చెప్తున్నారు. నవంబర్ 3న వెలువడబోయే ఓట్ల లెక్కింపు ఫలితాలు వైఎస్సార్‌సీపీ భవిష్యత్ కార్యాచరణకు అత్యంత ప్రాధాన్యమైన దిక్సూచిగా మారనున్నాయి. ఈ ఫలితాలు వైసీపీని మళ్లీ పుంజుకునేలా ఉత్సాహపరుస్తాయా లేక అధికార కూటమికి తిరుగులేని ఆధిక్యాన్ని ఇచ్చి ప్రతిపక్షాన్ని మరింత ఇరకాటంలో పడేస్తాయా అనేది మరో రోజులో స్పష్టం కానుంది.

