IND vs NZ: భారత్‌తో టీ20 సిరీస్‌ను కోల్పోయిన న్యూజిలాండ్ జట్టుకు వన్డే సిరీస్‌ మొదలు కాకముందే మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టుకు చెందిన ఇద్దరు కీలక ఆటగాళ్లు రచిన్ రవీంద్ర, మార్క్ చాప్‌మన్ గాయాల కారణంగా వన్డే సిరీస్‌కు దూరమయ్యారు. భారత్, న్యూజిలాండ్ మధ్య 5 వన్డేల సిరీస్ నవంబర్ 4 నుంచి మొదలు కానుంది. కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో కివీస్ జట్టు తమ జట్టులో పలు మార్పులు చేయాల్సి వచ్చింది.

రచిన్ రవీంద్ర భుజం గాయంతో బాధపడుతుండగా.. మార్క్ చాప్‌మన్ ఎడమ కాలి హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు. తాజాగా నిర్వహించిన ఎంఆర్ఐ స్కాన్‌లో చాప్‌మన్ గాయం నుంచి కోలుకోవడానికి మరో రెండు వారాల సమయం పడుతుందని తేలింది. మరోవైపు భుజం గాయంతో ఇబ్బంది పడుతున్న రచిన్ కూడా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేకపోయాడు. దీంతో వీరిద్దరూ భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌లో ఆడటం లేదు. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్ జట్టులో మరో ముగ్గురు ఆటగాళ్లకు సంబంధించి కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. మొదట చివరి రెండు వన్డేల కోసం ఎంపికైన టిమ్ సీఫర్ట్.. రచిన్, చాప్‌మన్ గాయాల కారణంగా ఇప్పుడు పూర్తి సిరీస్‌ ఆడనున్నాడు. అలాగే తొలి మూడు వన్డేల కోసం హెన్రీ నికోల్స్‌ను కొత్తగా జట్టులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇండియా-A జట్టుతో అనధికారిక టెస్టు మ్యాచ్‌లు ఆడుతున్న డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ చివరి రెండు వన్డేలకు అందుబాటులోకి రానున్నాడు.

భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదు వన్డేల సిరీస్ నవంబర్ 4న మొదలు కానుండగా.. తొలి వన్డే ఆక్లాండ్‌లో, రెండో వన్డే నవంబర్ 7న వెల్లింగ్టన్‌లో నిర్వహించనున్నారు. మూడో వన్డే నవంబర్ 10న హామిల్టన్‌లో జరగనుంది. ఇక నాలుగో వన్డే నవంబర్ 13న, ఐదో వన్డే నవంబర్ 15న మౌంట్ మాంగనూయ్‌లో జరగనున్నాయి. టీ20 సిరీస్ ఓటమి తర్వాత వన్డేల్లోనైనా పుంజుకోవాలని న్యూజిలాండ్ ఆశించినా.. ఇద్దరు కీలక ఆటగాళ్లు గాయాలతో దూరం కావడం కివీస్ జట్టుకు సమస్యగా మారింది.