Irfan Pathan Slams Bhuvneshwar Kumar: న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ తొలి మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించినప్పటికీ.. చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. సిరీస్ ముగిసిన నేపథ్యంలో భారత జట్టు ప్రదర్శనపై విశ్లేషణలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మాజీ భారత ఆల్‌రౌండర్, 2007 టీ20 ప్రపంచ కప్ విజేత ఇర్ఫాన్ పఠాన్.. బీసీసీఐ సెలెక్టర్ల నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను ఈ సిరీస్‌లో ఆడించడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డాడు. భువీ ఆడడంతో యువ ఫాస్ట్ బౌలర్లకు అవకాశాలు లేకుండా పోయాయని ఫైర్ అయ్యాడు.

16 ఓవర్లలో ఏకంగా 180 రన్స్:


నాలుగేళ్ల విరామం తర్వాత భారత జట్టులోకి తిరిగి వచ్చిన భువనేశ్వర్ కుమార్.. న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాడు. నాలుగు మ్యాచ్‌లు ఆడిన భువీ.. 16 ఓవర్లలో ఏకంగా 180 రన్స్ ఇచ్చి, ఒకే ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. 11.25 ఎకానమీతో రన్స్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో భువనేశ్వర్ బౌలింగ్‌పై విమర్శలు వస్తున్నాయి. టీ20 ప్రపంచ కప్‌కు ఇంకా చాలా సమయం ఉన్నప్పుడు అతడిని ఈ సిరీస్‌లో ఆడించాల్సిన అవసరం ఏమిటని సెలెక్టర్లను ఇర్ఫాన్ పఠాన్ ప్రశ్నించాడు. తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన ఇర్ఫాన్.. భువనేశ్వర్‌ను ఈ సిరీస్‌లో ఆడించడం ద్వారా యువ ఫాస్ట్ బౌలర్లు అవకాశాలు కోల్పోయారని పేర్కొన్నాడు.

సెలెక్టర్లు చేసిన పెద్ద తప్పిదం:
‘నా అభిప్రాయం ప్రకారం.. ఈ సిరీస్‌లో భువనేశ్వర్ కుమార్‌ను ఆడించడం సెలెక్టర్లు చేసిన పెద్ద తప్పిదం. భువనేశ్వర్ మంచి బౌలర్, సీనియర్ ఆటగాడు అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ టీ20 ప్రపంచ కప్‌కు ఇంకా చాలా సమయం ఉన్నప్పుడు అతడిని ఈ సిరీస్‌లో ఆడించడం ఎందుకు?. సమీపంలో ఉన్న వన్డే ప్రపంచ కప్ కోసం అతడిని సిద్ధం చేయాలనుకుంటే అది మంచి నిర్ణయం అయి ఉండేది. ఈ సిరీస్‌లో భువనేశ్వర్‌ను తీసుకోవడం ద్వారా యువ ఫాస్ట్ బౌలర్లకు అవకాశం ఇవ్వలేకపోయాం. మయాంక్ యాదవ్ అన్ని మ్యాచ్‌లు ఆడి అనుభవం సంపాదించేవాడు. ప్రిన్స్ యాదవ్ కూడా ఆడే అవకాశం ఉండేది. న్యూజిలాండ్ వంటి పరిస్థితుల్లో యువ బౌలర్లు ఆడితే వారికి ఎంతో విలువైన అనుభవం లభించేది’ అని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు.

మరింత అనుభవం సంపాదిస్తారు:
భువనేశ్వర్ కుమార్ సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడమే తన విమర్శలకు కారణం కాదని ఇర్ఫాన్ స్పష్టం చేశాడు. ‘భువనేశ్వర్ సరిగ్గా ఆడలేదని నేను ఈ వ్యాఖ్యలు చేయడం లేదు. అతడు కొంత దురదృష్టవంతుడు. తొలి రెండు ఓవర్లలో బాగా బౌలింగ్ చేశాడు. కానీ ఆ తర్వాత పవర్‌ప్లే చివరి ఓవర్‌లో పరుగులు ఇచ్చాడు. ఇలాంటి పరిస్థితులు ఏ ఆటగాడికైనా ఎదురవుతాయి. అతడి నైపుణ్యంపై ఎలాంటి ప్రశ్నలు లేవు. యువ ఫాస్ట్ బౌలర్‌కు ఈ సిరీస్‌లో అవకాశం ఇచ్చి ఉంటే అది మరింత మెరుగైన నిర్ణయం అయ్యేది. ఫాస్ట్ బౌలర్లను అభివృద్ధి చేయాలంటే వారికి అవకాశాలు ఇవ్వడం చాలా ముఖ్యం. ముఖ్యంగా తప్పులకు అవకాశం తక్కువగా ఉండే అసలైన పిచ్‌లపై వారు ఆడాలి. అలాంటి పరిస్థితుల్లో ఆడినప్పుడే వారు మరింత అనుభవం సంపాదిస్తారు’ అని ఇర్ఫాన్ వివరించాడు.