UPI Transactions: భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఊహించని రీతిలో శరవేగంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు చేతిలో నగదు ఉంటేనే నిత్యావసరాలు లేదా కొనుగోళ్లు సాధ్యమనే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు వీధి చివర చిన్న టీ కొట్టు నుంచి మొదలుకొని భారీ షాపింగ్ మాల్స్ వరకు ప్రతిచోటా స్మార్ట్‌ఫోన్‌తో క్షణాల్లో చెల్లింపులు పూర్తవుతున్నాయి. దేశంలో సాగుతున్న ఈ భారీ డిజిటల్ విప్లవంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) మరో అరుదైన మైలురాయిని అధిగమించి ఆల్‌టైమ్ సరికొత్త రికార్డును నెలకొల్పింది.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. అక్టోబర్ నెలలో యూపీఐ లావాదేవీలు మునుపెన్నడూ లేని సరికొత్త రికార్డ్స్ ను నమోదు చేయవచ్చు. ఈ ఒక్క నెలలోనే లావాదేవీల మొత్తం విలువ తొలిసారిగా రూ. 30 లక్షల కోట్ల మార్కును అధిగమించి, ఏకంగా రూ. 31.53 లక్షల కోట్లకు చేరి సరికొత్తచరిత్ర సృష్టించింది. సంఖ్య పరంగా చూస్తే అక్టోబర్‌లోనే రికార్డు స్థాయిలో 2,547 కోట్ల లావాదేవీలు పూర్తయ్యాయి. అక్టోబర్ నెలలో ప్రతిరోజూ సగటున దాదాపు 82.2 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఇక వీటి మొత్తం విలువ పరిశీలిస్తే.. ప్రతిరోజూ సగటున రూ. 1,01,707 కోట్ల విలువైన చెల్లింపులు జరిగాయి. అంటే దేశంలో యూపీఐ ద్వారా రోజువారీగా లక్ష కోట్ల రూపాయలకు పైగా నగదు లావాదేవీలు సాగడం విశేషం.

దసరా, దీపావళి పండుగల సీజన్ సందర్భంగా దేశవ్యాప్తంగా కొనుగోళ్లు వెల్లువెత్తడం ఈ రికార్డు స్థాయి వృద్ధికి ప్రధాన ఊతాన్నిచ్చింది. సెప్టెంబర్ నెలతో పోలిస్తే అక్టోబర్‌లో లావాదేవీల సంఖ్య 5.8% పెరగగా.. మొత్తం విలువలో 7.4% పెరుగుదల కనిపించింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే.. గతేడాది అక్టోబర్‌తో పోల్చితే లావాదేవీల సంఖ్యలో 23%, విలువలో 16% భారీ వృద్ధి నమోదైంది. 2016లో కేవలం 21 బ్యాంకులతో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన యూపీఐ ప్రస్థానం, నేడు వందలాది బ్యాంకులు, విభిన్న ఫిన్‌టెక్ యాప్‌లు, కోట్లాది మంది వినియోగదారులతో ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన చెల్లింపుల వ్యవస్థగా అవతరించింది. భారత్‌లో నగదు రహిత లావాదేవీలను సామాన్యుడి చేతికి చేర్చి దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చడంలో ఇది విప్లవాత్మక పాత్ర పోషించింది.