Telangana BJP Mission Telangana Amit Shah Visit:  పశ్చిమ బెంగాల్ ఎన్నికల వ్యూహాల అనంతరం భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఇప్పుడు దక్షిణాదిలో అత్యంత కీలకమైన తెలంగాణపై దృష్టి పెట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా మైదానంలోకి దిగి  మిషన్ తెలంగాణ  సన్నాహకాలను పర్యవేక్షించబోతున్నారు. దీనికి ప్రధాన నాందిగా హైదరాబాద్‌లో పాదయాత్ర చేస్తున్నారు.  ఈ పాదయాత్రతో తెలంగాణ రాజకీయ క్షేత్రంలో కమలం పార్టీ తన శైలిని పూర్తిగా మార్చి, కాంగ్రెస్, బిఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును దక్కించుకోవడానికి తీవ్రమైన రాజకీయ దాడిని ప్రారంభించనుంది.

నాయకుల అంతర్గత ఆధిపత్య పోరాటాన్ని క్లియర్ చేసిన నబీన్ 

ఇప్పటికే తెలంగాణ బీజేపీలో ఉన్న అంతర్గత విభేదాలు, నాయకుల ఆధిపత్య పోరాటాలను కట్టడి చేయడానికి పార్టీ జాతీయ నాయకత్వం గట్టి దిద్దుబాటు చర్యలను చేపట్టింది. నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ప్రమాణస్వీకారం తర్వాత రాష్ట్రాల నాయకత్వ సమన్వయంపై ప్రత్యేక దృష్టి సారించి, నాయకుల మధ్య వైరుధ్యాలను తొలగించి క్రమశిక్షణను పునరుద్ధరించే దిశగా అడుగులు వేశారు. కేడర్‌లో నైరాశ్యాన్ని తుడిచిపెట్టి, ఎన్నికల యంత్రాంగం తరహాలో సమగ్రంగా పనిచేసే విధంగా రాష్ట్ర యూనిట్‌ను దిశానిర్దేశం చేసిన తర్వాతనే అమిత్ షా వంటి అగ్ర వ్యూహకర్త స్వయంగా పర్యటనలకు సన్నాహాలు చేసుకున్నారు. 

అమిత్ షా పాదయాత్ర వెనుక భారీ వ్యూహం

అమిత్ షా స్వయంగా పాదయాత్రలో పాల్గొనడం వెనుక కమలనాథుల పక్కా పొలిటికల్ ప్లానింగ్ దాగి ఉందనే ప్రచారం సాగుతోంది. హైదరాబాద్‌లోని నిజాం కాలేజ్ నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర కేవలం ఓట్ల రీవిజన్ సవాళ్లకు మాత్రమే పరిమితం కాకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యం, రైతు భరోసా, ఎల్‌నినో కరవు సవాళ్లను అస్త్రాలుగా మలుచుకోవాలనే ఆలోచనలో బిజెపి ఉంది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో దక్కిన గెలుపును అలాగే నిలబెట్టుకుంటూ, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రాబోయే అసెంబ్లీ రేసు నాటికి బీజేపీని ఏకైక ప్రత్యామ్నాయ శక్త్యగా నిలబెట్టాలనేది అధిష్ఠానం వ్యూహంగా కనిపిస్తోంది.

ఓటు బ్యాంకును పెంచుకునే కార్యాచరణ అవసరం

ఈ పాదయాత్ర సంచలనం సృష్టిస్తుందన్న విశ్వాసంతో బిజెపి శ్రేణులు భావిస్తున్నప్పటికీ, తెలంగాణ రాజకీయ వాతావరణం మాత్రం అత్యంత సంక్లిష్టంగా ఉంది. ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సంక్షేమ పథకాలు , పారిశ్రామిక ప్రాజెక్టులతో పట్టు బిగించే యత్నం చేస్తుంటే, మరోవైపు బిఆర్ఎస్ వర్గాలు సైతం రేవంత్ ప్రభుత్వాన్ని నిరంతరం ఇరకాటంలో పెట్టేలా క్షేత్రస్థాయి ఆందోళనలు చేపడుతున్నాయి. ఈ రెండింటి నడుమ మూడో శక్తిగా ఎదగడానికి ప్రయత్నిస్తున్న కమలదళం, అమిత్ షా పాదయాత్ర ద్వారా ఏమేరకు ప్రజల్లో త నమ్మకాన్ని కలిగించగలుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.కేవలం ఒక పాదయాత్ర లేదా అగ్రనేతల పర్యటనల ద్వారానే ఓటర్ల మూడ్ మారిపోదు. నగర ప్రాంతాలలో బిజెపికి ఉన్న పట్టును గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సరైన అభ్యర్థులను పునర్నిర్మించడం,  నిత్యం ప్రజల సమస్యలపై పోరాడే కిందిస్థాయి క్యాడర్‌ను బలోపేతం చేయడం అత్యంత అవసరం. అమిత్ షా ప్రచార పర్వం పార్టీకి తాత్కాలికంగా సరికొత్త ఉత్సాహాన్ని అందించినప్పటికీ, అది ఓటు బ్యాంకుగా మారాలంటే నిరంతర క్షేత్రస్థాయి కార్యాచరణ తప్పనిసరి.

 తెలంగాణ రాజకీయంలో అమిత్ షా ఎంట్రీతో బిజెపి గేర్ మార్చబోతుందనేది స్పష్టమవుతోంది. మిషన్ బెంగాల్  తరహాలోనే నిరంతర నిఘా, క్రమశిక్షణతో కూడిన వ్యూహాలను అమలు చేస్తూ తెలంగాణ పీఠంపై కమలాన్ని వికసింపజేయాలన్నది షా అజెండా.