ఆదిలాబాద్: రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులకు బాధ్యత వహిస్తూ, ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఎగ్గొట్టిన రైతుబంధు బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎగ్గొట్టిన 3 విడతల రైతుబంధుతో పాటు ప్రస్తుత యాసంగి పంట పెట్టుబడి సాయాన్ని కలిపి ఎకరానికి రూ.60 వేల చొప్పున ప్రతి రైతు ఖాతాలో వెంటనే జమ చేయాలన్నారు. రైతులతో పాటు రైతు కూలీలకు కూడా ఇచ్చిన హామీ మేరకు ఆర్థిక సహాయం అందించాలన్నారు. 

ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని కేటీఆర్ అన్నారు. తెలంగాణ కంటే రెండింతల వర్షపాతం లోటు ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఇలాంటి కరువు పరిస్థితులు లేవని, అన్ని వనరులు, సాగునీటి అవకాశాలు అందుబాటులో ఉన్న తెలంగాణలో మాత్రం ప్రభుత్వ వైఫల్యం కారణంగా రైతులు కరువు కోరల్లో చిక్కుకున్నారని విమర్శించారు. ఎల్‌నినో పేరు చెప్పి బాధ్యత నుంచి తప్పించుకునే పరిస్థితి లేదని, రాష్ట్రంలో నెలకొన్న కరువుకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆదిలాబాద్ రైతు గర్జన సభలో కేటీఆర్ డిమాండ్ చేశారు.

రైతుబంధు రూ.15 వేలకు పెంచుతానని మోసం 

కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.10 వేలు రైతుబంధు అందిస్తే, తాను అధికారంలోకి వస్తే రూ.15 వేలు ఇస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. రూ.15 వేల రైతుబంధు ఇస్తానని చెప్పి రైతులను మోసం చేసిన దుర్మార్గుడు ఎవరో ప్రజలు ఆలోచించాలని అన్నారు. రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని, 2022 మే 6న వరంగల్ సభలో రాహుల్ గాంధీ రైతులకు ఇచ్చిన హామీలను గుర్తుచేశారు. మేం హామీ ఇస్తే చేసి చూపిస్తామని రాహుల్ గాంధీ చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కృత్రిమ కరువు ఆదిలాబాద్‌ వేదికగా జరిగిన 'రైతు గర్జన' సభలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS. సభలో కేటీఆర్ ప్రసంగంలోని కీలక ముఖ్యాంశాలు: 🔹కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిన మూడు విడతల రైతుబంధు బకాయిలతో పాటు, ప్రస్తుత యాసంగి పంట పెట్టుబడి సాయాన్ని కలిపి ఎకరానికి వెంటనే రూ.60,000 చొప్పున ప్రతి రైతు ఖాతాలో జమ చేయాలి. రైతు కూలీలకు ఇచ్చిన ఆర్థిక సాయం హామీని సైతం అమలు చేయాలి. 🔹తెలంగాణ కంటే రెండింతల వర్షపాతం లోటు ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కరువు పరిస్థితులు లేవు. పుష్కలంగా నీటి వనరులున్నా.. కేవలం కాంగ్రెస్ అసమర్థత వల్లే తెలంగాణ రైతులు కరువు కోరల్లో చిక్కుకున్నారు. 🔹గోదావరి నుంచి 750 టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నా, కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి ఒక్క చుక్క నీటిని కూడా ఎత్తిపోయడం లేదు. కరెంట్ లేదు, సాగునీరు లేదు, పరిశ్రమలకు ప్రోత్సాహం లేదు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని అన్ని రంగాలు సంక్షోభంలో పడ్డాయి.

— BRS Party (@BRSparty) November 1, 2026

రూ.2 లక్షల రుణమాఫీ ఏమైంది? రైతుబంధు ఏమైంది? తులం బంగారం ఏమైంది? ఫీజు రీయింబర్స్‌మెంట్ ఏమైంది? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1000 రోజులు దాటినా ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయిందన్నారు. రైతులకు 3 విడతల రైతుబంధు ఎగ్గొట్టారని, నాలుగు పంటలకు సంబంధించిన పెట్టుబడి సాయం అందించాల్సి ఉందని తెలిపారు. 21 లక్షల మంది రైతులకు రైతుబంధు అమలు చేయాలని, కౌలు రైతులకు ఆర్థిక సహాయం చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 36 వేల మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.

రైతుబంధు దేవుడెరుగు.. నేడు రైతులు వ్యవసాయం చేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు వేయడానికి రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటున్నారని, దుక్కి దున్నొద్దు.. భూములను పడావు పెట్టుకోవాలని చెప్పే పరిస్థితి వచ్చిందని విమర్శించారు.

రైతుబంధు బంద్ అయింది కానీ రాహుల్ బంధు మాత్రం బంద్ కాలేదని ఎద్దేవా చేశారు. రైతులకు డబ్బులు ఇవ్వడానికి నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం ఢిల్లీకి మాత్రం డబ్బులు క్రమం తప్పకుండా పంపుతోందని విమర్శించారు. రైతుల ఆశలు అడియాశలయ్యాయని, రైతులను ఆదుకోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం వారిని మరింత సంక్షోభంలోకి నెట్టిందన్నారు.

రాష్ట్రంలోని అన్ని రంగాలకు హాలిడే

తెలంగాణలో నీళ్లు బంద్, పరిశ్రమలు బంద్, కరెంట్ బంద్, చివరకు వ్యవసాయం కూడా బంద్ అయ్యే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని రంగాలకు హాలిడే ప్రకటించినట్లుగా పాలన సాగుతోందని అన్నారు. మంచిగా ఉన్న విద్యుత్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేసిందని, పరిశ్రమలు మూతపడే పరిస్థితి తీసుకొచ్చిందని విమర్శించారు. రైతులకు సాగునీరు లేదు, పరిశ్రమలకు అవసరమైన విద్యుత్, ప్రోత్సాహం లేదు.. రాష్ట్రం అన్ని రంగాల్లో సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు.

రాష్ట్రాన్ని నడుపుతున్నది నల్లమల పిల్లి అని వ్యాఖ్యానించారు. రైతులకు, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికే హాలిడే ప్రకటిస్తే ప్రజల గోస తీరుతుందనే విధంగా పరిస్థితి తయారైందన్నారు.

వర్షపాతం లోటు కంటే ప్రభుత్వ వైఫల్యమే కారణం

తెలంగాణలో కరువు పరిస్థితులు ఏర్పడటానికి ప్రకృతి వైపరీత్యాల కంటే ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని కేటీఆర్ అన్నారు. తెలంగాణ కంటే రెండింతల వర్షపాతం లోటు ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కరువు పరిస్థితులు లేవని, తెలంగాణలో మాత్రం సాగునీటి వనరులు అందుబాటులో ఉన్నా రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

ఇది ఎల్‌నినో తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని స్పష్టం చేశారు. కరువు రాక్షసిని రేవంత్ రెడ్డి మళ్లీ తెలంగాణకు తీసుకొచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే కరువు, కన్నీళ్లు, వలసలు అనే పరిస్థితి ఏర్పడిందన్నారు.

కేసీఆర్ పాలనలో రైతుల పరిస్థితి బ్రహ్మాండంగా ఉండేదని, రైతులు పుట్లకొద్దీ వడ్లు పండించారని గుర్తుచేశారు. ఇప్పుడు మాత్రం రైతులు పంటలు వేయాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 108 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు.

కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి ఎత్తిపోయడం లేదు

గోదావరి జలాలను వినియోగించుకోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి లక్ష క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతున్నా వాటిని ఎత్తిపోయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. గోదావరి నుంచి 750 టీఎంసీల నీళ్లు వచ్చినా ఒక్క చుక్క కూడా ఎత్తిపోయని దుర్మార్గపు పరిస్థితి నెలకొందని విమర్శించారు. నీళ్లు ఎత్తిపోయడానికి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

కన్నెపల్లి దగ్గర నీళ్లు ఎత్తిపోయవచ్చని రిటైర్డ్ ఇంజినీర్లు సూచించారని, కానీ రేవంత్ రెడ్డి వారిపై అడ్డగోలుగా మాట్లాడారని అన్నారు. నీళ్లు ఎత్తిపోయవచ్చని ఇంజినీర్లు చెబితే వారికి బెల్ట్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలన్నట్లుగా మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. నీళ్లు ఇస్తే యూరియా ఇవ్వాలి.. పంటలు పండితే కొనుగోలు చేయాలి.. రైతులకు బాధ్యతగా అండగా నిలవాలి. ఈ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు అందించడంలో నిర్లక్ష్యం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు.

చంద్రబాబు కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్తుంటే తెలంగాణలో మాత్రం సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. గోదావరి జలాలను కిందికి వదిలి తెలంగాణను ఎడారిగా మార్చే పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను సక్రమంగా వినియోగిస్తే ఒక్క ఎకరం కూడా ఎండిపోయేది కాదు. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులను సక్రమంగా వినియోగించుకుని ఉంటే తెలంగాణలో ఒక్క ఎకరం కూడా ఎండిపోయే పరిస్థితి ఉండేది కాదని కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కరువుకు కల్పతరువు లాంటిదని పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ కక్షతో వ్యవహరించకుండా రైతుల ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. మాపై ఉన్న అక్కసును కాళేశ్వరం ప్రాజెక్టుపై తీర్చుకోవద్దని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో చనాకా–కొరాటా ప్రాజెక్టు ట్రయల్ రన్ పూర్తయిందని, అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కాలువల నిర్మాణం చేపట్టడం లేదని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు.

కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు.. కాంగ్రెస్ అంటే కరువు అని వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్ పరిశ్రమలను నిర్వీర్యం చేస్తున్నారు.. గుజరాత్‌కు తరలిస్తున్నా ప్రశ్నించరా?. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న పరిశ్రమలను కాపాడడంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు విఫలమయ్యారని కేటీఆర్ విమర్శించారు. ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీని నిర్వీర్యం చేసి, తుక్కు కింద మార్చి విక్రయించే పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు.

తెలంగాణకు చెందిన పరిశ్రమలను గుజరాత్‌కు తరలిస్తున్నా ఆదిలాబాద్‌కు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. స్థానిక పరిశ్రమలను కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై లేదా అని ప్రశ్నించారు. ఆదిలాబాద్ వంటి వెనుకబడిన ప్రాంతానికి మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, జాతీయ విద్యాసంస్థలు తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తెలంగాణకు ఒక్క జాతీయ ప్రాజెక్టు కూడా మోదీ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు.

ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. బీజేపీకి ఓటు వేసి 13 ఏళ్లు గడిచినా తెలంగాణకు, ఆదిలాబాద్‌కు ఏం మేలు జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బొగ్గు కుంభకోణాలతో సింగరేణిని దివాలా తీయిస్తున్నారు. సింగరేణి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థికంగా దెబ్బతీస్తోందని కేటీఆర్ విమర్శించారు. బొగ్గు కుంభకోణాలతో సింగరేణిని దివాలా తీసే పరిస్థితికి తీసుకొచ్చారని ఆరోపించారు.

తెలంగాణకు కీలకమైన సింగరేణి సంస్థను కాపాడాల్సిన ప్రభుత్వం దాని ప్రయోజనాలను దెబ్బతీస్తోందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో మెరుగ్గా ఉన్న విద్యుత్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో పరిశ్రమలు, విద్యుత్, సాగునీరు వంటి కీలక రంగాలు సంక్షోభంలో పడుతున్నాయని, తెలంగాణ అభివృద్ధికి అవసరమైన పారిశ్రామిక వాతావరణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోందన్నారు.

బడేభాయ్, చోటేభాయ్ కలిసి తెలంగాణకు అన్యాయం 

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తోడుదొంగలని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో రెండు పార్టీలు పరస్పరం పోరాడుతున్నట్లు నటిస్తాయని, ఢిల్లీలో మాత్రం కలిసి పనిచేస్తాయని ఆరోపించారు. బడేభాయ్, చోటేభాయ్ కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇది డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కాదని.. జుమ్లా, హమ్లా అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న కరువు పరిస్థితులపై బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డిని గట్టిగా నిలదీశారా అని ప్రశ్నించారు. రైతులకు రావాల్సిన నిధులు, సాగునీటి సమస్యలు, పరిశ్రమల పరిస్థితిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డికి బూతులు తప్ప మరేమీ తెలియదు

రైతుల సమస్యలకు పరిష్కారం చూపాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బూతులు మాట్లాడటం తప్ప మరేమీ చేయడం లేదని కేటీఆర్ విమర్శించారు. రిటైర్డ్ ఇంజినీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, సాగునీటి సమస్యలపై విమర్శలు చేసిన వారిని బెదిరించే ధోరణి సరికాదన్నారు. రైతుబంధు బకాయిలు చెల్లించకుండా, సాగునీరు అందించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ఢిల్లీకి మాత్రం డబ్బులు క్రమం తప్పకుండా పంపుతున్నారని, రైతులకు మాత్రం నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు.

రిమ్స్ ఆసుపత్రిలో చిన్నారుల మృతి.. బాధిత కుటుంబాలకు కేటీఆర్ ఆర్థిక సహాయం

గత నెలలో ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు చిన్నారులు మృతి చెందడం పట్ల కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబాలను ఆదుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస భద్రత, నిర్వహణ సరిగా లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రిమ్స్ ఆసుపత్రిలో ఎలుకలు కొరికి చిన్నారులు చనిపోతున్నారనే వార్తలు రావడం ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ పరిస్థితికి అద్దం పడుతోందని విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు, చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు, భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

ఒక్క సంవత్సరం ధైర్యంగా ఉండండి..  
తెలంగాణ రైతులు అధైర్యపడవద్దని, ఒక్క సంవత్సరం ధైర్యంగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని, రైతులను తిరిగి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కేసీఆర్ పాలనలో రైతులకు సాగునీరు, ఉచిత విద్యుత్, రైతుబంధు వంటి పథకాలతో భరోసా లభించిందని గుర్తుచేశారు. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న కరువు, ఆర్థిక సంక్షోభానికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఎగ్గొట్టిన మూడు విడతల రైతుబంధు బకాయిలతో పాటు యాసంగి పెట్టుబడి సాయాన్ని కలిపి ఎకరానికి రూ.60 వేల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు కూలీలకు ఇచ్చిన హామీలను కూడా వెంటనే అమలు చేయాలని కోరారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ వారి పక్షాన పోరాటం కొనసాగిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఆదిలాబాద్ జిల్లాపై కేటీఆర్ వ్యాఖ్యలు

కొమురం భీమ్ పుట్టిన గడ్డ ఆదిలాబాద్ అని, తెలంగాణ కాశ్మీర్‌గా పేరొందిన ఈ జిల్లా ప్రకృతి అందాలకు తలమానికమని కేటీఆర్ అన్నారు. అడవుల జిల్లా, ఆదివాసీల ఖిల్లా, తెల్ల బంగారం పండించే నేల అయిన ఆదిలాబాద్‌కు రావడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ పాలనలో ఆదిలాబాద్ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని గుర్తుచేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన రైతు గర్జన సభకు చేరుకున్న కేటీఆర్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.