Cyclone Murasu : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడిన మురసు.. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఏపీవైపు దూసుకొస్తోంది. ఈ తుపాను ఇవాళ అర్ధరాత్రి లేదంటే మంగళవారం తెల్లవారుజామున నెల్లూరు – నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ తుపాను కారణంగా ఏపీలోని పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు.
తుపాను తీరందాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గరిష్ఠంగా 120 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ తుపాను ప్రభావంతో ఇవాళ, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. పలు జిల్లాల్లో సహాయకె చర్యల కోసం ముందస్తుగా ఆరు ఎన్డీఆర్ఎఫ్, ఏడు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
మురసు తుపాన్ మంగళవారం తెల్లవారుజాము సమయంలో నెల్లూరు – నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉండటంతో నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సోమవారం ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల సెలవు ప్రకటించారు. మంగళవారం కూడా భారీ వర్షం నేపథ్యంలో సెలవు ప్రకటించే అవకాశం ఉంది. తుపాను కారణంగా కృష్ణపట్నం పోర్టులో మూడో నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇవాళ, రేపు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతుండగా.. తీర ప్రాంత, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
నెల్లూరుతోపాటు ఎన్డీఆర్, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు అధికారులు సెలవులు ప్రకటించారు.
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడిన మురసు
ప్రస్తుతం చెన్నైకి 260 కిమీ, నెల్లూరుకు 290 కిమీ, మచిలీపట్నానికి 320 కిమీ, కావలికు 310 కిమీ, ఒంగోలుకు 330 కిమీ,విశాఖపట్నానికి 470కిమీ దూరంలో కేంద్రీకృతం https://t.co/QEUCKmH81x
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) November 2, 2026


పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడిన మురసు