TDP Allegations On YSRCP Polling Violence:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ అత్యంత సున్నితంగా ఉండే ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లా,  రాయలసీమ ప్రాంతంలో ఎన్నికల రాజకీయం ఒక్కసారిగా ఉద్రిక్త రూపం దాల్చింది. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చొక్కా మడతవేస్తాం అనే సవాల్‌తో పాటు,  పోలింగ్ రోజున ఎంతమంది వస్తారో రండి.. చూసుకుందాం  అంటూ ప్రతిపక్షాలకు విసిరిన తీవ్ర హెచ్చరికలు రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. జగన్ చేసిన ఈ పరుషమైన వ్యాఖ్యలు కేవలం రాజకీయ ప్రచారానికి పరిమితం కాలేదని, పోలింగ్ రోజున క్షేత్రస్థాయిలో హింసను, రీపోలింగ్ వాతావరణాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని ఎన్నికల సంఘం  తీవ్రంగా పరిగణిస్తోంది.

పోలింగ్ రోజు ఘర్షణలు తప్పవా? 

ముఖ్యంగా కడప, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు వంటి ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో జగన్ వ్యాఖ్యల తర్వాత పరిస్థితులు క్షణక్షణానికి వేడెక్కుతున్నాయి. గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయాంలో మాచర్ల, తాడిపత్రి, కారంచేడు తదితర ప్రాంతాల్లో చెలరేగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో ఉంచుకుని.. ఈ సారి రాయలసీమలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా రాష్ట్ర ఎన్నికల సంఘం అత్యంత కఠినమైన భద్రతా చర్యలు తీసుకుంటోంది.   పల్నాడు, రాయలసీమ జిల్లాల్లోని సున్నితమైన, అత్యంత సున్నితమైన  పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అక్కడ అదనపు బలగాలను  మోహరించేందుకు ఎస్‌ఈసీ ప్రణాళిక సిద్ధం చేసింది. జగన్ వ్యాఖ్యలపై అధికార పక్షం ఎన్డీయే నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఓటమి భయంతోనే వైఎస్సార్‌సీపీ శ్రేణులు సీమ ప్రాంతంలో భయాందోళనలు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నాయని,  చూసుకుందాం అనే పిలుపు వెనుక ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి పోలింగ్ శాతాన్ని తగ్గించే పక్కా ప్లాన్ ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.


సోషల్ మీడియాలోనూ సవాళ్లు

 గతంలో జరిగిన పోలింగ్ హింసను గుర్తుచేస్తూ, ఫ్యాక్షన్ ముసుగులో బూత్ క్యాప్చరింగ్‌లు లేదా గొడవలకు దిగితే ఉపేక్షించేది లేదని, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు శాఖ ఇప్పటికే కడప జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి గస్తీ ముమ్మరం చేసిందని మంత్రులు స్పష్టం చేస్తున్నారు.ఇక సోషల్ మీడియా వేదికగానూ ఇరు వర్గాల మద్దతుదారుల మధ్య డిజిటల్ వార్ ముదిరిపాకాన పడింది. వైఎస్సార్‌సీపీ కేడర్ జగన్  చొక్కా మడత వీడియోలను, మాస్ డైలాగులను రీల్స్‌గా మలిచి నెట్టింట ట్రెండ్ చేస్తుండగా.. ఎన్డీయే మద్దతుదారులు మాత్రం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి  అని హెచ్చరించే కౌంటర్ వీడియోలను షేర్ చేస్తున్నారు. రాయలసీమలో పోలింగ్ రోజున స్వల్ప ఘర్షణలు జరిగినా అవి పెద్ద ఎత్తున విస్తరించే ప్రమాదం ఉందన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరందుకోవడంతో సామాన్య ఓటర్లలో ఒక విధమైన భయాందోళన నెలకొంది. 

కఠిన చర్యలు తీసుకుంటున్న ఎస్ఈసీ   

ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర పోలీసు శాఖ సంయుక్తంగా జీరో టాలరెన్స్  విధానాన్ని ప్రకటించాయి. పులివెందుల, కడప నియోజకవర్గాల్లోని ప్రతి పోలింగ్ కేంద్రాన్ని వెబ్‌కాస్టింగ్ ద్వారా నేరుగా అమరావతి కంట్రోల్ రూమ్‌కు అనుసంధానిస్తున్నారు. రౌడీషీటర్లు, గతంలో ఎన్నికల నేరాలకు పాల్పడిన వ్యక్తులకు ఇప్పటికే బైండోవర్ నోటీసులు జారీ చేయడమే కాకుండా, సభల్లో ఆవేశపూరిత, హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు చేసే నాయకుల ప్రసంగాల పై ప్రత్యేక నిఘా ఉంచారు.  ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది శాంతియుత వాతావరణంలో జరగాల్సిన పండగ లాంటి ప్రక్రియ. అయితే, నాయకుల సవాళ్లు, ప్రతిసవాళ్లు రాయలసీమను మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాల నీడలోకి నెట్టేలా కనిపిస్తున్నాయి.