Miyapur Land Auction Challenges Encroachments: తీవ్ర ఆర్థిక లోటు, రుణాల భారం, హామీల అమలుకు నిధుల లేమితో సతమతమవుతున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి మియాపూర్ భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సరికొత్త ఆశలను చిగురింపజేసింది. నేషనల్ హైవే 65ను ఆనుకుని ఉన్న అత్యంత ఖరీదైన సర్వే నంబర్లు 100, 101 పరిధిలోని 550 ఎకరాల భూమి పక్కా ప్రభుత్వానిదేనంటూ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేయడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అపర కుబేరుడి ఖజానా దక్కినట్లయింది. బహిరంగ మార్కెట్లో రూ. 50,000 కోట్ల నుండి రూ. 60,000 కోట్ల వరకు విలువ చేసే ఈ ప్రైమ్ ల్యాండ్‌ను గ్లోబల్ టెండర్ల ద్వారా పారదర్శకంగా వేలం వేసి, వచ్చే ఆదాయాన్ని విద్యా రంగానికి, సంక్షేమ పథకాలకు మళ్లిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే, కాగితాలపై కనిపిస్తున్నంత సులభంగా ఈ భూముల వేలం పూర్తయి రేవంత్ సర్కార్ చేతికి వేల కోట్లు అందుతాయా అంటే రాజకీయ, న్యాయ నిపుణుల నుండి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బంగారు బాతుల్లాంటి భూములు
మియాపూర్ భూములు జాతీయ రహదారికి సమీపంలో, హైదరాబాద్ ఐటీ కారిడార్‌కూ అత్యంత చేరువలో ఉండటంతో రియల్ ఎస్టేట్ రంగానికి ఇవి బంగారు బాతు లాంటివి. ఈ భూములను వేలం వేయడం ద్వారా నియోజకవర్గాల అభివృద్ధి నిధుల కొరతను తీర్చడమే కాకుండా, పెండింగ్‌లో ఉన్న సంక్షేమ పథకాలకు తక్షణ ఊపిరి ఊదవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కానీ, 550 ఎకరాల భారీ భూభాగాన్ని ఒకేసారి లేదా విడతల వారీగా వేలం వేసి మార్కెట్ రేటుకు విక్రయించడం తీవ్రమైన సవాళ్లతో కూడుకున్న ప్రక్రియ. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఉన్న మందగమనం, భారీ పరిమాణంలో నిధులు ఇన్వెస్ట్ చేయడానికి ముందడుగు వేసే బిడ్డర్ల సంఖ్య పరిమితంగా ఉండటం ప్రభుత్వానికి తొలి ఆటంకంగా మారనుంది.
ఇప్పటికే కొన్ని ఆక్రమణలు
దీనికి తోడు, సుప్రీంకోర్టు వివాదానికి శాశ్వత స్వస్తి పలికినప్పటికీ క్షేత్రస్థాయిలో ఉన్న కబ్జాలు, ఎన్క్రోచ్మెంట్లను ఖాళీ చేయించడం అధికారులకు అగ్నిపరీక్ష కానుంది. పూర్తి స్థాయిలో క్లియర్ టైటిల్ , 'ఫిజికల్ పొసెషన్ చూపించకుండా అంతర్జాతీయ స్థాయి రియల్ ఎస్టేట్ దిగ్గజాలు టెండర్లలో పాల్గొనడానికి జంకుతారు. అందుకే వెంటనే మార్కింగ్ చేయాలని ఆదేశించామని ముఖఅయమంత్రి ప్రకటించారు. ప్రతిపక్షాల నుండి వస్తున్న పొలిటికల్ రెసిస్టెన్స్ కూడా వేలం ప్రక్రియను నెమ్మదింపజేసే ప్రమాదం ఉంది. గతంలో ప్రభుత్వ భూములను బిఆర్ఎస్ ప్రభుత్వం విక్రయిస్తున్నప్పుడు తీవ్రంగా నిరసన తెలిపిన కాంగ్రెస్, ఇప్పుడు తాను అధికారంలోకి రాగానే వేల కోట్ల విలువైన భూములను అమ్మేయడాన్ని ప్రతిపక్షాలు రౌండ్ టేబుల్ సమావేశాలు, నిరసనలతో సవాల్ చేసే అవకాశం ఉంది. భవిష్యత్తు తరాల కోసం ఉండాల్సిన విలువైన ప్రభుత్వ భూములను వేలం వేసి ప్రస్తుత సంక్షేమానికి వాడేయడం సరైన ఆర్థిక విధానం కాదు అని బిఆర్ఎస్, బిజెపిలు ఇప్పటికే విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నాయి.
రివ్యూ పిటిషన్లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయా?
ఇక రియల్ ఎస్టేట్ దిగ్గజాలు, గ్లోబల్ ఇన్వెస్టర్లు సుప్రీం తీర్పు తర్వాత కూడా రివ్యూ పిటిషన్లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయా అనే కోణంలో చట్టపరమైన పరిశీలన చేస్తారు. సుప్రీం తీర్పు వచ్చినా, ఓడిపోయిన వర్గం రివ్యూ పిటిషన్ లేదా క్యూరేటివ్ పిటిషన్ వైపు వెళ్లే అవకాశం ఉన్నంత కాలం పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసే కార్పొరేట్ సంస్థలు వేచి చూసే ధోరణినే అవలంబిస్తాయి. చట్టపరంగా పూర్తి స్థాయి భద్రత లభిస్తే తప్ప ఒక్కో ఎకరానికి రూ. 100 కోట్లకు పైగా హెచ్చించి బిడ్లు వేయడానికి గ్లోబల్ కంపెనీలు సాహసించవు. మియాపూర్ 550 ఎకరాల భూమి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక వైపు లక్కీ డ్రా లాంటి బంగారు అవకాశం అయినప్పటికీ, దానిని వేలం వేసి ఖజానాను నింపుకోవడం ముళ్లబాట వంటిదే. కబ్జాల తొలగింపు, పొసెషన్ క్లియరెన్స్, గ్లోబల్ టెండర్ల రూపకల్పన, రాజకీయ విమర్శలను తట్టుకోవడం వంటి ప్రక్రియలన్నీ పూర్తి కావడానికి కనీసం ఒకటి రెండు ఏళ్ల సమయం పడుతుంది.

