హైదరాబాద్: ప్రముఖ వైద్య సంస్థ అయిన ఒమేగా హాస్పిటల్స్‌పై ఆదాయపన్ను శాఖ (Income Tax) అధికారులు దాడులు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌ సహా మొత్తం 5 రాష్ట్రాల్లో శుక్రవారం ఏకకాలంలో ఈ సోదాలు చేపట్టారు. హైదరాబాద్ ఇన్వెస్టిగేషన్ వింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 8 ప్రత్యేక బృందాలు మొత్తం 24 ప్రాంతాల్లో విసృతంగా తనిఖీలు చేశాయి. ఒమేగా హాస్పిటల్స్ వివిధ శాఖలు, సంస్థ కీలక వైద్యుల నివాసాలు, ప్రధాన కార్యాలయాలు, అలాగే ఒమేగా డైరెక్టర్, సీఈవో ఇళ్లలో శుక్రవారం నాడు కొన్ని గంటల పాటు తనిఖీలు కొనసాగించారు.

భారీ స్థాయిలో పన్ను ఎగవేతకు పాల్పడటం, లెక్కల్లో చూపని భారీ నగదు లావాదేవీలు నిర్వహించారనే తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు ఈ ఆకస్మిక దాడులు చేపట్టారు. తనిఖీల సమయంలో హాస్పిటల్, సంబంధిత అధికారుల ఇళ్ల నుంచి భారీగా కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ ఆధారాల బట్టి హాస్పిటల్ గతంలో జరిపిన ఆర్థిక లావాదేవీలపై ఐటీశాఖ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. సోదాలు జరుగుతున్న ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హాస్పిటల్స్ బయట పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.