Telangana Politics Social Media Cyber Trolling: ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, వ్యక్తిగత జీవితాలు, వివాహేతర బంధాలను రాజకీయ అజెండాగా మార్చడం ఓ పరిపాటిగా ఉండేది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థుల కుటుంబాల్లోని మహిళలను, వివాహ బంధాలను టార్గెట్ చేస్తూ వ్యక్తిత్వ హననం చేయడం ఏపీ డిజిటల్ స్పేస్‌లో తీవ్ర అలజడి రేపింది. ప్రభుత్వం మారిన తర్వాత అక్కడ పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చినప్పటికీ, అదే కలుషిత రాజకీయ సంస్కృతి ఇప్పుడు తెలంగాణలోకి వేగంగా చొరబడుతోంది. విధానపరమైన విమర్శలు మరుగునపడి, నాయకులు , వారి కుటుంబ సభ్యుల వైవాహిక, వ్యక్తిగత జీవితాలపై అసభ్యకర ప్రచారాలు చేయడం నెట్టింట విపరీతంగా పెరిగిపోతోంది.
బల్మూరి ఇందూజాపై మార్ఫింగ్ రాజకీయం
ఈ విషసంస్కృతికి తాజా నిదర్శనం కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూరి వెంకట్ సతీమణి, యూత్ కాంగ్రెస్ నాయకురాలు ఇందుజా బల్మూరి ఉదంతం. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రోద్బలంతో, బిఆర్ఎస్ అనుబంధ సోషల్ మీడియా ఖాతాలు తమ ప్రీ-వెడ్డింగ్ ఫొటోలను, వివాహ బంధాన్ని వికృతంగా మార్ఫింగ్ చేస్తూ ఆన్లైన్ హరాస్మెంట్కు పాల్పడుతున్నాయని ఆమె నేరుగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించి, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవడాన్ని కులపిచ్చితో రాజకీయం చేస్తూ తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారంటూ ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. కేవలం రాజకీయాల్లో తన భర్తను ఢీకొట్టలేక ఇంట్లోని మహిళలపై ఇలాంటి సైబర్ దాడికి దిగడం తెలంగాణ సమాజాన్ని విస్మయానికి గురిచేస్తోంది.
కేటీఆర్ పై అదే పనిగా వ్యక్తిత్వ హనన ప్రచారం
వాస్తవానికి ఈ ట్రెండ్ ఒక్కరితో ముగియడం లేదు. గతంలో బిఆర్ఎస్ అగ్రనేతలు, వారి కుటుంబ సభ్యులపై కాంగ్రెస్, బిజెపి సోషల్ మీడియా వింగ్‌లు ఇదే తరహాలో వ్యక్తిగత, అసభ్యకర ఆరోపణలతో దాడులకు దిగాయి. మాజీ మంత్రులు, మహిళా ప్రజాప్రతినిధులపై కల్పిత కథనాలు అల్లడం, ఫొటోలు మార్ఫింగ్ చేయడం, క్యారెక్టర్ అస్సాసిినేషన్ చేయడం రెండు ప్రధాన పార్టీల డిజిటల్ ఆర్మీలకు అలవాటుగా మారింది. పాలనాపరమైన విమర్శలు, హామీల అమలు, నిరుద్యోగం, అభివృద్ధి వంటి ప్రజా సమస్యలపై చర్చించాల్సిన రాజకీయ వేదికలు.. ఇప్పుడు "ఎవరి ఇంట్లో ఏం జరుగుతోంది? ఎవరికీ ఏ బంధాలు ఉన్నాయి?" అనే చౌకబారు ప్రచారాలకు నిలయంగా మారడం ప్రజాస్వామ్య వ్యవస్థకే పెద్ద ముప్పుగా పరిణమించింది.
ప్రజల్లోనూ అసంతృప్తి
ఇటువంటి హేయమైన చర్యలు సామాన్య ప్రజల్లో, ముఖ్యంగా తటస్థుల్లో తీవ్ర నిరాశను, అసహ్యాన్ని నింపుతున్నాయి. రాజకీయాలంటేనే అసహ్యించుకునే వాతావరణాన్ని ఈ డిజిటల్ ట్రోలింగ్ కల్చర్ సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో వ్యూస్, లైక్‌లు, పొలిటికల్ మైలేజ్ కోసం కుటుంబ వ్యవస్థలను, మహిళల గౌరవాన్ని రచ్చకీడ్చడం వల్ల యువత రాజకీయాల్లోకి రాకుండా భయపడే పరిస్థితి ఏర్పడుతోంది. నైతిక విలువలు గాలికి వదిలేసి, ప్రైవేట్ జీవితాల్లోకి తొంగిచూసే ఈ కలుషిత వాతావరణం తెలంగాణ ఉద్యమ మూలాలైన సహజ సమరసతను, హుందాతనాన్ని దెబ్బతీస్తోందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు చర్యలు తీసుకుంటున్నా ఆగని ఎటాక్
, సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదులు వచ్చినప్పుడు కొన్ని ఖాతాలను సీజ్ చేయడం లేదా అరెస్టులు చేయడం జరుగుతున్నప్పటికీ, అసలు వ్యవస్థాత్మక మార్పు రావడం లేదు. రాజకీయ పార్టీల అగ్రనేతలే తమ సోషల్ మీడియా వింగ్‌లను కట్టడి చేయకపోవడం , సైలెంట్‌గా ప్రోత్సహించడం వల్ల ఈ అరాచకం క్రమంగా పెరిగిపోతోంది. ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం తాత్కాలిక ప్రయోజనాన్ని ఇవ్వవచ్చు కానీ, రాజకీయంలో కనీస నైతిక హద్దులను చెరిపేయడం భవిష్యత్తు తరాలకు ప్రమాదకర సంకేతాలను పంపుతోంది. రాజకీయ విభేదాలు సిద్ధాంతాలు, పాలనా విమర్శలకే పరిమితం కావాలి తప్ప.. కుటుంబ సభ్యులను, మహిళలను సైబర్ వేధింపులకు గురిచేసే స్థాయికి దిగజారకూడదు. తమ పార్టీల డిజిటల్ హ్యాండిల్స్ గీత దాటకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేటీఆర్, రేవంత్ రెడ్డి సహా అన్ని పార్టీల అగ్రనేతలపై ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

