Abhishek Sharma: టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ పేరు వినగానే బౌండరీలు, సిక్సర్లు గుర్తొస్తాయి. క్రీజులోకి వచ్చాడంటే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడటం అతడి స్టైల్. తక్కువ సమయంలోనే టీ20 క్రికెట్‌లో విధ్వంసకర బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే భారీ లక్ష్యాల ఛేజింగ్‌లో మాత్రం అతడి బ్యాట్ ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదనే చర్చ మొదలైంది. న్యూజిలాండ్‌తో అక్లాండ్‌లో జరిగిన నాలుగో టీ20లో భారత్ 87 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో 260 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా టాప్ ఆర్డర్ విఫలమైంది. అభిషేక్ శర్మ 15 బంతుల్లో 27 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఈ ఇన్నింగ్స్‌తో 200కు పైగా పరుగుల ఛేజింగ్‌లో అతడి రికార్డు మరోసారి చర్చలోకి వచ్చింది.

ఒక్కసారి కూడా 30 దాటలేదు

అభిషేక్ శర్మ ఇప్పటివరకు టీ20ల్లో 200కు పైగా లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 8 ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఎనిమిది ఇన్నింగ్స్‌లో ఒక్కసారి కూడా 30 పరుగుల మార్క్‌ను అందుకోలేకపోయాడు. అతడి స్కోర్లు చూస్తే 17 (8 బంతులు), 0 (1), 0 (1), 10 (7), 3 (5), 29 (24), 29 (12), 27 (15)గా ఉన్నాయి. ఇందులో రెండుసార్లు డకౌట్ అయ్యాడు. మరో మూడు సందర్భాల్లో మాత్రమే 20 పరుగుల మార్క్ దాటాడు. ముఖ్యంగా 29 పరుగుల వద్ద రెండుసార్లు ఆగిపోవడం గమనార్హం. తాజాగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లోనూ 27 పరుగులకే పరిమితం కావడంతో ఈ గణాంకాలు మళ్లీ తెరపైకి వచ్చాయి.

199 టార్గెట్‌లో మాత్రం సెంచరీ

ఇదే అభిషేక్ శర్మ కొన్ని రోజుల క్రితం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో భారత్ ముందు 199 పరుగుల లక్ష్యం ఉంది. అభిషేక్ కేవలం 38 బంతుల్లోనే 113 పరుగులు బాదాడు. ఇందులో 9 ఫోర్లు, 11 సిక్సర్లు ఉన్నాయి. అతడి దూకుడుతో భారత్ 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. ఈ ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. అయితే ఆ తర్వాతి మ్యాచ్‌లో లక్ష్యం 200 దాటగానే అభిషేక్ మళ్లీ పెద్ద స్కోరు చేయలేకపోయాడు. 199 పరుగుల ఛేజింగ్‌లో సెంచరీ చేసిన ఆటగాడు, భారీ లక్ష్యాల దగ్గర మాత్రం తడబడుతున్నాడనే చర్చకు ఈ రెండు మ్యాచ్‌లు కారణమయ్యాయి.

అభిషేక్ టీ20 కెరీర్‌లో పరుగుల వరద

మొత్తం టీ20 కెరీర్‌ను పరిశీలిస్తే అభిషేక్ శర్మ ఎంతటి దూకుడైన బ్యాటరో అర్థమవుతుంది. ఇప్పటివరకు 221 టీ20 మ్యాచ్‌లు ఆడిన అతడు 217 ఇన్నింగ్స్‌లో 6,633 పరుగులు చేశాడు. 33.16 సగటుతో పాటు 179.27 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. ఈ క్రమంలో 11 సెంచరీలు, 40 అర్ధ సెంచరీలు సాధించాడు. అతడి అత్యధిక స్కోరు 148 పరుగులు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఉపయోగపడుతున్నాడు. 103 ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసి 27.20 సగటుతో 60 వికెట్లు పడగొట్టాడు. అతడి అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 3/7. ఎకానమీ 7.66గా ఉంది. ఈ గణాంకాలు అభిషేక్ సామర్థ్యాన్ని చూపిస్తున్నాయి.

భారీ ఛేజింగ్‌లో మారాల్సిందేనా?

అభిషేక్ శర్మ దూకుడు టీమిండియాకు చాలా సందర్భాల్లో మంచి ఆరంభాలు అందించింది. అయితే 200కు పైగా లక్ష్యాలను ఛేదించే సమయంలో అతడు క్రీజులో ఎక్కువసేపు నిలబడాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రతి బంతినీ బౌండరీకి పంపాలనే ప్రయత్నం కాకుండా పరిస్థితికి తగ్గట్టుగా ఇన్నింగ్స్ నిర్మించాల్సి ఉంటుంది. ముఖ్యంగా భారీ స్కోర్లు నమోదయ్యే టీ20 మ్యాచ్‌ల్లో ఓపెనర్ల పాత్ర కీలకం. ఈ నేపథ్యంలో 200 ప్లస్ ఛేజింగ్‌లో అభిషేక్ తన ఆటతీరును ఎలా మార్చుకుంటాడన్నది ఆసక్తికరంగా మారింది. అతడి దూకుడు కొనసాగుతూనే, భారీ లక్ష్యాల్లోనూ పెద్ద ఇన్నింగ్స్‌లు వస్తే టీమిండియాకు మరింత బలం చేకూరుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..