Kavitha Kalvakuntla : ఆదివాసీల వీరభూమి, పోరాటాలకు పురిటిగడ్డ అయిన ఇంద్రవెల్లి సాక్షిగా తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలపై సంచలన విమర్శలు చేశారు. ఇంద్రవెల్లి వేదికగా తెలంగాణ రక్షణ సేన పాంచజన్య సంకల్ప సభ నిర్వహిస్తోంది. ఈ సభలో స్వాతంత్ర్యం కోసం, హక్కుల కోసం ప్రాణాలర్పించిన రామ్ జీ గొండు, వన్నెల ఎల్లన్న, వెడమ రాము, జల్-జమీన్-జంగల్ వీరుడు కొమురం భీమ్, శిడెం శింబు, కొమురం సూరుల స్ఫూర్తికి పాదాభివందనం చేస్తూ కవిత తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆనాడు తమ పంటలను కాపాడుకునేందుకు సమావేశమైన ఆదివాసీలపై కాల్పులు జరిపిన చరిత్ర కాంగ్రెస్‌దని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి తీరుపై విమర్శలు  

రైతులను, ఆదివాసీలను కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని కవిత ఆరోపించారు. అధికారంలోకి రాగానే ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలకు రూ. 25 లక్షలు ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి, కేవలం రూ. 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. "చరిత్రలో రైతులను పంట వేయవద్దని చెప్పిన మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే. వ్యవసాయం తప్ప వేరే పని తెలియని రైతులకు ఏ విధంగా ఆదుకుంటారో చెప్పకుండా పంట వద్దంటే ఆయన పదవిలో ఎందుకు ఉండాలి?" అని ప్రశ్నించారు. రెండు నెలలకు ఒకసారి ఆదిలాబాద్‌కు వస్తానని చెప్పిన సీఎం, మూడేళ్లలో కేవలం రెండుసార్లు మాత్రమే వచ్చారని, ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. 152 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు కట్టి 148 మీటర్లలో నీళ్లు నిల్వ చేయకుండా, కరువు వచ్చిన తర్వాత బాయి తవ్వినట్లు ఇప్పుడు మహారాష్ట్రతో మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

 "రైతులను పంటలు వేయవద్దని చెప్పిన ముఖ్యమంత్రి అసలు ఆ పదవిలో ఎందుకు కొనసాగాలి?. చరిత్రలో మొట్టమొదటి సారి పంటలు వేయొద్దు అని చెప్పిన అసమర్థ సీఎం రేవంత్ రెడ్డి. పంటలు వేయకుండా రైతులు ఎట్లా బతకాలి?" అని ఆమె ప్రశ్నించారు. 

సిరిసిల్ల, సిద్దిపేట బాబుల తర్జన భర్జన 

బీఆర్ఎస్ సభపై కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్ చేస్తోంది రైతు గర్జన కాదని, సిరిసిల్ల బాబు (కేటీఆర్), సిద్దిపేట బాబు (హరీష్ రావు) మధ్య ఆధిపత్య పోరులో కార్యకర్తలు పడుతున్న తర్జన భర్జన అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ స్వయంగా మాటిచ్చి కూడా కొమరం భీమ్ యూనివర్సిటీని, ఇంజినీరింగ్ కాలేజీని పదేళ్లలో ఎందుకు ఇవ్వలేదో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. సిర్పూర్ మిల్లుకు వెయ్యి కోట్లు ఇచ్చినా కార్మికులకు మేలు జరగలేదని, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బోధన్ షుగర్ ఫ్యాక్టరీలను ఎందుకు తెరిపించలేదని నిలదీశారు.

చనఖా కొరటా ప్రాజెక్ట్ ఖర్చును రూ. 368 కోట్లనుంచి ఏకంగా రూ. 2100 కోట్లకు పెంచారని, ఈ అవినీతి సొమ్ము మాజీ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న ఇళ్లకు పోయిందా అని ప్రశ్నించారు. ఆదిలాబాద్‌లో 80 లక్షల క్వింటాళ్ల పత్తి పండుతున్నా కనీసం ఒక టెక్స్‌టైల్ పార్క్ ఎందుకు నిర్మించలేదని నిలదీశారు.

Also Read: మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడినందుకు నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి 

బీజేపీ మత రాజకీయం 

ఆదిలాబాద్ లోని బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీష్ లు రేవంత్ రెడ్డిపై ఈగ వాలనివ్వకుండా కాపాడుతున్నారని కవిత ఆరోపించారు. రాష్ట్రంలో హిందూ, ముస్లింలు శాంతియుతంగా ఉండాలని భావిస్తే, బీజేపీ మాత్రం మతాల మధ్య గొడవలు పెట్టి గెలవాలని చూస్తోందని హెచ్చరించారు.

'పాంచజన్యం'  సభతో టీఆర్ఎస్ హామీలు

  1. అన్ని పార్టీలు ప్రజలను మోసం చేసిన వేళ, ఒక కొత్త రాజకీయ శక్తిగా తమ ప్రాధాన్యతలను "పాంచజన్యం" రూపంలో కవిత ప్రకటించారు. 
  2. మెరుగైన ఉచిత విద్య, వైద్యం: ప్రైవేట్ రంగంలో సైతం పేదలకు ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.
  3. యువతకు రూ. 2 లక్షల నుంచి రూ. 20 కోట్లతో వ్యాపార రుణాలు: యువత ఆలోచనలకు అనుగుణంగా సొంత వ్యాపారాలు పెట్టుకునేందుకు రుణ సదుపాయం కల్పిస్తామని తెలిపారు.
  4. రైతులకు పూర్తి మద్దతు: రైతులకు ఉచిత నీరు, కరెంట్, యూరియా అందిస్తూ వారి గౌరవాన్ని కాపాడటం.
  5. ఆదివాసీల హక్కులు: ITDA లో జీవో 57 తో సహా 27 జీవోలను పునరుద్ధరించడం, 1972 లో ఆస్తులు కొనుగోలు చేసిన ఆదివాసీలకు న్యాయం చేయడం.
  6. ఆరోగ్య పరిరక్షణ: రక్తహీనతతో బాధపడుతున్న ఆదివాసీ మహిళలకు పోషకాహార పథకాలు సమర్థవంతంగా అమలు చేయడం.

సీసీఐ మూతపడటానికి కారణం

ఆదిలాబాద్‌లోని ప్రతిష్టాత్మక 'సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' మూతపడటానికి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలే కారణమని కవిత ఆరోపించారు. ఈ మూడు పార్టీలు ఉత్తర తెలంగాణ ప్రయోజనాలను విస్మరించాయని దుయ్యబట్టారు.

Also Read: ఫార్ములా ఈ రేసు కేసు.. విచారణకు హాజరు కాని కేటీఆర్- డిసెంబర్ 4కు వాయిదా