Vaibhav Sooryavanshi Records: టీమిండియా యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. 2026 రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ వన్డే టోర్నీలో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారత్-ఏ తరఫున ఆడిన బుడ్డోడు.. కేవలం 53 బంతుల్లోనే 204 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 28 సిక్సులు ఉండడం విశేషం. ఈ మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కేవలం 28 బంతుల్లోనే సెంచరీ, 52 బంతుల్లో డబుల్ సెంచరీ బాదాడు. ఈ ఇన్నింగ్స్‌తో వైభవ్ రికార్డుల మోత మోగించాడు.
అత్యధిక స్ట్రైక్ రేట్:
ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ సాధించిన స్ట్రైక్ రేట్ ఏకంగా 384.90గా నమోదైంది. దీంతో లిస్ట్-ఏ వన్డే క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన బ్యాటర్లలో అత్యధిక స్ట్రైక్ రేట్ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ రెండో స్థానంలో ఉన్నాడు. 2015లో జోహన్నెస్‌బర్గ్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏబీడీ 44 బంతుల్లో 149 పరుగులు చేసి 338.63 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. ఇక జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ 2023లో అడిలైడ్‌లో టాస్మానియాతో జరిగిన మ్యాచ్‌లో 38 బంతుల్లో 125 పరుగులు సాధించి 328.94 స్ట్రైక్ రేట్‌తో మూడో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరినీ వెనక్కి నెట్టి సూర్యవంశీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
14.2 ఓవర్లలోనే 200కిపైగా లక్ష్యం ఛేదన:
ఈ మ్యాచ్‌లో భారత్-ఏ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 200కిపైగా లక్ష్యాన్ని కేవలం 14.2 ఓవర్లలోనే విజయవంతంగా ఛేదించింది. లిస్ట్-ఏ క్రికెట్‌లో 200కిపైగా లక్ష్యాన్ని ఇంత తక్కువ ఓవర్లలో ఛేదించడం ఇదే మొదటిసారి. అంతకుముందు 2003లో లాహోర్‌లో జరిగిన ప్యాట్రన్స్ కప్‌లో అలైడ్ బ్యాంక్ లిమిటెడ్ జట్టు సర్వీస్ ఇండస్ట్రీస్‌పై 20 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.
ఒకే మ్యాచ్‌లో 31 సిక్సర్లు:
భారత్-ఏ బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో మొత్తంగా 31 సిక్సర్లు బాదారు. లిస్ట్-ఏ వన్డే క్రికెట్‌లో ఒక జట్టు ఇన్నింగ్స్‌లో నమోదైన అత్యధిక సిక్సర్ల జాబితాలో ఇది రెండోది. 2025లో రాంచీలో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బిహార్ జట్టు 38 సిక్సర్లు బాది అగ్రస్థానంలో ఉంది. భారత్-ఏ తరఫున వైభవ్ సూర్యవంశీ ఒక్కడే 28 సిక్సర్లు కొట్టడం విశేషం. ఒకే ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు, రికార్డు స్థాయి స్ట్రైక్ రేట్, వేగవంతమైన ఛేజింగ్‌తో ఈ మ్యాచ్ లిస్ట్-ఏ క్రికెట్‌లో ప్రత్యేకంగా నిలిచింది.

