Asaduddin Owaisi vs Azam Khan Hyderabadi Biryani Debate: వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ, ఆ రాష్ట్ర రాజకీయం ఇప్పుడు ఆసక్తికరంగా వంటకాల చుట్టూ తిరుగుతోంది. ముఖ్యంగా జైలు నుంచి విడుదలైన సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత అజంఖాన్ , ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ లక్ష్యంగా చేసిన హైదరాబాద్ బిర్యానీ వ్యాఖ్యలు యూపీ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపాయి. చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీ తో ఒవైసీ పొత్తు పెట్టుకుని సామాజిక్ పరివర్తన్ మోర్చా పేరిట బరిలోకి దిగుతున్న అంశంపై అజంఖాన్ స్పందిస్తూ.. ఉత్తరప్రదేశ్ ప్రజలకు హైదరాబాద్ బిర్యానీ రుచించదు, ఇక్కడి ప్రజలు కేవలం పులావ్, మటన్ బిర్యానీలనే ఇష్టపడతారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాకుండా, గడ్డం పెంచినంత మాత్రాన ఎవరూ మౌలానా అయిపోరని, ఒవైసీ కేవలం బారిస్టర్ మాత్రమేనని ఎద్దేవా చేశారు.
అజంఖాన్‌కు ఓవైసీ కౌంటర్
అయితే, అజంఖాన్ విసిరిన ఈ మాటల తూటాను అసదుద్దీన్ ఒవైసీ అత్యంత చాకచక్యంగా తనకు అనుకూలంగా మార్చుకున్నారు. సహరాన్‌పూర్ పర్యటనలో ఆయన మాట్లాడుతూ, అజంఖాన్‌కు పూర్తి ఆరోగ్యం చేకూరాలని ఆకాంక్షిస్తూనే గట్టి కౌంటర్ ఇచ్చారు. కొందరు తినడం కోసం జీవిస్తారు, కానీ మేము జీవించడానికి మాత్రమే కొద్దిగా తింటాము. ప్రస్తుత రాజకీయ పోరాటం బిర్యానీ గురించో, పులావ్ గురించో కాదు.. యూపీలో బుల్డోజర్ రాజకీయాలు, పోలీసు ఎన్‌కౌంటర్ల మధ్య భయంతో బతుకుతున్న ప్రజల ప్రాణాలు కాపాడటం, వారికి న్యాయం అందించడం గురించి అని ఒవైసీ భావోద్వేగంగా స్పందించారు. 2013 ముజఫర్‌నగర్ అల్లర్ల బాధితుల శిబిరాలకు, 2015 దాద్రీ మూకదాడి బాధితుడు అఖ్లాక్ కుటుంబానికి తాను అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేస్తూ, కష్టకాలంలో సమాజ్‌వాదీ పార్టీ నేతలు ఎక్కడున్నారని నిలదీశారు.
బిర్యానీ విందులిస్తున్న మజ్లిస్ నేతలు
ఒవైసీ కేవలం మాటల యుద్ధంతోనే ఆగకుండా, మజ్లిస్ పార్టీ శ్రేణులు ఈ బిర్యానీ వివాదాన్ని క్షేత్రస్థాయి ప్రచార ఆయుధంగా మలుచుకున్నారు. అజంఖాన్ వ్యాఖ్యలకు నిరసనగా, ఏకంగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సొంత ఇలాకా అయిన ఇటావా జిల్లాలోనే ఎంఐఎం నేతలు భారీ ఎత్తున హైదరాబాదీ బిర్యానీ విందు ఏర్పాటు చేసి ముస్లిం సమాజానికి వడ్డించారు. అజంఖాన్ మాటల ద్వారా తమ మనసుల్లోని అభిమానాన్ని కోల్పోయారని, రాబోయే ఎన్నికల్లో ఈ హైదరాబాదీ బిర్యానీయే యూపీ రాజకీయాల్లో విప్లవం తెస్తుందని స్థానిక ఎంఐఎం నేతలు ప్రచారం మొదలుపెట్టారు. తద్వారా అజంఖాన్ చేసిన ఎగతాళిని ఒవైసీ బృందం తమ బ్రాండింగ్‌గా మార్చుకుని ఓటర్లలోకి దూసుకెళ్తోంది.
ముస్లిం ఓట్లు చీలుతాయని అఖిలేష్ ఆందోళన
ఇప్పుడు ఈ పరిణామం సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో దాదాపు 20 శాతం ఉన్న ముస్లిం ఓట్లు, మరో 20 శాతం పైగా ఉన్న దళిత ఓట్లను ఏకం చేయడమే లక్ష్యంగా ఒవైసీ – చంద్రశేఖర్ ఆజాద్ కూటమి వ్యూహరచన చేసింది. గత 2022 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఎంఐఎం ఒక్క సీటు గెలవకపోయినా, పలు నియోజకవర్గాల్లో ఎస్పీ అభ్యర్థుల ఓటమికి కారణమైంది. ఇప్పుడు ఏకంగా దళిత నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్‌తో జతకట్టడంతో పాటు, అజంఖాన్ వ్యాఖ్యలను సానుభూతిగా మార్చుకుని ఒవైసీ దూకుడు పెంచడం ఎస్పీ కంచుకోటలకు బీటలు వారేలా చేస్తోంది. అజంఖాన్ అనాలోచితంగా చేసిన హైదరాబాద్ బిర్యానీ వ్యాఖ్యలు సమాజ్‌వాదీ పార్టీకి సెల్ఫ్ గోల్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ముస్లిం ఓట్ల చీలిక జరిగితే అది నేరుగా అధికార బీజేపీకి మూడోసారి లబ్ధి చేకూరుస్తుందన్న భయం అఖిలేష్ యాదవ్‌ను వెంటాడుతోంది. మరోవైపు, తాము బీజేపీకి బీ-టీమ్ కాదని, యోగి , అఖిలేష్‌ల మ్యూజికల్ చైర్ రాజకీయాలకు ముగింపు పలికే అసలైన ప్రత్యామ్నాయ శక్తి తామేనని ఒవైసీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ బిర్యానీ వర్సెస్ పులావ్ రాజకీయం రాబోయే యూపీ ఎన్నికల్లో ఏ పార్టీకి తీపి కబురు అందిస్తుందో, మరెవరికి చేదు అనుభవాన్ని మిగులుస్తుందో చూడాలి.

