డబ్బు సంపాదించడం కంటే దాని విలువ తెలుసుకోవడం ముఖ్యం. కష్టపడకుండా వచ్చిన డబ్బు విలువ తెలియదు. కానీ చెమటోడ్చి సంపాదించిన ప్రతి రూపాయి వెనుక ఎన్నో కష్టాలు, త్యాగాలు ఉంటాయి. ఈ విషయాన్ని ఒక తండ్రి తన కొడుకుకు ఎలా అర్థమయ్యేలా చెప్పాడో తెలిపే ఆసక్తికరమైన కథ ఇది.
ఒక పట్టణంలో జోనాథన్ అనే ధనవంతుడైన ఫర్నిచర్ వ్యాపారి ఉండేవాడు. ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడి, నిజాయితీగా పనిచేసి పెద్ద ఫర్నిచర్ వర్క్‌షాప్‌ను నిర్మించాడు. అతను తయారు చేసే టేబుళ్లు, కుర్చీలు, క్యాబినెట్లకు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మంచి డిమాండ్ ఉండేది. అయితే జోనాథన్‌కు ఏడ్రియన్ అనే ఒక్కగానొక్క కొడుకు ఉండేవాడు. చిన్నప్పటి నుంచి అన్ని సౌకర్యాల మధ్య పెరిగిన ఏడ్రియన్‌కు డబ్బు విలువ తెలియదు. ఖరీదైన దుస్తులు ధరించడం, స్నేహితులతో ఆటలు ఆడటం, నచ్చిన వస్తువులు కొనుక్కోవడం తప్ప కష్టపడటం గురించి ఎప్పుడూ ఆలోచించేవాడు కాదు. కొడుకు భవిష్యత్తు గురించి జోనాథన్ ఆందోళన చెందేవాడు. తన వ్యాపారాన్ని నిర్మించడానికి తాను ఎంత కష్టపడ్డాడో, ఏడ్రియన్‌కు మాత్రం ఆ కష్టం గురించి తెలియదని బాధపడేవాడు.
కొడుకుకు తండ్రి పెట్టిన పరీక్ష!
ఒకరోజు జోనాథన్ తన కొడుకును వర్క్‌షాప్‌కు పిలిచి ఒక చెక్క ముక్కను చూపించాడు. ‘ఇది ఇంతకుముందు ఒక చెట్టు మాత్రమే. కానీ ఇప్పుడు అందమైన బల్లగా మారింది. ఎందుకో తెలుసా?’ అని అడిగాడు. ‘మీరు నైపుణ్యం ఉన్న పనివాళ్లను పెట్టుకున్నారు కాబట్టి’ అని ఏడ్రియన్ సమాధానమిచ్చాడు. అప్పుడు జోనాథన్ నవ్వుతూ, ‘కాదు నాన్నా! ప్రతిరోజూ ఎవరో ఒకరు ఓపికగా కష్టపడి పనిచేయడం వల్లే ఇది అందమైన వస్తువుగా మారింది’ అన్నాడు. ఆ తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు.
‘రేపటి నుంచి నీ ఖర్చుల కోసం నేను డబ్బు ఇవ్వను. నీకు డబ్బు కావాలంటే నువ్వే సంపాదించుకోవాలి’ అని చెప్పాడు. మరుసటి రోజు ఏడ్రియన్ తన అత్త రెబెక్కా దగ్గరకు వెళ్లి డబ్బు అడిగాడు. ఆమె ప్రేమతో 20 వెండి నాణేలు ఇచ్చింది. ఆ సాయంత్రం వాటిని తండ్రికి చూపించాడు. జోనాథన్ ఆ నాణేలను తీసుకుని నిప్పుల కొలిమిలో వేయమన్నాడు. ఏడ్రియన్ ఆశ్చర్యపోయినా, వాటిని నిప్పులో వేసేశాడు. మరుసటి రోజు తన బంధువు లూకాస్ దగ్గర కూడా డబ్బు తీసుకొచ్చాడు. ఈసారి కూడా తండ్రి వాటిని నిప్పులో వేయమన్నాడు. ఏడ్రియన్ ఏమాత్రం బాధపడకుండా అలాగే చేశాడు. కానీ మూడో రోజు పరిస్థితి మారిపోయింది. బంధువులు, స్నేహితులు ఎవరూ డబ్బు ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఆకలితో అలమటించిన ఏడ్రియన్‌కు డబ్బు సంపాదించడం ఎంత కష్టమో అర్థమైంది.
పని కోసం వెతుకుతూ మార్కెట్‌కు వెళ్లిన ఏడ్రియన్‌కు మిస్టర్ కాలిన్స్ అనే వృద్ధ బేకర్ కనిపించాడు. తన బ్రెడ్‌ను పట్టణంలోని వివిధ ప్రాంతాలకు డెలివరీ చేయడానికి ఒక వ్యక్తి కావాలని, పని పూర్తిచేస్తే డబ్బు ఇస్తానని చెప్పాడు. ఏడ్రియన్ వెంటనే అంగీకరించాడు. భారీ బుట్టలను భుజాలపై మోస్తూ ఎండలో వీధులన్నీ తిరిగాడు. ఎత్తైన రోడ్లపై నడిచాడు. ఎన్నో ఇళ్లకు వెళ్లి బ్రెడ్ అందించాడు. గంటల తరబడి కష్టపడటంతో అతని భుజాలు నొప్పించాయి. కాళ్లకు బొబ్బలు వచ్చాయి. చివరకు సూర్యాస్తమయానికి పని పూర్తిచేశాడు. అతని కష్టానికి ప్రతిఫలంగా బేకర్ 15 వెండి నాణేలు ఇచ్చాడు.
ఆ నాణేలను చూసిన ఏడ్రియన్‌కు ఎంతో ఆనందం కలిగింది. ఎందుకంటే అవి ఎవరో ఉచితంగా ఇచ్చిన డబ్బు కాదు. తన చెమట, శ్రమతో సంపాదించిన సొమ్ము. ఆ సాయంత్రం ఏడ్రియన్ తన తండ్రి దగ్గరకు వెళ్లి 15 వెండి నాణేలను ఇచ్చాడు. జోనాథన్ వాటిని చూసి మళ్లీ అదే మాట అన్నాడు.
‘వీటిని నిప్పులో వేయి!’ ఈసారి ఏడ్రియన్ ఒక్కసారిగా ఆగిపోయాడు. నాణేలను గట్టిగా పట్టుకుని, “నాన్నా! నేను వీటిని నిప్పులో వేయలేను. రోజంతా కష్టపడి పనిచేశాను. నా భుజాలు నొప్పిగా ఉన్నాయి. కాళ్లకు బొబ్బలు వచ్చాయి. ఎన్నో కష్టాలు పడి సంపాదించాను. వీటిని ఎలా కాల్చేయగలను?” అని కన్నీళ్లతో చెప్పాడు. అప్పుడు జోనాథన్ కొడుకును దగ్గరకు తీసుకుని ఇలా అన్నాడు. ‘నాన్నా! నేను నీకు నేర్పించాలనుకున్న పాఠం ఇదే. కష్టపడకుండా వచ్చిన డబ్బుకు మనం విలువ ఇవ్వం. కానీ మన చెమటోడ్చి సంపాదించిన ప్రతి రూపాయి విలువ మనకు తెలుస్తుంది. దాన్ని జాగ్రత్తగా ఖర్చు చేస్తాం. గౌరవిస్తాం. దాని వెనుక ఉన్న కష్టాన్ని అర్థం చేసుకుంటాం.’ ఆ క్షణంలో ఏడ్రియన్‌కు తన తండ్రి ఎన్నో సంవత్సరాల పాటు ఎంత కష్టపడి ఈ వ్యాపారాన్ని నిర్మించాడో అర్థమైంది. తన ప్రవర్తనకు తండ్రిని క్షమాపణ కోరాడు.
తండ్రి నేర్పిన పాఠంతో మారిపోయిన జీవితం!
ఆ రోజు నుంచి ఏడ్రియన్ పూర్తిగా మారిపోయాడు. ప్రతిరోజూ ఉదయాన్నే వర్క్‌షాప్‌కు వెళ్లేవాడు. పనివాళ్లతో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. చెక్కను కొలవడం, ఫర్నిచర్ తయారు చేయడం, పనిముట్లను ఉపయోగించడం వంటి నైపుణ్యాలను నేర్చుకున్నాడు. అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం మానేశాడు. ఏ వస్తువు కొనాలన్నా అది తన కష్టానికి తగినదేనా అని ఆలోచించేవాడు. కొన్నేళ్ల తర్వాత జోనాథన్ వ్యాపారం నుంచి రిటైర్ అయ్యాడు. ఏడ్రియన్ బాధ్యతలు చేపట్టాడు. తన తండ్రి కంటే మెరుగ్గా వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడు. కార్మికులను గౌరవంగా చూసేవాడు. వారికి న్యాయమైన వేతనాలు ఇచ్చేవాడు. తాను చేయడానికి ఇష్టపడని పనిని ఇతరులతో చేయించేవాడు కాదు. ఒకరోజు అతని దగ్గర పనిచేసే యువకుడు, “సర్! మీరు ఇంత కష్టపడి పనిచేయడానికి కారణం ఏమిటి?’ అని అడిగాడు. అప్పుడు ఏడ్రియన్ నవ్వుతూ ‘నేను సంపాదించిన డబ్బును నిప్పులో వేయమని ఒకరోజు మా నాన్న అడిగాడు. అప్పుడే కష్టపడి సంపాదించిన డబ్బు విలువ ఏమిటో నాకు తెలిసింది’ అని సమాధానమిచ్చాడు.
డబ్బు సంపాదించడం మాత్రమే గొప్ప విషయం కాదు. దాని విలువ తెలుసుకోవడం, దాన్ని బాధ్యతగా వినియోగించడం కూడా అంతే ముఖ్యం. కష్టపడి సంపాదించిన డబ్బు మనకు ఓర్పు, బాధ్యత, కృతజ్ఞత, ఆత్మగౌరవం నేర్పుతుంది. జీవితంలో సులభంగా వచ్చిన వాటి విలువ చాలాసార్లు తెలియదు. కానీ కష్టపడి సాధించిన ప్రతి విజయం మనకు ప్రత్యేకమైన ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి కష్టపడటానికి ఎప్పుడూ వెనుకాడకండి. ఎందుకంటే కష్టం మీకు డబ్బును మాత్రమే కాదు.. మంచి వ్యక్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, గొప్ప భవిష్యత్తును కూడా అందిస్తుంది.

