Kota Rukmini Janasena Leader Legal Action Against YSRCP: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న దూకుడు రాజకీయ వ్యూహాలు మరోసారి ఆ పార్టీకే ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తున్నాయి. కేవలం జనసేన పార్టీ అంతర్గత వ్యవహారాలు, కార్యాలయ నిర్వహణ బాధ్యతలకే పరిమితమైన కోట రుక్మిణి ని లక్ష్యంగా చేసుకుని విమర్శల బాణాలు సంధించడం ద్వారా, నేరుగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌నే ఇరుకున పెట్టవచ్చని వైసీపీ నాయకత్వం వేసిన అంచనాలు పూర్తిగా తలకిందులవుతున్నాయి. ఎప్పుడూ బహిరంగ వేదికలపై వైసీపీపై గానీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై గానీ కనీసం ఒక్క రాజకీయ విమర్శ కూడా చేయని ఒక మహిళా నేతను వివాదాల్లోకి లాగడం ద్వారా వైసీపీ నేతలు అనవసరమైన రాద్ధాంతానికి తెరలేపారనే విమర్శలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఉద్యోగాల స్కామ్‌లో పిర్యాదు చేసిన కోట రుక్మిణి
జనసేన కార్యాలయం పేరుతో జరిగిన ఉద్యోగాల మోసం వ్యవహారంలో అసలు నిందితురాలైన మాజీ ఉద్యోగినిపై కోట రుక్మిణి స్వయంగా షో-కాజ్ నోటీసు జారీ చేసి, విధుల నుంచి తొలగించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాస్తవం ఇదైతే, ఫిర్యాదు చేసిన ఆమెనే నేరస్తురాలిగా చిత్రీకరిస్తూ వైసీపీ అధికార ప్రతినిధులు, అనుకూల మీడియా సంస్థలు వ్యక్తిత్వ హననానికి పాల్పడటం జనసేన శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిల్చింది. ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ పేరును అకారణంగా లాగుతూ బురదచల్లాలని చూసిన వైసీపీ వ్యూహం ప్రజల్లో ఏమాత్రం సానుకూలతను తీసుకురాలేకపోగా, ఒక మహిళా నేతపై కక్షసాధింపులకు దిగుతున్నారనే ప్రతికూల ముద్రను ప్రతిపక్షంపై వేసింది.
లీగల్ యాక్షన్ తీసుకుంటున్న కోట రుక్మిణి
సాధారణంగా రాజకీయ విమర్శలకు ప్రతిపక్షాలు ప్రతివిమర్శలతో సమాధానం ఇస్తాయి. కానీ, కోట రుక్మిణి మాత్రం ఏమాత్రం తగ్గకుండా పూర్తిగా చట్టపరమైన, న్యాయపరమైన మార్గాన్ని ఎంచుకోవడం వైసీపీ నేతలకు మింగుడుపడని అంశంగా మారింది. తనపై, తన సంస్థపై నిరాధార ఆరోపణలు చేసిన వైసీపీ నేత యనమల నాగార్జున యాదవ్‌కు 48 గంటల్లో ఆధారాలు చూపించాలని అల్టిమేటం జారీ చేయడంతో పాటు, రూ. 10 కోట్లకు పరువు నష్టం నోటీసులు పంపడం సంచలనం రేపింది. సీఐడీ విచారణ ఒకవైపు కొనసాగుతుండగానే, తప్పుడు ప్రచారం చేసిన మీడియా సంస్థలు, నేతలపై వరుసగా కోర్టుల్లో పిటిషన్లు వేసేందుకు ఆమె సిద్ధమవడం వైసీపీ శిబిరంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అలాగే మీడియాలో వ్యక్తిగత విమర్శలు చేసినందుకు మరో రూ.3 కోట్ల పరువునష్టం పిటిషన్లు దాఖలు చేశారు.
ఆధారాల్లేకపోవడంతో సైలెంట్
మొత్తానికి, పవన్ కళ్యాణ్ ఇమేజ్ను దెబ్బతీయాలనే ఆత్రుతలో సరైన ఆధారాలు లేకుండా కోట రుక్మిణిని టార్గెట్ చేయడం వైసీపీకి పెద్ద రాజకీయ, న్యాయపరమైన సమస్యగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు జనసేన శ్రేణులన్నీ ఏకమై వైసీపీ తీరుపై విరుచుకుపడుతుండగా, మరోవైపు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. ప్రస్తుతానికి కోట రుక్మిణి అంశంలో సైలెంట్ అయ్యారు. రాజకీయ ప్రత్యర్థులను విమర్శించే క్రమంలో విచక్షణ కోల్పోయి, తెర వెనుక పనిచేసే వ్యక్తులపై వ్యక్తిగత దాడులకు దిగితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఈ వివాదం వైసీపీకి తెలిసి వచ్చిందని అంటున్నారు.

