Seethakka Clarifies on Remarks About Kavitha | ములుగు: కల్వకుంట్ల కవిత ఇంటర్వ్యూ వ్యాఖ్యలను ప్రస్తావించే క్రమంలో తన నోటి వెంట పొరపాటున దొర్లిన పదానికి చింతిస్తున్నట్లు తెలంగాణ మంత్రి సీతక్క తెలిపారు. ఆ పదాన్ని వెంటనే వెనక్కి తీసుకున్నప్పటికీ, పెన్షన్లపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన తప్పుడు ప్రచారాన్ని తాను తిప్పికొట్టాననే అక్కసుతో బీఆర్ఎస్ నేతలు తన వ్యాఖ్యలను వక్రీకరించి వైరల్ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. తాను ఎప్పుడూ రాజకీయంగానే పోరాడతానని, వ్యక్తిగత విమర్శలు చేయడం తన నైజం కాదని సీతక్క స్పష్టం చేశారు.

కల్వకుంట్ల కవిత గతంలో ఒక మీడియాతో మాట్లాడిన వ్యాఖ్యలను ప్రస్తావించే క్రమంలో తన నోటి వెంట దొర్లిన పొరపాటుకు చింతిస్తున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. ములుగులో జరిగిన చేయూత నూతన పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఫైలేరియా, డయాలసిస్, ఎయిడ్స్ బాధితులకు కూడా ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేసిన విషయాన్ని తాను ప్రస్తావించానని ఆమె వివరించారు. అనంతరం ఇదే అంశంపై మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో కవిత వ్యాఖ్యలను ఉటంకిస్తుండగా అనుకోకుండా ఆ పదం దొర్లిందని, తప్పును గ్రహించి వెంటనే వెనక్కి తీసుకున్నప్పటికీ బీఆర్ఎస్ నేతలు ఆ వీడియోను వైరల్ చేయడం దారుణమని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు.

రాజకీయ కక్షతో బీఆర్ఎస్ పార్టీ తనను క్యాన్సర్ పేషెంట్‌గా చిత్రీకరించిందని కవిత స్వయంగా ఒక ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్నే తాను ప్రస్తావించానని సీతక్క స్పష్టం చేశారు. కవితను ఉద్దేశించి తాను కావాలని ఆ పదం అనలేదని, కేవలం మాటల ప్రవాహంలో దొర్లిందని, దాన్ని వెంటనే సరిదిద్దుకున్నా బీఆర్ఎస్ శ్రేణులు ట్రోల్ చేయడం సరికాదన్నారు. ఇటీవల వరంగల్ పర్యటనలో చేయూత పెన్షన్లపై కేటీఆర్ చేసిన తప్పుడు ప్రచారాన్ని తాను గట్టిగా తిప్పికొట్టాననే అక్కసుతోనే తన వ్యాఖ్యలను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. తాను ప్రత్యర్థులను ఎప్పుడూ రాజకీయంగానే ఎదుర్కొంటానని, వ్యక్తిగత విమర్శలు చేయడం తన నైజం కాదన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని సీతక్క పేర్కొన్నారు.