Telangana Governor Quota MLC Aspirants List 2026: తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవుల భర్తీ అంశం ఉత్కంఠకు, అంతర్గత పోటీకి తెరలేపింది. గతంలో నామినేట్ అయిన బస్వరాజు సారయ్య, గోరటి వెంకన్న, బొగ్గారపు దయానంద్‌ల పదవీకాలం నవంబర్ 14తో ముగియడంతో, ఆ మూడు స్థానాలను దక్కించుకునేందుకు దాదాపు 30 మంది వరకు సీనియర్ నేతలు, ప్రభుత్వ సలహాదారులు, ఉద్యమకారులు  లాబీయింగ్ చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, మరోవైపు వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఈ మూడు నామినేటెడ్ పదవుల ఎంపిక తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఇన్‌ఛార్జి బీఎం సందీప్ ముందు అతిపెద్ద అగ్నిపరీక్షగా నిలిచింది.

బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్ 

ఇటీవలే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు  సామ రామ్మోహన్ రెడ్డి, రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిలకు అవకాశం కల్పించారు. రెండూ రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలను అభ్యర్థులుగా ప్రకటించడంతో, గవర్నర్ కోటాలో మాత్రం సామాజిక న్యాయం పాటిస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లేదా బ్రాహ్మణ వర్గాలకు పెద్దపీట వేయాలనే ఒత్తిడి అధిష్టానంపై పెరిగింది. ఈ క్రమంలో రేసులో ప్రధానంగా పలువురు  ఫ్రంట్ రన్నర్స్  పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీసీ కోటాలో పద్మశాలి సామాజికవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, పున్న కైలాష్, ముదిరాజ్ సామాజికవర్గం నుంచి నీలం మధు, మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ పేర్లు ముందువరుసలో ఉన్నాయి. వీరితో పాటు చనగాని దయాకర్, సత్తు మల్లేశ్, కౌశిక్ యాదవ్ కూడా బీసీ కోటాలో గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

సీనియర్ నేతల ప్రయత్నాలు

అలాగే, ఇతర సామాజికవర్గాల నుంచి ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న హర్కార వేణుగోపాల్ రావు  బ్రాహ్మణ కోటా , షబ్బీర్ అలీ మైనార్టీ కోటా , మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, చాడగొండ వెంకటేశ్ ఎస్సీ కోటా , సీనియర్ నేత బెల్లయ్య నాయక్  ఎస్టీ కోటా),  కొండా మురళి, బోరెడ్డి అయోధ్య రెడ్డి, ఆరెపల్లి మోహన్ వంటి నేతలు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే, ఉన్నవి కేవలం మూడు స్థానాలు మాత్రమే కావడం, ఆశావహుల జాబితా భారీగా ఉండటంతో.. ఎవరికి అవకాశం ఇచ్చినా మిగిలిన 27 మందికి పైగా నేతల్లో తీవ్ర అసంతృప్తి భగ్గుమనే ప్రమాదం పొంచి ఉంది.

అసంతృప్తుల్ని బుజ్జగించాల్సిందే            

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత క్రమశిక్షణ లోపించి, కొందరు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ప్రభుత్వంపై బహిరంగ విమర్శలు చేస్తున్న  తురుణంలో ఇప్పుడు ఎమ్మెల్సీ పదవుల విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా అది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపైనా, పార్టీ ఐక్యతపైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే, కేవలం ఈ మూడు స్థానాలను భర్తీ చేసి అసంతృప్తిని రాజేయడం కంటే, వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కానున్న అసెంబ్లీ కోటా ఎమ్మెల్సీ స్థానాలతో కలిపి ఒకేసారి అన్ని సామాజికవర్గాలకు సర్దుబాటు చేయాలా, లేక ఇప్పుడే ముగ్గురిని ఖరారు చేసి మిగిలిన వారికి కార్పొరేషన్ పదవుల హామీ ఇవ్వాలా అన్న దానిపై సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌లతో కలిసి ఇన్‌ఛార్జి బీఎం సందీప్ కసరత్తు చేస్తున్నారు. మరి, ఎలాంటి అసంతృప్తి రగలకుండా ఈ  ముగ్గురు అదృష్టవంతుల ఎంపికను సందీప్ విజయవంతంగా పూర్తి చేస్తారా లేదా అన్నది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.