Ramayana: భారతీయ సినీ చరిత్రలో బాక్సాఫీస్ లెక్కలు మరోసారి తారుమారుకాబోతున్నాయి. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. నవంబర్ 5న రూ.64.85 కోట్ల భారీ ఓపెనింగ్స్‌తో మొదలైన ఈ సినిమా వేట, 15వ రోజుకు చేరేసరికి పాత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసింది. ముఖ్యంగా రాకింగ్ స్టార్ యశ్ తన పాత బ్లాక్‌బస్టర్ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ రికార్డును తానే స్వయంగా బద్దలు కొట్టడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇటీవలే రణవీర్ సింగ్ నటించిన ‘ధురందర్’ (రూ.840.20 కోట్ల నెట్) లైఫ్ టైమ్ వసూళ్లను దాటేసిన ‘రామాయణ’, గురువారం నాడు మరో సంచలనం నమోదు చేసింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.859.70 కోట్ల నెట్ వసూళ్లతో తిరుగులేని రికార్డు సృష్టించిన ‘కేజీఎఫ్ 2’ను ఈ చిత్రం అధిగమించింది. ఈ దెబ్బతో భారతదేశంలో అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన టాప్-4 చిత్రాల జాబితాలోకి ‘రామాయణ’ అడుగుపెట్టింది. అంతకుముందే RRR, కల్కి 2898 AD, జవాన్, కాంతార: చాప్టర్ 1 లాంటి దిగ్గజ సినిమాలను వెనక్కి నెట్టి తన సత్తా చాటింది.

రెండు వారాలు పూర్తయినా థియేటర్లలో ‘రామాయణ’ జోరు ఏమాత్రం తగ్గలేదు. 15వ రోజున దేశవ్యాప్తంగా 21,436 షోల ద్వారా రూ.19.35 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో హిందీ వెర్షన్ నుంచే ఏకంగా రూ.14 కోట్లు రాగా, మలయాళం (రూ.1.75 కోట్లు), తమిళం (రూ.1.50 కోట్లు), కన్నడ (రూ.1.40 కోట్లు), తెలుగు (రూ.70 లక్షలు) తోడయ్యాయి. దీంతో ఇండియాలో మొత్తం నెట్ కలెక్షన్లు రూ.863.75 కోట్లకు, గ్రాస్ రూ.1,032.15 కోట్లకు చేరాయని వెల్లడించారు. ఇక ఓవర్సీస్‌లో 15వ రోజు వచ్చిన రూ.5 కోట్లతో కలుపుకొని విదేశీ గ్రాస్ రూ.515 కోట్ల మార్కును తాకిందని చెబుతున్నారు. వెరసి ప్రపంచవ్యాప్తంగా ‘రామాయణ’ మొత్తం గ్రాస్ రూ.1,547.15 కోట్లకు చేరి సరికొత్త చరిత్ర లిఖించింది.

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ నెట్ వసూళ్ల పరంగా ‘రామాయణ’ కంటే ముందు కేవలం మూడు సినిమాలు మాత్రమే ఉన్నాయి. అందులో మూడో స్థానంలో ‘బాహుబలి 2’ (రూ.1,030.42 కోట్లు), రెండో స్థానంలో ‘ధురందర్ 2: ది రివెంజ్’ (రూ.1,149.30 కోట్లు), ‘పుష్ప 2: ది రూల్’ (రూ.1,234.10 కోట్లు) నిలిచాయి. ఇక ప్రపంచవ్యాప్త గ్రాస్ విషయానికి వస్తే.. రూ.1,500 కోట్ల మైలురాయిని దాటేసిన ‘రామాయణ’, ఇప్పుడు అల్లు అర్జున్ ‘పుష్ప 2’ (రూ.1,742 కోట్ల గ్రాస్) రికార్డుపై కన్నేసింది. నమిత్ మల్హోత్రా, యశ్ సంయుక్తంగా నిర్మించిన ఈ విజువల్ వండర్ ఇదే వేగాన్ని కొనసాగిస్తే.. ‘పుష్ప 2’ను దాటేసి ‘దంగల్’, ‘ధురందర్ 2’, ‘బాహుబలి 2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో భారతీయ చిత్రంగా నిలవడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు.