Green Gold: భూమిపైన పొదలకు కాసే పచ్చ బంగారం ఏదో తెలుసా? ఆ బంగారం మన వంటింట్లో రాజ్యమేలుతోంది. మరి, ఆ బంగారం ఏంటి? దానిని మనం వంటల్లో ఎలా వాడతాం? దానికి అలాంటి పేరు ఎందుకు వచ్చింది?

భారతీయులకు బంగారం అంటే ఎంత ప్రేమ ఉంటుందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. మనం బొగ్గుని నల్ల బంగారం అని,పత్తిని తెల్ల బంగారం అని పిలుస్తారని కూడా తెలుసు. కానీ, భూమిపై పండే పచ్చ బంగారం ఏదో తెలుసా? అదే మన రోజువారీ టీలో, బిర్యానీలో, పాయసంలో సువాసనలు వెదజల్లే యాలకులు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మూడు మసాలా దినుసుల్లో యాలకులు కూడా ఒకటి. అయితే, మనం రోజూ వాడే ఈ యాలకులు చెట్టుకి ఎలా కాస్తాయో చాలా మంది తెలీదు. కేరళ పశ్చిమ కనుమల్లో సాగయ్యే ఈ పచ్చ బంగారం పంట వెనక ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...

సాధారణంగా కాయలు లేదా పండ్లు అనగానే చెట్టు కొమ్మలకు వేలాడుతూ కనిపిస్తాయి అనుకుంటాం. కానీ, యాలకుల తీరు వేరు. ఇవి భూమిపై పాకే అద్భుతం. పసుపు, అల్లం మొక్కలు ఎలా అయితే భూమిపై పెద్ద పొదలా పెరుగుతాయో... యాలకుల చెట్టు కూడా అలానే పెరుగుతుంది. దీని కాయలు పై కొమ్మలకు కాకుండా, మొక్క అడుగు భాగంలో, నేలకు ఆనుకొని పాకే సన్నటి రెమ్మలపై గుత్తులు గుత్తులుగా మొలుస్తాయి. దట్టమైన పచ్చదనం మధ్య, మట్టిని తాకుతూ విసిరే చిన్నచిన్న ఆకుపచ్చ కాయలను చూస్తే.. భూమిపై పచ్చటి రత్నాలు పరిచినట్లు అద్భుతంగా కనిపిస్తుంది.

యాలకులు అంత ధర ఉండటానికి, దానిని ‘గ్రీన్ గోల్డ్’ అని పిలవడానికి వెనుక రైతుల అపారమైన శ్రమ దాగి ఉంది:

ఒక్కొక్క కాయను చేతులతోనే ఏరాలి: మిగతా పంటల్లా యంత్రాలతో కోయడం ఇక్కడ సాధ్యం కాదు. ఏ కాయ పక్వానికి వచ్చిందో గమనిస్తూ, కాయ దెబ్బతినకుండా కేవలం చేతులతో మాత్రమే సున్నితంగా తుంచాలి. ఇందుకోసం రైతులు ఏడాదిలో 5 నుండి 6 విడతలుగా పంటను సేకరిస్తారు.

సువాసన చెడిపోకుండా జాగ్రత్తలు: కోసిన వెంటనే ఆ పచ్చి కాయలను ప్రత్యేక పద్ధతుల్లో ఎండబెడతారు. సరైన ఉష్ణోగ్రత వద్ద ఆరబెడితేనే వాటి సహజమైన ముదురు ఆకుపచ్చ రంగు, ఘాటైన సువాసన నిలిచి ఉంటాయి.

ప్రత్యేక వాతావరణం: కేరళలోని పశ్చిమ కనుమల ఎత్తైన కొండలు, చల్లని తేమ, తగినంత నీడ ఉన్న అటవీ ప్రాంతాల్లో మాత్రమే ఇవి ఏపుగా పెరుగుతాయి.

జీఐ ట్యాగ్..

కేరళలో పండే ‘అలెప్పి గ్రీన్ కార్డమమ్’ కు ప్రతిష్ఠాత్మక భౌగోళిక గుర్తింపు (GI Tag) ఉంది. ఇక్కడి మట్టి, ప్రత్యేక వాతావరణం వల్ల ఈ యాలకులకు మధురమైన పూల సువాసన, నాణ్యమైన ఆకుపచ్చ రంగు లభిస్తాయి.