Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు సంబంధించి కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం పూర్తయింది. ఎవరికి ఏ జిల్లాలో పదవులు కేటాయించాలనే అంశంపై గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు కూటమి నేతలు తెరదించారు. టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్యనేతలు విస్తృతంగా చర్చించి జిల్లాల వారీగా అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో బుధ, గురువారాల్లో జరిగిన చర్చల అనంతరం గురువారం రాత్రి అభ్యర్థుల జాబితాలను ప్రకటించారు. రాష్ట్రంలోని 27 జిల్లా పరిషత్‌లలో కూటమి పార్టీలు విజయం సాధించిన చోట్ల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు కూటమికే దక్కనున్నాయి. మొత్తం 27 జడ్పీ ఛైర్మన్ పదవుల్లో టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి ఒకటి కేటాయించారు. అలాగే వైస్ ఛైర్మన్ పదవుల్లో టీడీపీకి 20, జనసేనకు 5, బీజేపీకి 2 స్థానాలు దక్కనున్నాయి.

జనసేనకు నాలుగు జడ్పీ ఛైర్మన్ పదవులు
పొత్తులో భాగంగా జనసేన పార్టీకి నాలుగు జిల్లాల జడ్పీ ఛైర్మన్ పదవులు కేటాయించారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ జిల్లా పరిషత్ ఛైర్మన్ స్థానాలను జనసేన దక్కించుకుంది. అదేవిధంగా ఐదు జిల్లాల జడ్పీ వైస్ ఛైర్మన్ పదవులు కూడా జనసేనకు కేటాయించారు. తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, బాపట్ల, ప్రకాశం, శ్రీ సత్యసాయి జిల్లాల వైస్ ఛైర్మన్ పదవులను జనసేన అభ్యర్థులు చేపట్టనున్నారు.

బీజేపీకి ఒక ఛైర్మన్, రెండు వైస్ ఛైర్మన్ పదవులు
కూటమిలో భాగంగా బీజేపీకి ఒక జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవితో పాటు రెండు వైస్ ఛైర్మన్ పదవులు కేటాయించారు. కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవిని బీజేపీకి కేటాయించగా, ఎన్టీఆర్, తిరుపతి జిల్లాల జడ్పీ వైస్ ఛైర్మన్ పదవులు కూడా ఆ పార్టీకి దక్కనున్నాయి.