Cyclone Akvan: బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తీవ్ర తుఫాన్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైంది. ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ ఒడిశా తీరాలను తుఫాన్ బాహ్యవలయం తాకింది. ప్రస్తుతం గంటకు 21 కిలోమీటర్ల వేగంతో తుపాన్ కదులుతున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉదయం నాటికి ఒడిశాలోని గోపాల్పూర్ సమీపంలో తుఫాన్ పూర్తిగా తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది.
తుఫాన్ ఎక్కడ కేంద్రీకృతమై ఉంది?
ప్రస్తుతం ఈ తీవ్ర తుఫాన్ కళింగపట్నానికి 110 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 170 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 170 కిలోమీటర్లు, పూరీకి 250 కిలోమీటర్లు, నరసాపురానికి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గత ఆరు గంటల్లో గంటకు 21 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక, తుఫాన్ ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉత్తరాంధ్రలోని ఇతర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
పలు మండలాల్లో భారీ వర్షాలు
శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఇచ్ఛాపురం మండలంలో అత్యధికంగా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కంచిలి, కవిటిలో 10 సెంటీమీటర్లు, పలాసలో 9.9 సెంటీమీటర్లు, సోంపేటలో 9.2 సెంటీమీటర్లు, వజ్రపుకొత్తూరులో 4.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తుఫాన్ తీరం దాటే నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

