130 Year Old Test Record Bobby Peel: జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో విజయం సందర్భంగా దక్షిణాఫ్రికా స్పిన్నర్ సైమన్ హర్మర్ అద్భుత ఘనత సాధించాడు. గురువారం దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించి సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించడంలో హర్మర్ టాప్ పెర్ఫార్మర్‌గా నిలిచాడు. తన కెరీర్‌లో నాలుగో ఐదు వికెట్ల హాల్‌తో 6/51 గణాంకాలతో మెరిశాడు.

130 ఏళ్ల రికార్డు బద్దలు..

ఈ మ్యాచ్‌లో టెస్టు క్రికెట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో (మ్యాచ్‌లో జట్టు రెండోసారి బ్యాటింగ్ చేసే ఇన్నింగ్స్) 50 వికెట్లు పూర్తి చేశాడు. ప్రస్తుతం 14 మ్యాచ్‌ల్లో 14.09 సగటుతో 53 వికెట్లు కలిగి ఉన్నాడు. కనీసం 50 వికెట్లు ఉన్న ఆటగాళ్లలో సెకండ్ ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ సగటుపై బాబీ పీల్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ బాబీ పీల్ (1884-1896) సగటు 14.25గా ఉంది.

9 వికెట్లతో ఘన విజయం..

మ్యాచ్ విషయానికి వస్తే, గురువారం వాండరర్స్ స్టేడియంలో తొలి టెస్టులో 9 వికెట్ల విజయం సాధించడానికి హర్మర్ బంగ్లాదేశ్ తోకను కూల్చేశాడు. చివరి రోజు 100/5తో తిరిగి ప్రారంభించిన బంగ్లాదేశ్ 168 పరుగులకు ఆలౌట్ కావడంలో ఆఫ్-స్పిన్నర్ 6/51తో మెరిశాడు. విజయానికి దక్షిణాఫ్రికాకు కేవలం 12 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. బంగ్లాదేశ్ ఆఫ్-స్పిన్నర్ మెహిదీ హసన్ మిరాజ్ తొలి ఇన్నింగ్స్ టాప్ స్కోరర్ మార్క్వెస్ అకర్‌మన్‌ను డకౌట్ చేసినా, ఆతిథ్య జట్టు సునాయాసంగా లక్ష్యాన్ని చేరుకుంది.

బవుమాకు గాయం, WTCలో అగ్రస్థానం..

ఈ విజయం తర్వాత ఆతిథ్య జట్టుకు షాక్ తగిలింది. కెప్టెన్ టెంబా బవుమా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌కు దూరమవుతాడు. తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పిక్క గాయం కావడంతో రెండో టెస్టుకు బవుమా దూరమవుతాడు. “ఇది నిరాశ కలిగిస్తోంది, వీలైనంత త్వరగా సిద్ధం కావడానికి మెడికల్ టీమ్ పర్యవేక్షణలో రిహాబిలిటేషన్‌లో ఉన్నాను” అని మ్యాచ్ తర్వాత బవుమా విలేకరులతో అన్నారు.

ఈ విజయంతో దక్షిణాఫ్రికా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ప్రస్తుత సైకిల్‌లో 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించింది. కెప్టెన్‌గా 16 టెస్టుల్లో ఇది బవుమాకు 14వ విజయం. టెస్టు చరిత్రలో మరే కెప్టెన్‌కు సాధ్యం కాని ఘనత ఇది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..