హైదరాబాద్‌, నవంబర్ 20: దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE Main) 2027 సెషన్-1 పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కీలక అప్‌డేట్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించగా.. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా అప్లై చేసేందుకు నవంబర్ 22, 2026 చివరి తేదీగా నిర్ణయించింది. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు గడువులోగా తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించింది. JEE Main 2027 మొదటి సెషన్‌కు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 24న ప్రారంభమైంది. అభ్యర్థులు నవంబర్ 22వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడంతో పాటు పరీక్ష ఫీజును కూడా చెల్లించాల్సి ఉంటుంది. చివరి రోజు వరకు వేచి చూడకుండా ముందుగానే అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవడం మంచిది.

ఆలస్య రుసుముతో మరో అవకాశం

నవంబర్ 22లోగా దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులకు ఎన్‌టీఏ మరో అవకాశం కల్పించింది. నవంబర్ 23 నుంచి 26 వరకు ఆలస్య రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం సాధారణ పరీక్ష ఫీజుతో పాటు అదనంగా రూ.500 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ గడువు కూడా నవంబర్ 26వ తేదీ రాత్రి 11.50 గంటలకు ముగియనుంది.

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: అక్టోబర్ 24, 2026.
  • ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 22, 2026.
  • ఆలస్య రుసుముతో దరఖాస్తు గడువు: నవంబర్ 23 నుంచి 26, 2026.
  • అప్లికేషన్‌లో తప్పుల సవరణకు అవకాశం: నవంబర్ 27 నుంచి 29, 2026.
  • పరీక్ష నగర వివరాల స్లిప్: డిసెంబర్ 30, 2026.
  • అడ్మిట్ కార్డుల విడుదల: జనవరి 13, 2027.

జనవరిలో జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలు

ఎన్‌టీఏ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం JEE Main 2027 మొదటి సెషన్ పరీక్షలు జనవరి 20, 21, 22, 23, 24, 28 తేదీల్లో నిర్వహించనున్నారు. పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBT) జరుగుతాయి.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించాలి.
  • JEE Main 2027 Session 1 Registration లింక్‌పై క్లిక్ చేయాలి.
  • సూచించిన విధంగా లాగిన్ వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
  • వ్యక్తిగత, విద్యార్హత వివరాలను నమోదు చేయాలి.
  • పరీక్ష పేపర్, పరీక్ష కేంద్రాల ఎంపిక వివరాలను నమోదు చేయాలి.
  • అవసరమైన ఫొటో, సంతకం, ఇతర ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలి.
  • పరీక్ష ఫీజును చెల్లించి అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్తు అవసరాల కోసం కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

దరఖాస్తు చేసే సమయంలో వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, ఫొటో, సంతకం తదితర వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి. అప్లికేషన్ సమర్పించిన తర్వాత కన్ఫర్మేషన్ పేజీని భద్రపరుచుకోవాలి. చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందుగానే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఎన్‌టీఏ సూచిస్తోంది.

జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1 2027 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.