Impact Of Vijayasai Reddy Party On YSRCP Vote Bank:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పార్టీ ఆవిర్భవించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం నంబర్-2గా, అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడిగా వ్యవహరించిన మాజీ రాజ్యసభ ఎంపీ వి. విజయసాయిరెడ్డి.. విజయవాడ వేదికగా  పరివర్తన రాజనీతి పార్టీ ని అధికారికంగా ప్రారంభించారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి,  విపక్ష వైఎస్సార్‌సీపీలు నడిపిస్తున్న  కుటుంబ, ఆధిపత్య రాజకీయాలకు  ముగింపు పలికి, అట్టడుగు వర్గాలు , యువతే ప్రధాన శక్తిగా మూడో ప్రత్యామ్నాయాన్ని అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

రెడ్డి సామాజికవర్గాన్ని ఓటు  బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నం 

విజయసాయిరెడ్డి ప్రకటనలు కేవలం రాజకీయ ఆర్భాటానికి పరిమితమైనవి కావు. ఒకప్పుడు వైఎస్సార్‌సీపీ ఆర్థిక, రాజకీయ వ్యవస్థలకు కీలక మార్గదర్శిగా పనిచేసిన సాయిరెడ్డికి.. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ ద్వితీయ శ్రేణి నాయకులు, ఆర్థిక మూలాలు ,  రెడ్డి సామాజిక వర్గపు సమీకరణాలపై సంపూర్ణ అవగాహన ఉంది. ఆయన నేరుగా జగన్ మోహన్ రెడ్డి నిరంకుశ వైఖరిని, తాడేపల్లి కోటరీని లక్ష్యంగా చేసుకుని బరిలోకి దిగుతుండటం వల్ల, వైఎస్సార్‌సీపీ బలమైన పునాదులను కదిలించే దిశగానే ఆయన అడుగులు పడుతున్నాయి.

రెండు, మూడు శాతం ఓట్లు చీల్చినా సమస్యే

రాజకీయ నిపుణుల అంచనాల ప్రకారం.. కొత్త పార్టీ ప్రభావం వల్ల విజయసాయిరెడ్డి సగటున 2 నుంచి 3 శాతం ఓటు బ్యాంకును ఆకర్షించగలిగినా, అది రాష్ట్ర రాజకీయ సమీకరణాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు ,  ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో జగన్‌కు సాంప్రదాయక మద్దతుదారులుగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం, అసంతృప్తితో ఉన్న వైసీపీ పాత కేడర్ విజయసాయిరెడ్డి వైపు చూసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. విజయసాయిరెడ్డికి ఆ వర్గంలో ఉన్న వ్యక్తిగత సంబంధాలు వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకుకు కచ్చితమైన గండికొట్టనున్నాయి. ఈ 2-3 శాతం ఓట్ల కోత ఎవరికి అత్యంత నష్టం కలిగిస్తుందనేది ఇక్కడ అసలైన ప్రశ్న. క్షేత్రస్థాయి విశ్లేషణల ప్రకారం, ఈ ఓట్ల చీలిక వల్ల 90 శాతం నష్టం వైఎస్సార్‌సీపీకే వాటిల్లుతుంది. 2024 ఎన్నికల ఓటమి తర్వాత ఆత్మరక్షణలో ఉన్న వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకు నుంచి కొంత భాగాన్ని విజయసాయిరెడ్డి లాక్కోగలిగితే, అది జగన్ మోహన్ రెడ్డి కోలుకునే అవకాశాలను మరింత సంక్లిష్టం చేస్తుంది. కూటమికి ఉన్న పటిష్టమైన ఓటు బ్యాంకింగ్‌కు ఈ ఓట్ల చీలిక మరింత పరోక్ష లబ్ధి చేకూర్చే అవకాశం ఉందే తప్ప ఎలాంటి నష్టం ఉండదు.
 
జగన్ అవమానించారనే పార్టీ పెట్టారా?          

ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గంలో జగన్ ఏకచ్ఛత్రాధిపత్యానికి విజయసాయిరెడ్డి రూపంలో మొదటిసారి ఒక సొంత వర్గం నుంచే గట్టి సవాలు ఎదురవుతోంది. ఇప్పటివరకు ప్రత్యామ్నాయం లేక జగన్ వెంటే నిలిచిన అసంతృప్త రెడ్డి నేతలకు, అలాగే వైసీపీ తీరుపై విసుగు చెందిన సంప్రదాయ కాంగ్రెస్ మూలాలు ఉన్న ఓటర్లకు విజయసాయిరెడ్డి కొత్త వేదికగా కనిపిస్తున్నారు. విధేయత అంటే బానిసత్వం కాదు  అని సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీలోని అసంతృప్త నేతలను ఆకర్షించే పవర్ ఫుల్ పిచ్‌గా పనిచేస్తున్నాయి. విజయసాయిరెడ్డి స్థాపించిన పరివర్తన రాజనీతి పార్టీ అధికారంలోకి రావడం లేదా పెద్ద సంఖ్యలో సీట్లు గెలవడం తక్షణ లక్ష్యం కాకపోవచ్చు. కానీ, వైఎస్సార్‌సీపీ క్వేడర్‌ను, రెడ్డి ఓటు బ్యాంకును ఛిద్రం చేస్తూ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయడమే ఆయన ప్రాథమిక వ్యూహంగా కనిపిస్తోంది. ఏపీ రాజకీయంలో  ఇన్‌సైడర్  అయిన విజయసాయిరెడ్డి వేస్తున్న ఈ పాచికలు రాబోయే రోజుల్లో వైఎస్సార్‌సీపీ భవిష్యత్తును తీవ్రమైన ప్రతికూలతల్లోకి నెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.