జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir) లోని కిష్త్వార్ (Kishtwar) జిల్లాలో అదృశ్యమైన ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్ల (SPOs) మృతదేహాలు తూటాలతో నిండిన స్థితిలో లభ్యమవ్వడం తీవ్ర కలకలం రేపింది. బుధవారం మధ్యాహ్నం మార్వా (Marwah) ప్రాంతంలోని దేహర్నా అటవీ ప్రాంతంలో (Deharna forest area) కాల్పుల శబ్దాలు వినిపించిన తర్వాత వీరిద్దరూ కనిపించకుండా పోయారు. తాజాగా గాలింపు బృందాలు దాచన్ అటవీ ప్రాంతంలో (Dachan forest area) వీరి మృతదేహాలను గుర్తించాయి. ఈ ఇద్దరు పోలీసులను కిడ్నాప్ చేసి, హత్య చేసిన ఉగ్రవాదులను (Terrorists) పట్టుకునేందుకు భద్రతా దళాలు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
అధికార వర్గాల సమాచారం ప్రకారం.. వీరిద్దరూ అదృశ్యమైన ప్రదేశానికి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో మృతదేహాలు దొరికాయి. ఇద్దరి శరీరాలపైనా పలుమార్లు తుపాకీ కాల్పులు జరిపిన గాయాలు ఉన్నాయి. అంతేకాకుండా, వారి దగ్గర ఉన్న సర్వీస్ ఆయుధాలు (Service weapons) కూడా కనిపించకుండా పోయాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మృతులను 45 ఏళ్ల రష్పాల్ సింగ్ (Rashpal Singh), 54 ఏళ్ల బాబీ చంద్ (Bobby Chand) గా గుర్తించారు. వీరిద్దరూ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ లో భాగంగా పనిచేస్తున్నారు. అప్పర్ రిడ్జ్ దేహర్నాలోని ఇందర్వాన్ ప్రాంతంలో (Inderwan area) ఉన్న కియార్ దాచన్ (Kiyar Dachhan) నుంచి బస్నాన్ (Basnan) వైపు ప్రయాణిస్తుండగా ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. బస్నాన్లో విధులు నిర్వహిస్తున్న ఆర్మీకి చెందిన 17 రాష్ట్రీయ రైఫిల్స్ (17 Rashtriya Rifles) బృందం స్థానంలో బాధ్యతలు స్వీకరించడానికి (Relieve) వీరు వెళ్తున్నారు.
బుధవారం మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయంలో ఈ అటవీ ప్రాంతంలో కాల్పుల శబ్దాలు వినిపించాయి. సరిగ్గా అదే సమయంలో మార్వా ప్రాంతంలో ఎయిర్టెల్ మొబైల్ నెట్వర్క్ (Airtel mobile network) సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. కాల్పుల సమాచారం, ఇద్దరు సిబ్బంది అదృశ్యమైన విషయం తెలిసిన వెంటనే.. రాత్రి 7 గంటల సమయంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) ఆధ్వర్యంలో మరో ఎస్ఓజీ (SOG) బృందం తదుపరి చర్యల కోసం ఆ ప్రాంతానికి బయలుదేరి వెళ్లింది. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా భద్రతా దళాల అధీనంలో ఉంది, ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

