AP Crime: జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఏకంగా 20 మంది నుంచి సుమారు రూ.7 కోట్లు వసూలు చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. ఏలూరు, తణుకు ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఈ మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. గగరా ధరణి అనే వ్యక్తి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయ గుర్తులతో పాటు పార్టీ నాయకులు కళ్యాణం శివ శ్రీనివాస్, కోట రుక్మిణి పేర్లను ఉపయోగించి మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. పార్టీ కార్యాలయం పేరుతో నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు సృష్టించి, ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

నిందితుడు ధరణి గతంలో ఓ కన్సల్టెన్సీ జాబ్ ఏజెన్సీలో పనిచేసినట్లు సమాచారం. ఆ అనుభవాన్ని ఉపయోగించుకుని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంతో సంబంధాలు ఉన్నట్లు నమ్మించి పలువురిని మోసం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ నేతల పేర్లు, కార్యాలయ గుర్తులను దుర్వినియోగం చేసిన ఈ వ్యవహారం జనసేన రాష్ట్ర కార్యాలయం దృష్టికి చేరడంతో పార్టీ నాయకులు స్పందించారు. ఈ నేపథ్యంలో జనసేన నేత కళ్యాణం శివ శ్రీనివాస్ మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ పేరును, నాయకుల పేర్లను ఉపయోగించి నకిలీ నియామక పత్రాలు ఇచ్చి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇక, ఫిర్యాదు స్వీకరించిన మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సుమారు రూ.7 కోట్ల వసూళ్ల వ్యవహారంలో బాధితుల వివరాలు, నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు, డబ్బుల లావాదేవీలపై పోలీసులు విచారణ చేపట్టారు. రాజకీయ పార్టీ పేరుతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ మోసం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.