అమరావతి, నవంబర్ 12: ఉపాధ్యాయులకు ఆధునిక బోధనా పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులకు నాయకత్వ లక్షణాలు, డిజిటల్ గవర్నెన్స్, నైపుణ్యాభివృద్ధి అంశాల్లో సింగపూర్ అనుభవాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ మేరకు అమరావతిలోని ఏపీసీఆర్డీఏ కార్యాలయంలో బుధవారం సింగపూర్–ఆంధ్రప్రదేశ్ జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టాండింగ్ కమిటీ (JISC) మూడో సమావేశం జరిగింది. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ అధికారుల బృందం సింగపూర్ ప్రతినిధులతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించింది. అమరావతిని ఆధునిక, సమగ్ర, సుస్థిర రాజధానిగా అభివృద్ధి చేయడానికి ఇరు ప్రభుత్వాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం అమలు, ఇప్పటివరకు సాధించిన పురోగతి, భవిష్యత్తు కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రానికి చెందిన ఆరుగురు మంత్రులు, 37 మంది ఉపాధ్యాయులకు సింగపూర్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ సహకారం అందించిన సింగపూర్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి వేసవి సెలవుల్లో సింగపూర్‌కు పంపించి అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులపై శిక్షణ ఇప్పించాలని ప్రతిపాదించారు. శిక్షణ పూర్తిచేసుకుని తిరిగి వచ్చిన ఉపాధ్యాయులు తాము నేర్చుకున్న ఆధునిక బోధనా పద్ధతులను ఇతర ఉపాధ్యాయులతో పంచుకోవాలని సూచించారు. ఇందుకోసం స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను వేదికగా ఉపయోగించుకోవాలని, సింగపూర్ శిక్షణ ద్వారా లభించే ప్రయోజనాలు రాష్ట్రంలోని ప్రతి ఉపాధ్యాయుడికీ చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

విద్యాశాఖలో సామర్థ్యాల పెంపు కార్యక్రమాలను మార్గదర్శకత్వం, దిశానిర్దేశం, పరిపాలన అనే మూడు ప్రధాన అంశాల ఆధారంగా అమలు చేయాలని పేర్కొన్నారు. శిక్షణ కార్యక్రమాలు కొద్దిమందికే పరిమితం కాకుండా మొత్తం విద్యావ్యవస్థకు ప్రయోజనం చేకూర్చేలా ఉండాలని తెలిపారు. సింగపూర్ సహకారంతో అమలవుతున్న SAGE కార్యక్రమం కింద మంత్రులు, శాఖల కార్యదర్శులకు వేర్వేరుగా శిక్షణ ఇవ్వడం కంటే సంబంధిత మంత్రి, అదే శాఖ కార్యదర్శికి ఒకేసారి శిక్షణ అందించడం మరింత ప్రయోజనకరమని లోకేష్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల విధాన నిర్ణయాలు తీసుకోవడంలో, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో సమన్వయం పెరుగుతుందని వివరించారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు, సివిల్ సర్వెంట్లకు నాయకత్వ లక్షణాలు, ఆధునిక పరిపాలనా విధానాలు, డిజిటల్ నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు పరస్పర అనుభవాల మార్పిడి కార్యక్రమాలను విస్తరించాలని కోరారు.

డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, రియల్ టైమ్ గవర్నెన్స్, సమీకృత డిజిటల్ వేదికల రూపకల్పన, కమాండ్ కంట్రోల్ సెంటర్ల నిర్వహణ, డేటా ఆధారిత నిర్ణయాల అమలులో సింగపూర్ అనుభవాన్ని వినియోగించుకోవాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. ఈ రంగాల్లో సహకారం అందించేందుకు సింగపూర్ సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో వరుస తుఫానుల కారణంగా కొన్ని కార్యక్రమాల అమలులో జాప్యం జరిగిందని వివరించారు. ఎదురైన అవరోధాలను అధిగమించి ప్రతిపాదిత కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి, ప్రభుత్వ ఉద్యోగుల శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి రంగాల్లో ఇరు ప్రభుత్వాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు. గత జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో తీసుకున్న కొన్ని నిర్ణయాల అమలులో జాప్యం జరిగిన అంశంపై కూడా సమావేశంలో చర్చించారు. ఇకపై కమిటీ ప్రతిపాదించిన కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాల అమలు పురోగతిని ప్రతి ఆరు నెలలకోసారి సమీక్షించాలని మంత్రి అధికారులకు సూచించారు. పక్కా ప్రణాళిక, నిరంతర పర్యవేక్షణతో నిర్దేశిత లక్ష్యాలను సాధించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమాల అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేక నోడల్ అధికారిని నియమించినట్లు అధికారులు మంత్రికి వివరించారు.

ఏపీ ప్రతిపాదనలకు సింగపూర్ సానుకూల స్పందన

విద్య, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ పరిపాలన, నాయకత్వ శిక్షణ వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై సింగపూర్ ప్రతినిధి బృందం సానుకూలంగా స్పందించింది. రెండు ప్రభుత్వాల మధ్య సహకారాన్ని మరింత విస్తరించేందుకు అవసరమైన అంశాలపై సమావేశంలో చర్చించారు. సింగపూర్ ప్రతినిధి బృందానికి గన్ సియో హువాంగ్ నేతృత్వం వహించారు. సింగపూర్ విదేశీ వ్యవహారాలు, వాణిజ్య, పరిశ్రమల శాఖల ప్రతినిధులతో పాటు సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్‌ప్రైజ్, ఎంటర్‌ప్రైజ్ సింగపూర్ సంస్థల ప్రతినిధులు, చెన్నైలోని సింగపూర్ కాన్సుల్ జనరల్ విలియం చిక్, న్యూఢిల్లీలోని సింగపూర్ డిప్యూటీ హై కమిషనర్ సుమయా బకావి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. సింగపూర్ అంతర్జాతీయ అనుభవాన్ని రాష్ట్ర విద్య, పరిపాలనా రంగాలకు అనుసంధానం చేయడం ద్వారా ఉపాధ్యాయుల నైపుణ్యాలు, ప్రభుత్వ అధికారుల సామర్థ్యాలు పెంచి అభివృద్ధి లక్ష్యాలను వేగంగా సాధించాలన్నది ఈ సమావేశం ప్రధాన ఉద్దేశంగా నిలిచింది.