AP vs Telangana Investments Competition 2026:  తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య పారిశ్రామిక పురోగతి, గ్లోబల్ పెట్టుబడుల సాధనలో సరికొత్త ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం నెలకొంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు దాదాపు ఒకే సమయంలో మెగా పెట్టుబడుల సదస్సులను నిర్వహిస్తుండటం కార్పొరేట్ రంగాన్ని ఆకర్షిస్తోంది. తెలంగాణలోని ఎనుముల రేవంత్ రెడ్డి సర్కార్ హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా నవంబర్ 13-14 తేదీల్లో ప్రసిద్ధ  భారత్ సమ్మిట్ 2026 ను నిర్వహిస్తుండగా.. అటు ఆంధ్రప్రదేశ్‌లో నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖపట్నం వేదికగా ప్రతిష్టాత్మక 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ను ఎంతో వైభవంగా నిపుణులతో నిర్వహిస్తోంది. రెండు సదస్సుల లక్ష్యం ఒక్కటే—అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలను ఆకట్టుకుని వేల కోట్ల రూపాయల పెట్టుబడులను తమ వైపు తిప్పుకోవడమే.

పోలికలు సహజమే!

ఒకే సమయంలో ఇరు రాష్ట్రాల్లో సమ్మిట్‌లు జరగనుండటంతో సహజంగానే మీడియా, కార్పొరేట్ వర్గాల్లో పోలికలు తీవ్రమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ నిర్వహించే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు కేంద్ర హోంమంత్రి  పీయూష్ గోయల్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ బహుళజాతి కంపెనీల సీఈఓలు, దౌత్యవేత్తలు హాజరవుతున్నారు. సముద్ర తీర ప్రాంతం, డెస్టనీ సిటీ ఆధారంగా విశాఖను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా ప్రతిపాదించి దాదాపు రూ. 11 లక్షల కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలు  కుదుర్చుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు, తెలంగాణ నిర్వహించే భారత్ సమ్మిట్‌లో 70కి పైగా దేశాల నుంచి 1,000 మందికి పైగా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, గ్లోబల్ పాలసీ మేకర్స్ పాల్గొంటున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్లోబల్ ఈక్విటీ, సాంకేతికత,  ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్‌లతో గ్లోబల్ బ్రాండ్‌లను ఆకర్షించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ ఇప్పటికే పొందిన  ఐటీ అండ్ ఫార్మా  గ్లోబల్ అడ్వాంటేజ్‌ను మరింత ముందుకు తీసుకెళ్తూ గ్రీన్ ఎనర్జీ, ఏఐ, స్పేస్ టెక్నాలజీ విభాగాలలో వేల కోట్ల పెట్టుబడులను సాధించడమే తెలంగాణ వ్యూహంగా ఉంది.

తెలంగాణకు హైదరాబాద్.. ఏపీకి పోర్టులు                 

ఈ రెండు సమ్మిట్‌ల పోలికలో మౌలిక సదుపాయాలు, ఎకోసిస్టమ్స్ ప్రధాన వ్యూహాత్మక భిన్నత్వాలుగా నిలుస్తున్నాయి. తెలంగాణ తన ప్రపంచ శ్రేణి హైదరాబాద్ నగర మౌలిక వసతులు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు ,  వేగవంతమైన అనుమతుల వ్యవస్థలను ప్రధాన ఆయుధాలుగా ఉపయోగిస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ తన విస్తారమైన సముద్ర తీరం, పోర్టు ఆధారిత రవాణా, గ్రీన్ హైడ్రోజన్, స్పేస్ టెక్నాలజీ హబ్‌లను చూపుతూ మల్టీనేషనల్స్ కంపెనీలకు ఆకర్షణీయమైన ప్రాధాన్యతలను అందిస్తోంది. కార్పొరేట్ సంస్థల కోణంలో చూస్తే, ఈ రేసు ద్వారా రెండు రాష్ట్రాలకు పెట్టుబడులు రావడం దేశానికే ప్రయోజనకరంగా మారుతోంది. 

పోటీ  వల్ల రెండు  రాష్ట్రాలకూ ప్రయోజనమే!                           

అయితే ఏ రాష్ట్రం ఎంత సులభతర వాణిజ్యం  , సింగిల్ విండో విధానం , స్థిరమైన నిధులు అందిస్తుందనే అంశంపైనే ఒప్పందాల కార్యరూపం ఆధారపడి ఉంటుంది. పెట్టుబడుల సమ్మిట్ వేదికపై ఎవరి ఒప్పందాల సంఖ్య ఎంత, ఏ రాష్ట్రం అధిక గ్లోబల్ జెయింట్స్‌ను తమ భూభాగంలోకి ఆహ్వానిస్తుందో రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఈ పెట్టుబడుల పోటీ రాజకీయ రంగానికి అతీతంగా అభివృద్ధికి కొత్త గమనకాలాన్ని ఇస్తోంది. విశాఖపట్నం పోర్టు లొకేషన్ బలం కాగా, హైదరాబాద్ ఆవిష్కరణల నెట్‌వర్క్ తెలంగాణకు అడ్వాంటేజ్. నవంబర్ రెండో వారంలో వెలువడే పెట్టుబడుల ఒప్పందాలు రాబోయే రోజుల్లో ఏపీ, తెలంగాణ రాజకీయ శ్రేణుల మైలేజ్‌ను శాసించే ప్రధాన కారకాలుగా నిలవబోతున్నాయని అనుకోవచ్చు.