Rahul Gandhi EVM Electoral Rolls Campaign Fail: ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ , ఈవీఎం అక్రమాలు , ఓట్ చోరీ ఆరోపణలపై కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్ వేదికగా నిర్వహించిన చలో ఢిల్లీ మెగా ర్యాలీ జాతీయ స్థాయిలో రాజకీయ వేడిని రాజేసినప్పటికీ, ఆ ఉద్యమం ఆశించిన స్థాయి ప్రజాదరణను పొందడంలో విఫలమైంది. ఎన్నికల ప్రక్రియను, ప్రజాస్వామ్య వ్యవస్థలను తీవ్రంగా ప్రశ్నిస్తూ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఎంతగా గళమెత్తినప్పటికీ.. ఈ అంశం ఒక్కసారిగా చల్లారిపోవడం, క్షేత్రస్థాయికి విస్తరించకపోవడం ఇప్పుడు విపక్షాల వ్యూహాత్మక లోపాలను ఎత్తిచూపుతోంది.
ప్రజా ఉద్యమంలా మార్చలేకపోయిన కాంగ్రెస్
హైకమాండ్ స్థాయిలో ఢిల్లీ కేంద్రంగా సభలు, ప్రెస్ మీట్లు నిర్వహించి ఒక అంశాన్ని డిబేట్‌లోకి తీసుకురావడం సులభమే కానీ, దానిని రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామీణ ప్రాంతాలకు చేర్చి ప్రజాపోరాటంగా మలచడంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విఫలమయ్యాయి. ఢిల్లీలో అధిష్టానం పిలుపునిచ్చినప్పుడు మాత్రమే ధర్నాలు చేయడం, అది పూర్తవగానే నిశ్శబ్దం వహించడం వల్ల ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం గా మిగిలిపోయిందే తప్ప.. సామాన్య ఓటరు తన హక్కు కోసం స్వచ్ఛందంగా పోరాడే ప్రజా ఉద్యమం గా రూపాంతరం చెందలేకపోయింది.
ప్రజలను కదిలించలేకపోయారా?
ఈ ఉద్యమం నిలవకపోవడానికి ప్రధాన కారణం— ఈవీఎంల అక్రమాలు లేదా ఫారమ్-6/7 గందరగోళం వంటి అంశాలు సాంకేతికంగా విపక్షాలకు అనుకూలమైన ఆరోపణలుగా అనిపించినా, సామాన్యుడి దైనందిన బతుకుదెరువు సమస్యలతో నేరుగా ముడిపడకపోవడమే. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, స్థానిక సమస్యలతో సతమతమయ్యే పౌరుడు.. రాజ్యాంగబద్ధ సంస్థల నిర్వహణ లోపాలపై కాంగ్రెస్ ఇచ్చే ఉపన్యాసాలతో పూర్తిగా కనెక్ట్ కాలేకపోయాడు. ప్రజలను తమ వైపు తిప్పుకోవడంలో, వారిని భాగస్వాములను చేయడంలో నాయకత్వం కనబరిచిన వైఫల్యం ఈ టాపిక్ ఆయుష్షును తగ్గించేసింది.
రామ్ లీలా సభ తర్వాతనెక్ట్స్ ప్లాన్ ఏమిటి?
అంతేకాకుండా, కాంగ్రెస్ పార్టీ నడిపించే ప్రచార సరళిలో నిలకడలేకపోవడం మరొక పెద్ద ప్రతిబంధకం. ఒక వివాదాన్ని పట్టుకుని దానిని తార్కిక ముగింపు వరకు నెట్టే ధోరణి కంటే, ఢిల్లీ వేదికగా ఒక పెద్ద ప్రదర్శన చేయడం, ఆపై ఆ అంశాన్ని వదిలేసి మరో కొత్త అంశం వైపు వెళ్లిపోవడం కాంగ్రెస్‌కు పరిపాటిగా మారింది. రామ్‌లీలా మైదాన్ సభ ముగిసిన కొద్ది రోజులకే క్షేత్రస్థాయిలో నిరసనల ఉనికి లేకపోవడంతో, అధికార ఎన్డీయే కూటమి ఈ ఆరోపణలను సులువుగా తిరస్కరించి ఓటమి భయంతో ఆడుతున్న నాటకం అని కొట్టిపారేయడానికి అవకాశం లభించింది.
ఓటు చోరీ అంశానికి స్కోప్ ఉందా?
ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఓట్ చోరీ అనే అంశం దాదాపుగా కాలగర్భంలో కలసిపోయే స్థితికి చేరుకుంది. దీనిని మళ్లీ లేవనెత్తినా ప్రజల నుంచి ఆశించిన స్పందన రావడం కష్టమే. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఈ పాత టాపిక్‌ను పక్కనబెట్టి, ప్రజల నిజమైన ఆకాంక్షలను ప్రతిబింబించే 'కొత్త అజెండా'ను వెతుక్కోవాల్సిన అనివార్యత ఏర్పడింది. ప్రజల ఆర్థిక మూలాలు, ఉపాధి అవకాశాలు, ప్రాంతీయ అసమానతల చుట్టూ తిరిగే పక్కా ప్రజా సమరానికే ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఢిల్లీ ఏసీ గదులు, ప్రెస్ మీట్ల నుంచి బయటకు వచ్చి, రాష్ట్రాల సరిహద్దులు దాటి ప్రజామోదం పొందే రీతిలో ఉద్యమాలను నిర్మించకపోతే కాంగ్రెస్ ఎంతటి తీవ్రమైన ఆరోపణలు చేసినా అవి గాలిలో కలిసిపోక తప్పవు. ఓట్ చోరీ ప్రచారం ఇచ్చిన అనుభవంతోనైనా, రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై కేడర్‌ను క్షేత్రస్థాయిలో నిలబెట్టే సరికొత్త రాజకీయ నెరేటివ్‌ను అందుకుంటేనే కాంగ్రెస్‌కు ప్రజల్లో విశ్వసనీయత లభిస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

