Ram Charan’s Chiru Leaks Joke: మహేశ్ ఉప్పల దర్శకత్వంలో అనీష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తుండగా.. వెంకీ కుడుముల నిర్మిస్తున్నారు. అక్కినేని నాగార్జున సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా సోమవారం రాత్రి హైదరాబాద్లో మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చెర్రీ చేసిన సరదా వ్యాఖ్యలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి.
రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘అనస్వర రాజన్ను ఛాంపియన్ సినిమా సమయంలో కలిశా. మొన్నే అనస్వర గారి వర్క్ స్వయంగా చూశాను. మీకు తెలుసో లేదో.. అనస్వర కాకా సినిమాలో డాడీతో కలిసి నటిస్తున్నారు. సినిమాలో డాడీ, అనస్వర మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి మాత్రం చెప్పను. చిరు లీక్స్లా నేనేమీ లీక్ చేయను. కాకాలో ఆమె ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు’ అంటూ చరణ్ సరదాగా వ్యాఖ్యానించారు. చెర్రీ మాటలకు కార్యక్రమ ప్రాంగణం నవ్వులతో మార్మోగింది. అక్కడున్న అభిమానులు ఈలలు, కేకలతో సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాకాలో అనస్వర కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.
ఇట్లు అర్జున సినిమా గురించి మాట్లాడుతూ.. నవంబర్ 13న విడుదల కానున్న ఈ చిత్రం బ్లాక్బస్టర్ అవుతుందని రామ్ చరణ్ ధీమా వ్యక్తం చేశారు. ‘మీరు రాసిపెట్టుకోండి.. ఇట్లు అర్జున బ్లాక్బస్టర్ పక్కా. అనస్వర రాజన్ మళ్లీ సంక్రాంతికి మరో హిట్ కొడతారు. అది కూడా రాసిపెట్టుకోండి. ఆమె ఈ సినిమాలో చాలా బాగా నటించారు’ అని ప్రశంసలు కురిపించారు. చరణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కాకా సినిమాలో అనస్వర పాత్రపై ఆయన చేసిన సరదా వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి.

