అంతర్జాతీయ క్రికెట్‌లో తమదైన ముద్ర వేసిన ఇద్దరు దిగ్గజాలు విరాట్ కోహ్లీ (Virat Kohli), కేన్ విలియమ్సన్ (Kane Williamson). మైదానంలో ప్రత్యర్థులుగా తలపడినప్పటికీ వ్యక్తిగతంగా వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. తాజాగా తన అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ నిర్ణయం వెనుక కోహ్లీతో జరిగిన సంభాషణ కీలకంగా మారిందని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వెల్లడించాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకునే ముందు కోహ్లీతో మాట్లాడినట్లు తెలిపాడు.

రిటైర్మెంట్‌కు ముందు కోహ్లీతో ప్రత్యేక సంభాషణ..!

‘బిట్వీన్ ది టూ బీర్స్’ (Between the Two Beers) పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన విలియమ్సన్.. తనకు నమ్మకమైన వ్యక్తులతో రిటైర్మెంట్ గురించి చర్చించినట్లు చెప్పాడు. ఈ క్రమంలో ప్రకటన చేయడానికి ఒక రోజు ముందు విరాట్ కోహ్లీతో ఫోన్‌లో మాట్లాడినట్లు వెల్లడించాడు.

కోహ్లీతో జరిగిన సంభాషణ తనకు అద్దంలో చూసుకున్న అనుభూతిని కలిగించిందని పేర్కొన్నాడు. ఇన్నేళ్ల క్రికెట్ ప్రయాణంలో ఎదుర్కొన్న అనుభవాలు, వ్యక్తిగత భావాలు, కెప్టెన్సీ బాధ్యతల గురించి ఇద్దరూ చర్చించుకున్నట్లు వివరించాడు. ఆ సంభాషణ తర్వాత తన భార్య హోటల్ గదిలోకి వచ్చినప్పుడు.. ఇక రిటైర్మెంట్ ప్రకటించాల్సిన సమయం వచ్చిందని చెప్పినట్లు విలియమ్సన్ గుర్తుచేసుకున్నాడు.

మా ఇద్దరి జీవిత ప్రయాణం ఒకేలా సాగింది..!

విరాట్ కోహ్లీతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని కేన్ తెలిపాడు. ఇద్దరూ దాదాపు ఒకే కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌లో ఎదిగారని, కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టారని చెప్పాడు. అంతేకాకుండా ఇద్దరికీ ఒకే సమయంలో పిల్లలు కలగడం వంటి వ్యక్తిగత అనుభవాలు కూడా ఉన్నాయని వెల్లడించాడు.

తన జట్టులోని ఆటగాళ్లతోనూ కొన్ని విషయాలు పంచుకోవచ్చని, కానీ తనలాంటి పరిస్థితులను ఇన్నేళ్లపాటు అనుభవించిన వ్యక్తితో మాట్లాడటం ప్రత్యేకమని పేర్కొన్నాడు. కోహ్లీతో ఎలాంటి సంకోచం లేకుండా తన మనసులోని భావాలను పంచుకోగలిగానని వివరించాడు.

10 వేల టెస్ట్ పరుగుల లక్ష్యం కోసం ఆడలేదు..!

తన టెస్ట్ కెరీర్‌లో 10 వేల పరుగుల మైలురాయిని అందుకోవాలనే వ్యక్తిగత లక్ష్యం ఎప్పుడూ లేదని విలియమ్సన్ స్పష్టం చేశాడు. ఆ సంఖ్య కోసం క్రికెట్ ఆడలేదని తెలిపాడు. తన దృష్టిలో విజయవంతమైన కెరీర్ అంటే కేవలం పరుగులు, సెంచరీలు, బ్యాటింగ్ సగటులు మాత్రమే కాదని అభిప్రాయపడ్డాడు.

ఒక దశలో ఆటపై ఉన్న సహజమైన ఆసక్తి తగ్గి, ఇతరుల కోసం లేదా రికార్డుల కోసం ఆడుతున్నామనే భావన కలిగితే ఆ విషయాన్ని గుర్తించాలని కోహ్లీతో జరిగిన చర్చ తనకు స్పష్టం చేసిందని తెలిపాడు.

కోహ్లీ కంటే ఎక్కువ టెస్ట్ పరుగులు చేసిన విలియమ్సన్..!

కేన్ విలియమ్సన్ తన టెస్ట్ కెరీర్‌లో 9,515 పరుగులు సాధించాడు. విరాట్ కోహ్లీ 9,230 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో విలియమ్సన్ ఖాతాలో 7,256 పరుగులు ఉన్నాయి. టీ20ల్లో 2,775 పరుగులు సాధించాడు.

ప్రస్తుతం కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. గత ఏడాది ఇంగ్లండ్ పర్యటనకు ముందు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇద్దరు దిగ్గజాల మధ్య ఉన్న స్నేహం, ఒకరి అనుభవాలు మరొకరికి ఎలా ఉపయోగపడ్డాయో విలియమ్సన్ వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..