- రూ.లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్?
- డేటా సెంటర్ల నుంచి సెమీకండక్టర్ల వరకు కీలక పాలసీలు
- ఏపీకి పెట్టుబడుల జోరు.. నేడు కేబినెట్లో కీలక చర్చలు
- కేబినెట్ ముందుకు భారీ పెట్టుబడి ప్రతిపాదనలు
AP Cabinet Meeting Today : ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధికి మరింత ఊతమిచ్చే దిశగా చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయాలకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం ఉదయం 10:30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. 30కిపైగా అజెండా అంశాలతో జరగనున్న ఈ భేటీలో కొత్త పాలసీలు, భారీ పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు సంబంధించిన ప్రతిపాదనలపై ప్రధానంగా చర్చించనున్నారు..
కీలక పాలసీలకు ఆమోదం ఛాన్స్.. :
ముఖ్యంగా రాష్ట్రాన్ని టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఏఐ రంగాల్లో ముందంజలో నిలబెట్టేలా కీలక పాలసీలకు ఆమోదం తెలిపే ఛాన్స్ కనిపిస్తోంది.. ఏపీ యానిమేషన్, వీఎఫ్ఎక్స్ 2026-31 పాలసీతో పాటు రోబోటిక్స్, ఫిజికల్ ఏఐ, సెమీకండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీల ముసాయిదాలు కేబినెట్ ముందుకు రానున్నాయి. ఇవన్నీ అమల్లోకి వస్తే రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది..
భారీపెట్టుబడి ప్రతిపాదనలివే :
ఇక భారీ పెట్టుబడి ప్రతిపాదనలు కూడా ఈ సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ.570.20 కోట్లతో ఇప్యాక్ డేటా సెంటర్, నాయుడుపేటలో రూ.4 వేల కోట్లతో కార్బన్ కాస్మో అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ప్లాంట్, తిరుపతిలో రూ.700 కోట్లతో డిక్సన్ టెక్నాలజీస్ యూనిట్ ఏర్పాటుపై నిర్ణయాలు తీసుకునే అవకాశముంది..
ఏఐ డేటా సెంటర్ ప్రతిపాదనలపై చర్చ :
భీమిలిలో రూ.31,387 కోట్లతో గ్రీన్ ఏఐ డేటా సెంటర్, భోగాపురంలో రిలయన్స్ గిగా స్కేల్ ఏఐ డేటా సెంటర్ ప్రతిపాదనలు కూడా చర్చకు రానున్నాయి. ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాలిస్తే వేలాది మందికి ఉపాధి అవకాశాలు అందనున్నాయి..
సోలార్ పవర్, బయోగ్యాస్ ప్లాంట్లు.. :
పరిశ్రమలతో పాటు మౌలిక వసతులపైనా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. విజయవాడలో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్, సోలార్ పవర్ ప్రాజెక్టులు, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుపై చర్చించనున్నారు. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్లో హెటిరోకు భూకేటాయింపు, అన్నమయ్య జిల్లాలో ఫుట్వేర్ కాంపోనెంట్ పార్క్, జగ్గయ్యపేటలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఫ్లో ఇండస్ట్రియల్ పార్క్ ప్రతిపాదనలు కూడా అజెండాలో ఉన్నాయి..
మరోవైపు పోలీస్ శాఖలో రోడ్ సేఫ్టీ డైరెక్టరేట్ ఏర్పాటు, తిరుమలలో కొత్త పోస్టులు, అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ఎస్ఎంఆర్ టెక్నాలజీ వినియోగం వంటి అంశాలపైనా చర్చకు రానుంది. సమావేశం తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, విశాఖలో జరగనున్న పార్టనర్షిప్ సమ్మిట్ ఏర్పాట్లపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది.

