Virat Kohli Outside Edge: భారత క్రికెట్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) స్థానం ప్రత్యేకం. ప్రపంచ స్థాయి బ్యాటర్‌గా ఎన్నో రికార్డులు సృష్టించిన అతడికి సలహాలు ఇవ్వాలంటే కోచ్‌లు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారట. తాజాగా టీమిండియా మాజీ సహాయక కోచ్ ర్యాన్ టెన్ డస్కటే (Ryan ten Doeschate) ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ బ్యాటింగ్‌లో పదేపదే కనిపించిన ఓ లోపం గురించి అతడితో మాట్లాడిన అనుభవాన్ని పంచుకున్నాడు.

కోహ్లీతో మాట్లాడేందుకు ధైర్యం చేశా!

టాక్‌స్పోర్ట్ క్రికెట్ (talkSPORT Cricket) పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన టెన్ డస్కటే.. ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ ఆఫ్ స్టంప్ బయటకు వెళ్తున్న బంతులను డ్రైవ్ చేయబోయి వికెట్ సమర్పించుకుంటున్నాడని గుర్తించినట్లు తెలిపాడు. ఒకే తరహాలో పదేపదే ఔటవుతుండటంతో ఈ విషయాన్ని అతడి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడట.

అయితే కోహ్లీ వంటి సీనియర్ ఆటగాడితో సాంకేతిక లోపాల గురించి మాట్లాడటం అంత సులభం కాదని చెప్పాడు. కోచ్‌లు తమ సలహాలను ఆటగాళ్లు ఎలా స్వీకరిస్తారోనని భయపడుతుంటారని వివరించాడు. అయినప్పటికీ ఉపయోగపడే సూచన ఇవ్వడానికి వెనుకాడకూడదని భావించినట్లు వెల్లడించాడు.

వర్షం విరామంలో కోహ్లీతో చర్చ!

నాలుగో టెస్ట్ మ్యాచ్ సమయంలో కోహ్లీతో మాట్లాడేందుకు సరైన సమయం కోసం ఎదురుచూశానని టెన్ డస్కటే చెప్పాడు. ముఖ్యంగా మిచెల్ స్టార్క్ (Mitchell Starc) వంటి బౌలర్‌ను ఎదుర్కొనే ముందు బ్యాటర్‌కు కొత్త సాంకేతిక సూచనలు ఇవ్వడం అతడి ఏకాగ్రతను దెబ్బతీయవచ్చని అభిప్రాయపడ్డాడు.

అందుకే వర్షం కారణంగా ఆట నిలిచిన సమయంలో కోహ్లీతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. తన ఉద్దేశం కోహ్లీకి ఎలా బ్యాటింగ్ చేయాలో చెప్పడం కాదని, అతడు కొన్ని షాట్లు ఎందుకు ఆడుతున్నాడో తెలుసుకోవడమేనని వివరించాడు.

తన బ్యాటింగ్ విధానాన్ని వివరించిన విరాట్!

కోహ్లీ తనతో చాలా సానుకూలంగా మాట్లాడాడని టెన్ డస్కటే వెల్లడించాడు. తాను ఆఫ్ స్టంప్ బయట బంతులను ఎందుకు డ్రైవ్ చేయాలనుకుంటున్నాడో కోహ్లీ వివరించాడట. ఇద్దరి మధ్య జరిగిన చర్చ ఏకపక్షంగా కాకుండా పరస్పర అభిప్రాయాల మార్పిడిగా సాగిందని తెలిపాడు.

ఒక ఆటగాడి బ్యాటింగ్ విధానాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం లేదని, అతడి సహజ శైలిని కొనసాగిస్తూనే కొన్ని చిన్న మార్పులు చేయవచ్చని పేర్కొన్నాడు. కోహ్లీకి ఎక్కువ కోచింగ్ అవసరం లేదని, అయితే ఒకే తరహాలో ఔటవుతుండటం తన దృష్టిని ఆకర్షించిందని చెప్పాడు.

కోహ్లీతో మాట్లాడేందుకు కోచ్‌లు ఎందుకు భయపడతారు?

ఆధునిక క్రికెట్‌లో ఆటగాళ్ల ప్రాధాన్యం పెరిగిందని టెన్ డస్కటే అభిప్రాయపడ్డాడు. దీంతో సీనియర్ ఆటగాళ్ల నిర్ణయాలను ప్రశ్నించడానికి కొందరు కోచ్‌లు వెనుకాడుతున్నారని తెలిపాడు. అయితే ఒక ఆటగాడికి సూచన ఇచ్చేటప్పుడు మాటల కంటే వాటిని చెప్పే విధానం చాలా ముఖ్యమని పేర్కొన్నాడు.

కోహ్లీ వంటి ఆటగాడితోనే సరైన పద్ధతిలో మాట్లాడగలిగితే ఇతర ఆటగాళ్లతోనూ సులభంగా చర్చించవచ్చని వివరించాడు. అయితే ఈ సూచనలతో భారత జట్టు ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిందని కూడా అంగీకరించాడు.

కేకేఆర్‌లో కీలక బాధ్యతలు!

భారత జట్టు కోచింగ్ సిబ్బంది నుంచి తప్పుకున్న టెన్ డస్కటే తిరిగి నైట్ రైడర్స్ (Knight Riders) వ్యవస్థలో చేరాడు. ప్రస్తుతం కేకేఆర్ యాజమాన్యానికి చెందిన సంస్థలో హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా బాధ్యతలు చేపట్టాడు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ క్రికెట్ కోచింగ్‌కు దూరమైనట్లు సమాచారం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..