White House Lockdown: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ సమీపంలో సోమవారం వరుసగా రెండు భద్రతా ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమై వైట్‌హౌస్‌ పరిసరాలను కొద్దిసేపు తాత్కాలికంగా లాక్‌డౌన్‌ చేశారు. వాషింగ్టన్‌ డీసీలోని లాఫాయెట్‌ పార్క్‌ సమీపంలో ఓ కారు పాదచారుల ప్రాంతంలోకి దూసుకెళ్లి ప్రమాదానికి గురికాగా.. అదే సమయంలో మరో వ్యక్తి భద్రతా బారికేడ్లను దాటి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. రెండు ఘటనల్లోనూ నిందితులను అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనలు జరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వైట్‌హౌస్‌లోనే ఉన్నారు. దీంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై వైట్‌హౌస్‌ చుట్టుపక్కల పాదచారులు, వాహనాల రాకపోకలను నిలిపివేశారు. లాఫాయెట్‌ పార్క్‌ మీదుగా వెళ్లే పలు రహదారులను మూసివేసి.. అత్యవసర సిబ్బంది, భద్రతా బలగాలు అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నాయి.

పాదచారుల ప్రాంతంలోకి దూసుకెళ్లిన కారు

మొదటి ఘటన లాఫాయెట్‌ స్క్వేర్‌ ఉత్తర భాగంలో చోటుచేసుకుంది. ఓ సిల్వర్ కలర్ సెడాన్‌ అదుపుతప్పి పాదచారుల ప్రాంతంలోకి దూసుకెళ్లి అక్కడ ఉన్న వీధి సూచిక స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత కారు నుంచి పొగలు వెలువడినట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న భద్రతా సిబ్బంది కారులోని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా.. అతడు అధికారులతో తీవ్రంగా వాగ్వాదానికి దిగినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో అతడికి, పోలీసులకు మధ్య స్వల్పంగా ఘర్షణ చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. “డ్రైవర్‌ పోలీసు అధికారులతో దురుసుగా ప్రవర్తించాడు. అయితే అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నాం” అని సీక్రెట్‌ సర్వీస్‌ ప్రతినిధి తెలిపారు.

అయితే కారును ఉద్దేశపూర్వకంగానే పాదచారుల ప్రాంతంలోకి నడిపించాడా? లేక ప్రమాదవశాత్తూ ఈ ఘటన జరిగిందా? అనే విషయంపై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. డ్రైవర్‌ గుర్తింపును, ఘటన వెనుక ఉద్దేశాన్ని కూడా వెల్లడించలేదు.

బారికేడ్‌ దూకిన మరో వ్యక్తి

మరోవైపు దాదాపు అదే సమయంలో లాఫాయెట్‌ పార్క్‌ వాయువ్య ప్రాంతంలో మరో భద్రతా ఉల్లంఘన జరిగింది. ఓ వ్యక్తి భద్రతా బారికేడ్లను దాటి వైట్‌హౌస్‌ పరిసరాల వైపు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. వైట్‌హౌస్‌కు ఎదురుగా పెన్సిల్వేనియా అవెన్యూ అవతల ఉన్న లాఫాయెట్‌ స్క్వేర్‌ అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ప్రాంతాల్లో ఒకటి. తక్కువ వ్యవధిలోనే రెండు ఘటనలు చోటుచేసుకోవడంతో అధికారులు ముందు జాగ్రత్తగా వైట్‌హౌస్‌ పరిసర ప్రాంతాన్ని పూర్తిగా భద్రతా వలయంలోకి తీసుకున్నారు.

దర్యాప్తు ప్రారంభించిన అధికారులు

రెండు ఘటనలపై ఫెడరల్‌ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కారు ప్రమాదంలో లేదా బారికేడ్‌ దాటిన ఘటనలో ఎవరైనా పాదచారులు, భద్రతా సిబ్బంది గాయపడ్డారా అనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. అలాగే ఈ రెండు ఘటనలకు పరస్పర సంబంధం ఉందా? ఇద్దరూ కలిసి ఈ చర్యలకు పాల్పడ్డారా? లేక యాదృచ్ఛికంగా ఒకే సమయంలో ఘటనలు జరిగాయా? అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. పరిస్థితి అదుపులోకి వచ్చి ప్రాంతం సురక్షితమని అధికారులు నిర్ధారించిన అనంతరం వైట్‌హౌస్‌ పరిసరాల్లో సాధారణ రాకపోకలను పునరుద్ధరించారు.