Srisailam Karthika Mahotsavam: ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయంలో నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 9వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, కార్తీక మాసమంతా భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలను దేవస్థానం నిలిపివేసింది. భక్తులకు స్వామివారి దర్శనం సజావుగా కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారట అధికారులు..

అదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే ప్రత్యేక రోజుల్లో స్పర్శ దర్శనాలను కూడా రద్దు చేశారు. ముఖ్యంగా కార్తీక శని, ఆది, సోమవారాలతో పాటు కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజుల్లో భక్తులకు స్పర్శ దర్శనాలు అందుబాటులో ఉండవు. ఈ రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శన ఏర్పాట్లలో మార్పులు చేశారు. అయితే సాధారణ రోజుల్లో ఐదు విడతలుగా శ్రీశైల మల్లన్న స్వామివారి స్పర్శ దర్శనానికి భక్తులకు అవకాశం కల్పించనున్నారు. కార్తీక మాసంలో భక్తులు పవిత్రమైన కార్తీక దీపాలను వెలిగించేందుకు వీలుగా క్షేత్రంలో దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం, దీపారాధన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.