KTR: బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ కార్యకర్త అంత్యక్రియలకు వెళ్తోన్న ఒక మాజీ ఎమ్మెల్యేను దారిలోనే అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి, కక్షసాధింపు చర్యలకు ఈ అరెస్టే నిదర్శనమని మండిపడ్డారు.

ప్రతిపక్షాలపై నిర్బంధం  

బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తోన్న ఒక నాయకుడిని అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కేటీఆర్ ప్రశ్నించారు. "కార్యకర్త కుటుంబానికి అండగా నిలవడం కూడా ఈ ఇందిరమ్మ రాజ్యంలో నేరమైందా?" అని నిలదీశారు. నిర్బంధాలు, అక్రమ అరెస్టులతో ప్రతిపక్షాలను భయపెట్టడమే కాంగ్రెస్‌ పార్టీ తమ పాలనగా మార్చుకుందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ బెదిరింపులకు బీఆర్‌ఎస్‌ ఏమాత్రం భయపడదని, ప్రజలు, కార్యకర్తల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. పట్నం నరేందర్‌రెడ్డిని ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే విడుదల చేయాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

Also Read: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!

తుగ్లక్ పాలన  

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలను భాగస్వాములను చేయకుండానే ప్రభుత్వం పబ్లిక్ హియరింగ్స్ నిర్వహిస్తోందని ఆరోపించారు. డీపీఆర్ లేకుండానే వివిధ ప్రాజెక్టులకు టెండర్లు పిలుస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులు ఉన్న సమయంలో ప్రజలకు ఉపశమనం కలిగించడం మాని, బ్యూటిఫికేషన్ పనులపై ప్రభుత్వానికి అంత ప్రాధాన్యత ఎందుకో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజా ప్రయోజనాలను పక్కనబెట్టి నిర్ణయాలు తీసుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని "తుగ్లక్‌ పాలన" కాకపోతే ఇంకేమంటారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

Also Read: రాజకీయాలను పక్కనబెట్టి కరీంనగర్ అభివృద్ధికి కట్టుబడి.. రూ.4 కోట్ల పనులకు బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన