లగచర్ల: వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బూర్గుల రామకృష్ణారావు కాలం నుంచి ఎంతో మంది నాయకులు పాలమూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినా, ఇప్పటికీ వలసలు ఆగలేదని, నీటి ప్రాజెక్టులు పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2028 డిసెంబరు నాటికి కొడంగల్‌కు కృష్ణాజలాలు తీసుకొస్తా.. పోలేపల్లి ఎల్లమ్మ మీద ఆన అన్నారు రేవంత్ రెడ్డి.

తెలంగాణ వస్తే కష్టాలు తీరుతాయని ఆనాడు కేసీఆర్‌ను గెలిపిస్తే, సీఎంగా బాధ్యతలు చేపట్టాక గజ్వేల్‌కే ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ రూ. 8.11 లక్షల కోట్ల అప్పులు చేసి ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని, ఆయన చేసిన అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. 80 వేల కోట్లను చెల్లిస్తోందని, గత 34 నెలల్లో రూ. 2 లక్షల కోట్లకు పైగా అసలు, వడ్డీలు చెల్లించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. 

పరిపాలనలో తమ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని, నిరుపేద ఉద్యోగుల కష్టాలను గుర్తించి 11 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించే పనులు తాము చేపడుతుంటే, బీఆర్‌ఎస్ నేతలు అడ్డుకోవాలని చూడడంపై మండిపడ్డారు. బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, గడ్డం ఎంత పెంచినా రేవంత్ రెడ్డి కాలేరని, ప్రజల కోసం నిలబడే గుండె ధైర్యం, తెగువ ఉండాలని వ్యాఖ్యానించారు. పోలేపల్లి ఎల్లమ్మ తల్లి సాక్షిగా చెబుతున్నానని, ఎవరు అడ్డం వచ్చినా తొక్కుకుంటూ ఈ ఏడాది డిసెంబర్ నాటికి కృష్ణా జలాలను కొడంగల్ బీడు భూములకు తరలించి పచ్చని పంటలు పండిస్తామని స్పష్టం చేశారు.

ఒకప్పుడు ఉన్నత చదువుల కోసం పక్క జిల్లాలకు వెళ్లాల్సిన కొడంగల్‌ను నేడు 'ఎడ్యుకేషన్ హబ్'గా మారుస్తున్నామని సీఎం తెలిపారు. దీనిలో భాగంగానే కొడంగల్‌లో రూ. 9,000 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించామని, రాబోయే రోజుల్లో వేల కోట్ల పెట్టుబడులు రప్పించి ఈ ప్రాంతాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. కొడంగల్ ప్రజల ఆశీస్సులు ఉంటే ఢిల్లీలో మోదీనైనా, ఇక్కడ కేడీనైనా ఎదిరిస్తానని ధీమా వ్యక్తం చేశారు. సంక్రాంతి తర్వాత 'ప్రజాబలం' పేరుతో ప్రజల్లోకి వచ్చి ఎల్నినో వంటి సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కొంటామన్నారు. అలాగే విలేకరులు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, జర్నలిస్టుల సమస్యలన్నింటినీ పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు.

రూ.9,053 కోట్లతో 13 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా వివిధ ప్రాంతాలలో రూ.9,053.48 కోట్ల భారీ అంచనా వ్యయంతో చేపట్టనున్న మొత్తం 13 కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, శిలాఫలకాల ఆవిష్కరణలు జరిగాయి. ఇందులో రవాణా రంగం విస్తరణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, కొత్తవాల్‌గూడ నుంచి నాచారం వరకు రూ.5,060 కోట్లతో రేడియల్ రోడ్డు–2 పనులను ప్రారంభించారు. అంతేకాకుండా, ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద రూ.1,410 కోట్లతో 223 కొత్త, అసంపూర్తిగా ఉన్న బీటీ రహదారుల పనులకు, అలాగే రూ.2,100 కోట్ల అంచనా వ్యయంతో MNKLIS రెండో దశ పనులకు శ్రీకారం చుట్టారు.

విద్యా, రవాణా, మౌలిక వసతుల కల్పనలో భాగంగా రూ.118.80 కోట్లతో 10 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, రూ.123 కోట్లతో కొడంగల్‌లో వ్యవసాయ కళాశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజల ప్రయాణ సౌకర్యార్థం రూ.41.83 కోట్లతో కొడంగల్, కోస్గి, మద్దూరులలో ఆధునిక బస్ స్టాండ్ల నిర్మాణం చేపడుతున్నారు. యువతకు ఉపాధి నైపుణ్యాలు పెంచేందుకు రూ.20 కోట్లతో మద్దూరులో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (NAC) స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, పాలనాసౌలభ్యం కోసం రూ.20 కోట్లతో సమీకృత డివిజనల్ కార్యాలయ సముదాయం, ఇతర బీటీ రహదారుల కోసం రూ.59.30 కోట్ల పనులను ప్రారంభించారు.

ధార్మిక, పర్యాటక, పారిశ్రామిక రంగాలు సైతం ఈ పనుల ద్వారా మరింత వేగం పుంజుకోనున్నాయి. తిమ్మారెడ్డిపల్లిలో గురులోక మసంద్ ప్రభు మందిరం అభివృద్ధికి రూ.4.45 కోట్లు, కొడంగల్‌లోని నిరంజన్ మఠం అభివృద్ధికి రూ.5.10 కోట్లతో పనులు చేపట్టారు. పరిశ్రమలు, పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ హకీంపేట ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ.10 కోట్లతో పర్యాటక హోటల్ నిర్మాణం, రూ.81 కోట్లతో ఎకోపామ్‌ పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించిన పనులకు సీఎం రేవంత్ రెడ్డి శిలాఫలకాలు ఆవిష్కరించారు.