YSRCP Strategic Mistake Municipal Elections:   ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు  ఊహించినట్లుగానే అధికార ఎన్డీయే కూటమికి ఏకపక్షంగా విజయాన్ని కట్టబెట్టాయి. 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు,  నగర పంచాయతీలతో కూడిన పురపాలక క్షేత్రంలో కమలం, సైకిల్, గాజు గ్లాస్ కూటమి తన తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అయితే, కొన్ని చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కూటమి ధనప్రవాహాన్ని, అధికార బలాన్ని తట్టుకుని గట్టి పోటీ ఇచ్చి విజయం దిశగా నిలిచిన దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచే వైఎస్సార్‌సీపీ నాయకత్వంలో ఆవహించిన ఓ రకమైన నిరాశావాదం , క్షేత్రస్థాయిలో సరైన రాజకీయ మద్దతు లేకపోవడమే ఈ భారీ పరాజయానికి ప్రధాన  కారణంగా  విశ్లేషకులు భావిస్తున్నారు.

గెలుపోటములు కాదు పోటీ చేయడం ముఖ్యమని పదే పదే చెప్పిన జగన్ 

నిజానికి, ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన శ్రేణులతో మాట్లాడిన తీరును పరిశీలిస్తే..  గెలుపోటముల సంగతి తర్వాత, ముందు స్థానిక సంస్థల్లో పోటీ చేసి పార్టీ ఉనికిని చాటడం ముఖ్యం  అన్న రీతిలోనే పిలుపునిచ్చారు. ఫలితం కంటే పోటీ చేయడంపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టాలన్న సందేశం క్షేత్రస్థాయి కేడర్‌లోకి వేగంగా వెళ్లిపోయింది. దాంతో అభ్యర్థులు నామినేషన్లు వేసినప్పటికీ, వారిలో గెలవాలన్న ఆరాటం కంటే  ఎన్నిక ముగిస్తే చాలు  అనే ధోరణి స్పష్టంగా కనిపించింది. ఒకవేళ అధిష్ఠానం మొదటి నుంచే విజయం సాధించాలనే సంకల్పంతో అభ్యర్థులకు అవసరమైన నిధులు, వ్యూహాత్మక,  నైతిక సపోర్టు అందించి ఉంటే.. ఫలితాల రూపురేఖలు మరింత మెరుగ్గా ఉండేవన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఏకగ్రీవాలు లేవు!

ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ పురపాలక పోరులో ఉమ్మడి రాయలసీమలోని కొన్ని పాకెట్లు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవాలు చాలా తక్కువ సంఖ్యలోనే నమోదయ్యాయి. పోలింగ్ రోజున ఎక్కడా పెద్ద ఎత్తున  ఘర్షణలు,  శాంతిభద్రతల విఘాతం కలగలేదు. అంటే ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి తగిన వాతావరణం ఉంది. అలాంటి స్థితిలో ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్‌సీపీ కేడర్‌ను రోడ్లపైకి తెచ్చి, ఓటర్లను పోలింగ్ బూతులకు తరలించే ఎలక్షన్ మేనేజ్‌మెంట్  వ్యవస్థను పటిష్టం చేసుకోలేకపోవడం ఆ పార్టీ వైఫల్యానికి నిదర్శనం. వైఎస్సార్‌సీపీ చేసిన అన్నిటికంటే పెద్ద  పొలిటికల్ అండ్ స్ట్రాటజిక్ మిస్టేక్ ఏంటంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 92 కి పైగా పట్టణ సంస్థలను పక్కనబెట్టి, కేవలం తమ సొంత నియోజకవర్గమైన పులివెందుల మున్సిపాలిటీపైనే పూర్తి దృష్టి సారించడం. 

పులివెందులపైనే ఎక్కువ ఫోకస్ చేసిన జగన్   

పులివెందులలో 70 మందికి పైగా తమ పోలింగ్ ఏజెంట్లను అడ్డుకున్నారంటూ వైఎస్ జగన్ స్వయంగా అక్కడకు వెళ్లి రిటర్నింగ్ ఆఫీసర్  కార్యాలయం ముందు ధర్నా చేయడం, ధర్నాలు నిర్వహించడం జాతీయ స్థాయిలో మీడియా దృష్టిని ఆకర్షించినప్పటికీ.. మిగిలిన రాష్ట్రవ్యాప్త పట్టణ ప్రాంతాల అభ్యర్థులను దిక్కులేని వారిగా మార్చేసింది. అధినేతే ఒకే స్థానానికి పరిమితమై ధర్నాలు చేస్తుంటే, రాష్ట్రంలో మిగిలిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఎవరు పట్టించుకుంటారన్న భావన కేడర్‌లో నెలకొంది.  మిగిలిన పట్టణాల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ స్వయంకృషితోనే కూటమి బలంతో పోరాడాల్సి వచ్చింది. విశాఖ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు వంటి ప్రధాన కార్పొరేషన్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కొన్ని వార్డుల్లో స్వల్ప మెజార్టీలతో ఓడిపోవడం వెనుక.. ఆఖరి నిమిషంలో అధిష్ఠానం నుంచి లభించని  చేయూత  స్పష్టంగా కనిపిస్తోంది.  నాయకత్వమే సమరానికి సరిగ్గా సిద్ధపడనప్పుడు, మేము మాత్రం సొంత సొమ్ము తగలేసుకుని ఎందుకు పోరాడాలి?  అనే నిర్వేదం అభ్యర్థులను ఆవహించడంతో ఓటింగ్ రోజున వైఎస్సార్‌సీపీ క్యాంప్‌లు ఆశించిన స్థాయిలో యాక్టివ్‌గా పనిచేయలేదు.

ఏపీ మున్సిపల్ ఎన్నికల తీర్పు వైఎస్సార్‌సీపీకి ఒక స్పష్టమైన హెచ్చరిక లాంటిది. ప్రతికూల రాజకీయ పరిస్థితులు ఉన్నప్పటికీ, ఎన్నికలను సీరియస్‌గా తీసుకోకుండా నిరాశావాదంతో ఎదుర్కోవడం వల్ల తీవ్ర ప్రతికూల ఫలితాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. పులివెందుల నిరసనలపై కేంద్రీకరించిన శ్రద్ధలో పదో వంతు రాష్ట్రవ్యాప్త వ్యూహాలపై పెట్టి ఉంటే.. వైఎస్సార్‌సీపీ పుర ఫలితాల్లో మరింత గౌరవప్రదమైన స్థానాలను సాధించి ఉండేదని వైసీపీ క్యాడర్‌లో చర్చ జరుగుతోంది.