Kharif Paddy Crop Damage in East Godavari: ‘అర్నబ్’ తుఫాన్ ప్రభావం నుంచి తూర్పుగోదావరి జిల్లా ఇంకా పూర్తిగా కోలుకోకముందే మరోసారి వర్షాలు రైతులను కలవరపెడుతున్నాయి. ‘మురసు’ తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఇప్పటికే అర్నబ్ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఖరీఫ్ వరి పంటకు తాజా వర్షాలు మరింత నష్టం కలిగిస్తున్నాయి. కోతకు సిద్ధంగా ఉన్న వరి పొలాలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే చేతికొచ్చిన పంట పూర్తిగా దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకవైపు తుఫాన్ నష్టాల నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్న అన్నదాతలకు మరోసారి వర్షాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మురుసు తుఫాన్ ప్రభావంతో తెల్లవారుజాము నుంచే జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఇప్పటికే నీట మునిగిన వరి పొలాల్లోకి మళ్లీ వర్షపు నీరు చేరుతోంది. ఖరీఫ్ సీజన్లో పంట కోతలు, నూర్పిళ్లకు సిద్ధమవుతున్న సమయంలో వర్షాలు పడటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పొలాల్లో నీరు నిలిచిపోవడంతో వరి పనలు తడిసిపోయి ధాన్యం రంగు మారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత తుఫాన్ నష్టాలే ఇంకా వెంటాడుతుండగా.. తాజా వర్షాలతో పంట పూర్తిగా చేతికి అందకుండా పోతుందేమోనని రైతులు భయపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని కోరుతున్నారు.

