Telangana Congress Rebels Revanth Reddy Govt : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా పార్టీ అంతర్గత విభేదాలు మాత్రం నివురుగప్పిన నిప్పులా రగులుతూనే ఉన్నాయి. ఒకవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మరోవైపు జడ్చర్ల ఎమ్మెల్యే జె. అనిరుధ్ రెడ్డి నేరుగా తమ సొంత ప్రభుత్వంపైనే అసంతృప్తి వ్యాఖ్యలు చేయడం, విమర్శల బాణాలు ఎక్కుపెట్టడం టీపీసీసీలో పెను దుమారం రేపుతోంది. ఇద్దరు ఎమ్మెల్యేల వేదన, ఆరోపణలు దాదాపు ఒకే తీరుగా ఉన్నాయి— నియోజకవర్గాలకు అభివృద్ధి నిధులు రావడం లేదు, మంత్రివర్గంలో తగిన ప్రాధాన్యత దక్కలేదు, నిధుల కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యేల తరహాలోనే పోరాడాల్సి వస్తోంది అని వారు బహిరంగంగానే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టెండర్ల కోసం ఒత్తిడి చేస్తున్నారా?
ఈ అసంతృప్తి వెనుక కేవలం నిధులు, మంత్రి పదవుల ఆశలు మాత్రమే కాక టెండర్ల కేటాయింపుల్లో ప్రాధాన్యత దక్కకపోవడం కూడా ఉందనే ఆరోపణలు నడుస్తున్నాయి. హైదరాబాద్ రేడియల్ రోడ్ల టెండర్ల విషయంలో ఏపీకి చెందిన కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని, లోకల్ కాంట్రాక్టర్లను పక్కనబెట్టారని రాజగోపాల్ రెడ్డి నేరుగా సీఎంఓ నిఘా, టెండర్ల కేటాయింపులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం కేడర్‌ను షాక్‌కు గురిచేసింది. మరోవైపు, జడ్చర్ల నియోజకవర్గంలో రోడ్డు, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడం, ఫండ్స్ విడుదల కాకపోవడంతో అనిరుధ్ రెడ్డి ఆమరణ దీక్షకు హెచ్చరికలు జారీ చేసే దాకా పరిస్థితి దాటింది.
పొలిటికల్ ఎజెండాలతోనే అసంతృప్తి
అయితే, ఈ ఇద్దరి అసంతృప్తుల వెనుక పొలిటికల్ అజెండాలు ఉన్నాయనే భావనతో సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కోటరీ దీనిని లైట్ తీసుకుంటున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజగోపాల్ రెడ్డికి సుదీర్ఘ రాజకీయ అనుభవం, కోమటిరెడ్డి బ్రదర్స్ ఇమేజ్ ఉన్నప్పటికీ, ఆయన గతంలో పార్టీ మారిన నేపథ్యం ఉండటంతో హైకమాండ్ వద్ద ఆయన ఒత్తిళ్లకు తలొగ్గకూడదని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. సీనియర్లకు పదవులు ఇస్తూ పోతే కొత్తగా వచ్చిన వారికి లేదా రేవంత్ విధేయులకు అవకాశాలు దక్కవనే వ్యూహంతోనే వీరి కామెంట్లను ప్రభుత్వం తీవ్రంగా పట్టించుకోకుండా ఉపేక్షిస్తున్నట్లు కనిపిస్తోంది.
వీరు మరింతగా రెచ్చిపోయే అవకాశం
ఇక ఇద్దరు ప్రజాప్రతినిధులు రోడ్డెక్కి విమర్శలు చేస్తుంటే, వారికి సర్దిచెప్పడంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లేదా పార్టీ సీనియర్ నాయకత్వం విఫలమవుతోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అసంతృప్త నేతలను పిలిచి మాట్లాడి క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, అసమ్మతి వ్యాఖ్యలు చేస్తే చర్యలు ఉంటాయంటూ హెచ్చరికలు జారీ చేయడం మంటలపై నెయ్యి పోసినట్లు పనిచేస్తోంది. పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించాల్సిన సమస్యలు మీడియా ముందుకు రావడం చూస్తుంటే, పీసీసీ అధ్యక్షుడికి , ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అంతర్గత తిరుగుబాటు రూపంలో పెద్ద చికాకులు తప్పవు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి ఓపెన్‌గా గళం విప్పుతుండటంతో, లోలోపల నిధులు రాక, హామీలు నెరవేర్చలేక సతమతమవుతున్న మరికొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా వీరికి మద్దతుగా నిలిచే అవకాశాలు లేకపోలేదు.
అసంతృప్తి చల్లార్చేప్రయత్నాలు చేయాల్సిందే!
అసెంబ్లీలో మెజారిటీకి ముప్పు లేకపోయినప్పటికీ, స్వపక్ష ఎమ్మెల్యేలే రెబెల్స్ గా మారి అవినీతి, నిధుల మళ్లింపు ఆరోపణలు చేస్తే.. అది ప్రతిపక్షాలైన బిఆర్ఎస్, బిజెపిలకు ఉచితంగా పొలిటికల్ ఆయుధాలను అందించినట్లవుతుంది. స్థానిక ప్రజాప్రతినిధులకు నిధుల కొరత, ప్రాధాన్యతలేమి అనేది కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలకే పరిమితమైన సమస్య కాదు. రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి అసంతృప్త నేతలతో సమావేశమై టెండర్లు, నిధుల విడుదల మరియు పదవుల భర్తీపై స్పష్టమైన భరోసా ఇవ్వకపోతే, ఈ చిన్న నిప్పు రాబోయే రోజుల్లో రేవంత్ సర్కార్ స్థిరత్వాన్ని, ఇమేజ్ను దెబ్బతీసే పెద్ద దావానలంగా మారే ప్రమాదం ఉంది.

