India vs Pakistan: క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఆసక్తికరమైన పోరు అంటే భారత్, పాకిస్థాన్ (India vs Pakistan) జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లే. ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటే అభిమానులకు పండగే. అలాంటి క్రికెట్ ప్రేమికులకు ఇప్పుడు ఓ ఆసక్తికరమైన వార్త తెరపైకి వచ్చింది. వచ్చే ఏడాది కాలంలో భారత్, పాకిస్థాన్ జట్లు ఏకంగా 10 సార్లు తలపడే అవకాశం ఉందని తెలుస్తోంది. అండర్-19 ఆసియా కప్, రైజింగ్ స్టార్ ఆసియా కప్, ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ వంటి టోర్నీల్లో ఈ రెండు జట్లు తలపడే ఛాన్స్ ఉంది. ఈ పోరులో యువ సంచలనాలు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi), అభిషేక్ శర్మ (Abhishek Sharma) తమ బ్యాటింగ్‌తో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
నవంబర్లోనే నాలుగు పోరులు..?
భారత్, పాకిస్థాన్ మధ్య పోరుకు అండర్-19 ఆసియా కప్‌తో తెరలేవనుంది. నవంబర్ 8న ఈ టోర్నీలో తొలి మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు ఫైనల్‌కు చేరితే మరోసారి తలపడే అవకాశం ఉంటుంది. ఇక రైజింగ్ స్టార్ ఆసియా కప్‌లో నవంబర్ 22న భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. నవంబర్ 29న జరిగే ఫైనల్‌కు రెండు జట్లు చేరితే ఈ టోర్నీలోనూ రెండుసార్లు పోరు చూడొచ్చు. దీంతో నవంబర్లోనే నాలుగు మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది.
ఆసియా కప్‌లో మూడు సార్లు ఢీ..!
వచ్చే ఏడాది జూన్, జూలై నెలల్లో ఆసియా కప్ జరగనుంది. వన్డే ప్రపంచకప్‌కు ముందు ఈ టోర్నీని వన్డే ఫార్మాట్లో నిర్వహించే అవకాశం ఉంది. గ్రూప్ దశ, సూపర్-4, ఫైనల్.. ఇలా మూడు దశల్లోనూ భారత్, పాకిస్థాన్ తలపడే ఛాన్స్ ఉంటుంది. అయితే అధికారిక షెడ్యూల్, గ్రూపుల వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.
2027 వన్డే ప్రపంచకప్‌లోనూ మూడు మ్యాచ్‌లు?
2027 వన్డే ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ మెగా టోర్నీలోనూ భారత్, పాకిస్థాన్ మధ్య మూడు మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉందని అంచనా. గ్రూప్ దశ, సూపర్-7, నాకౌట్ లేదా ఫైనల్లో రెండు జట్లు ఎదురుపడితే అభిమానులకు మరోసారి హై వోల్టేజ్ క్రికెట్ వినోదం ఖాయం. అయితే ఇవన్నీ టోర్నీ ఫార్మాట్, జట్ల ప్రదర్శనపై ఆధారపడి ఉంటాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

