Prema Rawat 14 Ball Fifty: భారత క్రికెట్‌లో మరో ప్రపంచ రికార్డు నమోదైంది. ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రేमा రావత్ (Prema Rawat) మహిళల టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం 14 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా (Fatima Sana) పేరిట ఉన్న 15 బంతుల రికార్డును అధిగమించింది. 24 ఏళ్ల ప్రేమా హైదరాబాద్‌తో జరిగిన సీనియర్ మహిళల టీ20 ట్రోఫీ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది. ఆమె 14 బంతుల్లోనే అజేయంగా 50 పరుగులు చేసింది. ఇందులో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఆమె స్ట్రైక్ రేట్ ఏకంగా 357.14గా నమోదైంది. బ్యాట్‌తోనే కాకుండా బంతితోనూ రాణించి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించింది.

పాకిస్థాన్ కెప్టెన్ రికార్డు బద్దలు..

మహిళల టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ చేసిన రికార్డు గతంలో ఫాతిమా సనా పేరిట ఉండేది. 2026 మేలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఆమె కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించింది. ఇప్పుడు ప్రేమా రావత్ 14 బంతుల్లోనే ఈ ఘనత సాధించి ఆ రికార్డును అధిగమించింది. దీంతో మహిళల టీ20 క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ సాధించిన క్రీడాకారిణిగా నిలిచింది.

ఉత్తరాఖండ్‌కు భారీ విజయం..

పుణెలోని గహుంజే MCA క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఉత్తరాఖండ్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 2 వికెట్లకు 187 పరుగులు చేసింది. రాఘవి బిష్ట్ 72 పరుగులతో అదరగొట్టగా, ప్రేమా రావత్ చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. లక్ష్య ఛేదనలో హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 98 పరుగులకే పరిమితమైంది. దీంతో ఉత్తరాఖండ్ 89 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. ప్రేమా రావత్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

బౌలింగ్‌లోనూ అదరగొట్టిన ప్రేమా..

బ్యాటింగ్‌లో 14 బంతుల్లో 50 పరుగులు చేసిన ప్రేమా బౌలింగ్‌లోనూ సత్తా చాటింది. తన నాలుగు ఓవర్లలో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టింది. ఈ ప్రదర్శనతో ఆల్‌రౌండ్ ప్రతిభను చాటుకుంది.

టీ20 ప్రపంచకప్ జట్టులోనూ చోటు..

ప్రధానంగా లెగ్ స్పిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రేమా రావత్‌కు 2026 మహిళల టీ20 ప్రపంచకప్ భారత జట్టులోనూ అవకాశం లభించింది. శ్రేయాంక పాటిల్ గాయంతో జట్టుకు దూరం కావడంతో ఆమెకు చోటు దక్కింది. గతంలో ఇండియా ఏ తరఫున మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో ఐదు మ్యాచ్‌ల్లో ఎనిమిది వికెట్లు తీసుకుంది. ఆస్ట్రేలియా పర్యటనలోనూ మూడు టీ20ల్లో ఏడు వికెట్లు పడగొట్టింది. భారత సీనియర్ జట్టు తరఫున ఏడు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి ఏడు వికెట్లు సాధించింది. ఇప్పుడు బ్యాటింగ్‌లోనూ ప్రపంచ రికార్డు సృష్టించి తన సత్తా చాటింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..