Mumbai Indians: హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ అంశం ఇప్పుడు ఐపీఎల్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం ఈ చర్చలు తుది దశకు చేరుకున్నాయి. అయితే, ఇదే సమయంలో ముంబై ఇండియన్స్ (MI) స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను వేరే ఆటగాడితో ఎక్స్ఛేంజ్ చేసే ప్రసక్తే లేదని ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం స్పష్టం చేసింది. మీడియాలో సూర్యకుమార్ స్వాపింగ్ గురించి కూడా ప్రచారం జరిగినప్పటికీ, ముంబై యాజమాన్యం దాన్ని పూర్తిగా కొట్టిపారేసింది. టీ20 వరల్డ్ కప్ విజేత అయిన సూర్యకుమార్ గత సీజన్‌లో 13 మ్యాచ్‌ల్లో 270 పరుగులు మాత్రమే చేసి ఆకట్టుకోలేకపోయినప్పటికీ, 2025 సీజన్‌లో మాత్రం 16 మ్యాచ్‌లలో ఏకంగా 717 పరుగులు సాధించి అద్భుతమైన ఫామ్‌ను కనబరిచాడు. అందుకే సూర్యకుమార్‌ను వదులుకునే ఆలోచనే లేదని, అతని ట్రేడింగ్‌పై అసలు చర్చలే జరగలేదని ముంబై వర్గాలు తెలిపాయి. అయితే, గత మూడు సీజన్లుగా తమ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యాను పంజాబ్ కింగ్స్ (PBKS) స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌తో స్వాప్ చేసే విషయంపై మాత్రం ముంబై క్లారిటీ ఇవ్వలేదు. అటు పంజాబ్ కింగ్స్ కూడా ఈ ప్రచారాన్ని ఖండించకపోవడం విశేషం.

మరోవైపు, ఈ రేసులోకి రాజస్థాన్ రాయల్స్ (RR) కూడా వచ్చి చేరింది. యశస్వి జైస్వాల్, రవి బిష్ణోయ్ వంటి ఆటగాళ్ల పేర్లు ఈ చర్చల్లోకి వచ్చాయి. కానీ, ఒక ఫ్రంట్‌లైన్ ఫాస్ట్ బౌలర్ లేని ఏ డీల్‌పైనా ముంబై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. రాజస్థాన్ తమ ప్రధాన పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను వదులుకోవడానికి సిద్ధంగా ఉండే అవకాశం చాలా తక్కువ. గత సీజన్‌లో బౌల్ట్, దీపక్ చాహర్ అనుకున్నంతగా రాణించకపోవడంతో ముంబై ఇండియన్స్ ఇప్పుడు ఒక టాప్ క్లాస్ వేగవంతమైన బౌలర్ కోసం ట్రాన్స్‌ఫర్ మార్కెట్ (Transfer Market)లో వెతుకుతోంది. బౌల్ట్ 5 మ్యాచ్‌ల్లో 2 వికెట్లు మాత్రమే తీయగా, చాహర్ గత సీజన్ 8 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు, 2025లో 14 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఈ ఇద్దరిలో ఒకరిని, ముఖ్యంగా బౌల్ట్‌ను రిలీజ్ చేసినా ఆశ్చర్యం లేదు. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి ఫ్రాంచైజీకి ఇంకా రెండు వారాల సమయం ఉంది.

ప్రస్తుతం ముంబై జట్టులో బ్యాటింగ్ విభాగానికి కొదవలేదు. రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, విల్ జాక్స్ తో పాటు బ్యాటింగ్ చేయగల మిచెల్ శాంట్నర్ కూడా ఉన్నారు. వీరంతా దాదాపు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకే చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ ఆయుష్ మ్హత్రేను ముంబై పెద్దగా పట్టించుకోలేదు, ఎందుకంటే అతనికి తుది జట్టులో బెర్త్ గ్యారెంటీ ఉండదు. మొదట్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తో హర్షిత్ రాణా, ఒక బ్యాటర్‌ను ఇచ్చి పాండ్యాను తీసుకునేందుకు చర్చలు జరిగినప్పటికీ, తమ పేసర్‌ను ఇవ్వడానికి కేకేఆర్ ఒప్పుకోలేదు. ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రా లేని సమయంలో భారత టీ20 జట్టుకు ప్రధాన పేసర్‌గా వ్యవహరిస్తున్న అర్ష్‌దీప్ సింగ్ ముంబై అవసరాలకు సరిగ్గా సరిపోతాడు. అందుకే ఈ ఎక్స్ఛేంజ్ చర్చలు ముందుకు సాగాయి. కాకపోతే ఇక్కడ అసలు చిక్కు ముడి హార్దిక్ పాండ్యా నిర్ణయమే. ఏం జరుగుతుందో చూద్దాం..